తెలుగులో రూపొందిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సిరీస్ లో వరుణ్ తేజ్ .. ప్రియాంక జైన్ .. ఉత్తేజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 19 నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 ఎపిసోడ్స్ గా పలకరించిన ఈ సిరీస్ కథేమిటనేది చూద్దాం. 

కథ: డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) కంటి డాక్టర్. హైదరాబాదులో ఒక క్లినిక్ ను నడుపుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇతరుల జీవితాలలో ఏం జరుగుతుందనేది రహస్యంగా గమనించడం .. తెలుసుకోవడం అతని హాబీ. తాను ఉంటున్న అపార్టుమెంటులోని రహస్యాలను కూడా వాచ్ మెన్ ద్వారా తెలుసుకుంటూ, అందుకు లంచంగా అతనికి ఎంతోకొంత ముట్టజెబుతూ ఉంటాడు. ఆ కుతూహలంతోనే అతను కొత్తరకం కళ్లద్దాలను తయారు చేస్తాడు. 

'ఐ' చెకప్ కోసం తన క్లినిక్ కి వచ్చిన వారిపై తన ప్రయోగాన్ని అమలుపరుస్తూ ఉంటాడు. ఆ తరువాత నుంచి వాళ్లు 12 గంటల పాటు చూసే దృశ్యాలను .. ఓ నాలుగు నిమిషాల పాటు తన దగ్గరున్న కళ్లద్దాలలో నుంచి చూసే ఒక కొత్త పద్ధతిని కనుక్కుంటాడు. అలా వాళ్ల వ్యక్తిగత విషయాలను .. రహస్యాలను తెలుసుకుంటూ మానసిక పరమైన ఆనందాన్ని పొందుతుంటాడు. అయితే ఈ వ్యవహారమంతా తన క్లినిక్ లో పనిచేస్తున్న కవిత - బోస్ లకు కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ నేపథ్యంలోనే మాధవి ( ప్రియాంక జైన్) గౌరీ శంకర్ (ఉత్తేజ్) దంపతులు ఆ క్లినిక్ కి వస్తారు. 

గౌరీశంకర్ ఓ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికీ .. మాధవికి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. మాధవిని చూడగానే డాక్టర్ నయన్ మనసు పారేసుకుంటాడు. తాను కనిపెట్టిన కళ్లద్దాలతో, వాళ్ల జీవితాన్ని రహస్యంగా గమనించడం మొదలుపెడతాడు. మాధవి తన భర్తను హత్య చేయడాన్ని అతను ఆ కళ్లద్దాల ద్వారానే తెలుసుకుంటాడు. అందుకు కారణమేమిటో తెలుసుకోవడం కోసం అతను నేరుగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? అతను మాధవిని కాపాడతాడా? చట్టానికి అప్పగిస్తాడా? అసలు ఆమె తనకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి కారణమేంటి? అనేది కథ.

విశ్లేషణ: పక్క వాళ్ల జీవితాలలో ఏం జరుగుతోందనేది తెలుకోవడానికి కొంతమంది చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలా ఇతరుల జీవితాలలోకి తొంగిచూడటంలో వాళ్లు ఒక రకమైన ఆనందాన్ని పొందుతుంటారు. అలాంటి మానసిక ప్రవృత్తిని కలిగిన ఒక కంటి డాక్టర్ కథ ఇది. ఇతరుల జీవితాలలోని రహస్యాలను తెలుసుకుని, వారి బలహీనతలను తమకి అనుకూలంగా మార్చుకోవాలని చూసేవారు చాలామంది ఉంటారు. అలాంటి ఒక లైన్ ను ఎంచుకోవడంలోనే దర్శకురాలిగా స్వాతి ప్రకాశ్ మంచి మార్కులు కొట్టేశారని చెప్పాలి. 

మానసికంగా కాస్త తేడాగా ఉన్న ఒక కంటి డాక్టర్ .. అందుకు తగినట్టుగా అతను చేసే పరిశోధన .. ఏజ్ గ్యాప్ భార్యభర్తలు .. అనాథలైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు .. 'రఘు' అనే హిందీ టీచర్ .. కథలు చెప్పడంలోనే కాలక్షేపం చేసే 'బోస్' అనే ఒక పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్రలన్నీ కూడా వేరువేరుగా సంచరించేవే అయినా, ఆ పాత్రలన్నింటినీ కలుపుతూ అల్లుకున్న కథ చాలా  ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆయా పాత్రలపై అనుమానాలను రేకెత్తించే విధానం కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

డాక్టర్ .. టీచర్ .. పోలీస్ ఆఫీసర్ వంటి పాత్రలను ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. గౌరవప్రదమైన ఈ వృత్తులలో ఉన్నవారి ఆలోచనలు పెడదారి పడితే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ కథ ఆవిష్కరిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ కి కథ చిక్కబడుతూ .. ప్రేక్షకులు జారిపోకుండా చూస్తుంది. అయితే హీరో చేసిన ప్రయోగం .. కళ్లద్దాలు పనిచేసే తీరును గురించి ప్రెజెంట్ చేసిన విధానం సామాన్య ప్రేక్షకులకు ఎంతవరకూ అర్థమవుతుందనేది ఆలోచన చేయవలసిన విషయమే.

పనితీరు: సంబంధం లేని పాత్రలను కలుపుకుంటూ కథలో భాగం చేసిన విధానం దర్శకురాలి ప్రతిభకు అద్దం పడుతుంది. సాఫ్ట్ గా కనిపించే ప్రియాంక జైన్ తో అందుకు పూర్తి భిన్నమైన పాత్రను చేయించడం కొత్తగా అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ ను పక్కన పెడితే, మంచి అవుట్ పుట్ ను ఇచ్చిన సిరీస్ గా చెప్పుకోవచ్చు.

ప్రియాంక జైన్ .. వరుణ్ సందేశ్ .. ఉత్తేజ్ .. అలీ రెజా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే బోస్ పాత్రను చేసిన అతను కూడా మంచి ఈజ్ చూపించాడు.

ముగింపు: ఎదుటివారి బలహీనతలను గురించి తెలుకోవాలనే కుతూహలం ఉండటం, మన బలహీనత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక మనచుట్టూ మంచి వాళ్ల మాదిరిగా తిరుగుతూ కనిపించేవారిలోను వీలును బట్టి బయటికొచ్చే విలన్స్ ఉన్నారనే సందేశాన్ని ఇచ్చిన సిరీస్ ఇది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక విలక్షణమైన వెబ్ సిరీస్ గా 'నయనం' గురించి చెప్పుకోవచ్చు.