'రాత్ అకేలీ హై' .. 2020లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. హనీ ట్రెహన్ దర్శత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'రాత్ అకేలీ హై :ది బన్సాల్ మర్డర్స్' రూపొందింది. నవాజుద్దీన్ సిద్ధికీ .. చిత్రాంగద సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. 

కథ: ఉత్తర ప్రదేశ్ లోని 'కాన్పూర్'లో ఈ కథ మొదలవుతుంది. అక్కడ బన్సాల్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది. మహేంద్ర బన్సాల్ .. అతని కుమారుడు ప్రశాంత్ బన్సాల్ .. మనవడు మాధవ్ బన్సాల్ .. మనవరాలు మీరా బన్సాల్ .. అందరూ కూడా తోట బంగ్లాకి చేరుకుంటారు. మీరా కొడుకు అర్జున్ చనిపోయి ఏడాది అవుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. 

ఒక రోజున ఆ ఇంటి ఆవరణలో చాలా కాకులు చనిపోయి కనిపిస్తాయి. దాంతో ఆ ఇంట్లో వాళ్లపై ఏదైనా క్షుద్ర ప్రయోగం జరిగిందా అనే అనుమానం మొదలవుతుంది. అందుకు సంబంధించిన శాంతి పూజలు జరపడంలో ఆ కుటుంబానికి విశ్వాస పాత్రురాలైన గీతామాత (దీప్తి నావల్) నిమగ్నమై ఉంటుంది. ఆ ఇంట్లోనే బన్సాల్ కుటుంబానికి చెందిన ఆరవ్ .. అతని తల్లిదండ్రులు ఉంటారు. మాదక ద్రవ్యాలకు బానిసైన ఆరవ్, ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడతారు. 

దాంతో పోలీస్ ఆఫీసర్ జతిల్ (నవాజుద్దీన్ సిద్ధికీ) రంగంలోకి దిగుతాడు. ప్రాణాలతో బయటపడిన మీరా, హత్యలు చేసింది ఆరవ్ అనీ, ఆ తరువాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంది. ఫోరెన్సిక్ నిపుణురాలు పణికర్ (రేవతి) కూడా అదే వాస్తవమని కమిషనర్ తో చెబుతుంది. కానీ జతిల్ ను అనేక సందేహాలు చుట్టుముడతాయి. దాంతో అతను మరింత లోతుగా పరిశోధించడం మొదలెడతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? హంతకులు ఎవరు? హత్యల వెనకున్న అసలు కారణాలు ఏమిటి? అనేది మిగతా కథ.            

విశ్లేషణ: కొన్నేళ్ల క్రితం వచ్చిన 'రాత్ అకేలీ హై' సినిమాకి ఇది సీక్వెల్ అయినప్పటికీ, ఆ కథకు .. ఈ కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది ఒక కొత్త కేసుతో మొదలవుతుంది. క్షుద్రశక్తుల కోణం నుంచి మొదలైన ఈ కథ, ఆరంభంలోనే ప్రేక్షకులలో కుతూహలాన్ని పెంచుతుంది. ఆ తరువాత నుంచి మాదక ద్రవ్యాలు .. వారసత్వ పోరాటాలు .. కుట్ర కోణాలు .. పోలీస్ వ్యూహాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.

ప్రధానమైన పాత్రలన్నింటినీ దర్శకుడు చాలా వేగంగా పరిచయం చేశాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడిచే తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పాత్రల వైపు నుంచి అనుమానాలు .. పోలీస్ వైపు నుంచి అనుమానాలు .. ప్రేక్షకులను కథ వెంట పరిగెత్తిస్తాయి. ఎవరి చెబుతున్నది నిజం? ఎవరి గుట్టు బయటపడనుంది? అనే సందేహం ప్రేక్షకులను అలా కూర్చోబెడుతుంది. 

సాధారణంగా ఈ తరహా కథల్లో ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిపై అనుమానాన్ని కలిగిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కథలో మాత్రం క్లైమాక్స్ ను ఆడియన్స్ గెస్ చేయలేరు. ఆ క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి సంతృప్తిని కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఇది మార్కులు కొట్టేస్తుంది. 

పనితీరు: ఈ కథను అల్లుకున్న తీరు బాగుంది. అనేక కోణాల్లో కథను మలుపులు తిప్పుతూ వెళ్లి ఇచ్చిన ముగింపు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులంతా చాలా బాగా చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు తమవంతు సపోర్టును అందించాయి.  

ముగింపు: ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బున్నవారి అహంకారానికీ .. పేదవాళ్ల ప్రతీకారానికి మధ్య నడిచే కథ ఇది. ఈ రెండు కోణాల నుంచి సాగే ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు లేవుగానీ, హత్యలకు సంబంధించిన సన్నివేశంలో హింస ఎక్కువగా కనిపిస్తుంది అంతే. ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే సినిమా ఇది.