కన్నడ నుంచి ఒక మిస్టరీ థ్రిల్లర్ ఈ నెల 26వ తేదీన ఓటీటీకి వచ్చింది .. ఆ సినిమా పేరే 'వృత్త'. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాలో కథానాయకుడిగా మాహిర్ మొహియుద్దీన్ నటించాడు. శివకుమార్ నిర్మించిన ఈ సినిమాకి, లిఖిత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ప్రయోగాత్మక చిత్రమనే టాక్ వచ్చింది. 'జీ 5'లో తెలుగులోను అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

కథ: సిద్ధార్థ్ (మాహిర్ మొహియుద్దీన్) కొన్ని రోజులుగా చాలా టెన్షన్ తో ఉంటాడు. అందుకు కారణం తను వెంటనే తీర్చవలసిన 30 లక్షల అప్పు. తాను ఆ అప్పు ఎందుకు చేయవలసి వచ్చిందనేది తనకి మాత్రమే తెలుసు. ఆ అప్పు తీర్చడంలో తన వాళ్లు సహకరించరనీ అతనికి తెలుసు. అందువల్లనే పేరెంట్స్ కీ .. చెల్లెలికి చెప్పకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. 

ఒక వైపున గతంలో తనతో పాటు కలిసి కొంతదూరం ప్రయాణించిన 'ప్రియ' .. మరో వైపున తన కారణంగా నెల తప్పానని చెబుతున్న సుస్మితకి సంబంధించిన ఆలోచనలు అతనిని సతమతం చేస్తూ ఉంటాయి. ఇక మరో వైపున తన బాకీ తీర్చకపోతే ఇంటికి వచ్చి గొడవచేస్తానని బెదిరించే అప్పులవాడు. ముందు ఈ సమస్య నుంచి బయటపడాలనే ఉద్దేశంతో, ఒక స్నేహతుడికి సిద్ధార్థ్ కాల్ చేస్తాడు. అతను ఏర్పాటు చేసిన డబ్బు కోసం రాత్రివేళలో 'పుష్పగిరి' బయలుదేరుతాడు. 

కారులో వెళుతున్న అతనికి, తనని వ్యాన్ లో ఎవరో ఫాలో చేస్తున్నారని అనిపిస్తుంది. కొంత దూరం వెళ్లిన తరువాత అతనికి ఒక కాల్ వస్తుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడనీ .. వచ్చి రక్షించమని అవతల నుంచి ఒక స్త్రీ ప్రాధేయపడింది. ఆ కాల్ తనకి ఎలా వచ్చిందనేది అతనికి అర్థం కాదు. వాళ్లను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే, అతనిని ఫాలో అవుతున్న వ్యాన్ వచ్చి ఢీకొడుతుంది. దాంతో అతను లోయలో పడిపోతాడు. అక్కడి నుంచి అతను ఎలా బయటపడతాడు? రక్షించమంటూ అతనికి కాల్ చేసింది ఎవరు? అనేది కథ.         

విశ్లేషణ: ఏ కథలోనైనా .. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలి అనే విషయంపైనే ఆ కథ ఆసక్తికరంగా నడవడమనేది ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని కథల బలాన్ని ఆఖరిలో వచ్చే అంశమే నిర్ణయిస్తుంది. అలా చివరిలో వచ్చే ట్విస్ట్ ను ప్రధానంగా చేసుకున్న ఒక కథతో రూపొందినదే 'వృత్త'.

ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండవు .. ఎక్కువ లొకేషన్స్ ఉండవు. కథలో 95 శాతం వరకూ ఒక రాత్రిలో ఒక్క పాత్రపైనే నడుస్తుంది. అలాగే కథలో ఎక్కువ భాగం కారు డ్రైవింగ్ తోనే కొనసాగుతుంది. ఇతర పాత్రలు ఫోన్ కాల్స్ ద్వారా మాత్రమే ప్రధానమైన పాత్రకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. కథను ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవడం కొత్తగానే అనిపిస్తుంది. కాపాడమంటూ అతనికి కాల్ చేసింది ఎవరు? ఫాలో అవుతున్నది ఎవరు? అనే ఒక కుతూహలాన్ని రేకెత్తించిన విధానం బాగుంది. 

అయితే ఏ కథ అయినా కొంతవరకూ అర్థమయ్యేలా చెప్పి .. మిగతా కథను సస్పెన్స్ లో పెడితే ఆడియన్స్ ఫాలో అవుతారు. కానీ అసలు ఏం జరుగుతుంది? అనేది తెలుసుకోవడానికి చివరి వరకూ ప్రేక్షకులను వెయిట్ చేయించే కంటెంట్ ఇది. అదైనా సామాన్య ప్రేక్షకులకు అర్థమవుతుందా అంటే .. లేదనే చెప్పాలి. చివరికి హీరో ఎలాంటి అయోమయానికి లోనవుతాడో .. అదే పరిస్థితుల్లో ప్రేక్షకుడు మిగిలిపోతాడు.

పనితీరు: తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో నడిచే ఒక డిఫరెంట్ కంటెంట్ ను దర్శకుడు తయారు చేసుకున్నాడు. కథ అంతా కూడా క్లైమాక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఆ క్లైమాక్స్ లో క్లారిటీ లేకపోవడం అయోమయంలో పడేస్తుంది. గౌతమ్ కృష్ణ ఫొటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ఆంటోని సంగీతం .. సురేశ్ ఆర్ముగం ఎడిటింగ్ కథను మరింత పట్టుగా ప్రెజెంట్ చేశాయి. 

ముగింపు: కథ మొత్తం చివరిలో వచ్చే ఒక ట్విస్ట్ పై ఆధారపడేలా గతంలో కొంతమంది రచయితలు కొన్ని కథలను అందించారు. కథ చిన్నదిగానే ఉన్నప్పటికీ చివరిలోని ట్విస్ట్ గొప్పగా అనిపిస్తుంది. ఇది ఆ తరహా కథనే. అయితే చివర్లో వచ్చే ఆ ట్విస్ట్ కోసం అక్కడి వరకూ ట్రావెల్ చేయడం, ఈ జోనర్ పై ప్రేక్షకులకు ఉండే ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది.