'డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్' (జీ 5) మూవీ రివ్యూ!

  • మమ్ముట్టి కథానాయకుడిగా మలయాళ మూవీ 
  • మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే కంటెంట్ 
  • జనవరిలో థియేటర్స్ లో జరిగిన రిలీజ్ 
  • ఆసక్తికరంగా నడిచే కథాకథనాలు 
  • కథకి మరింత బలాన్ని చేకూర్చే ఫైనల్ ట్విస్ట్

మలయాళంలో మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్'. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమా, జనవరి 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. 8 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 18 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 19 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: డొమినిక్ (మమ్ముట్టి) గతంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తాడు. అయితే కొన్ని కారణాల వలన అతను తన జాబ్ ను వదులుకోవలసి వస్తుంది. దాంతో అతను ప్రైవేట్ డిటెక్టివ్ గా మారతాడు. ఒక చిన్న పోర్షన్ అద్దెకి తీసుకుని కేసుల కోసం వెయిట్ చేస్తుంటాడు. అదే సమయంలో అతని దగ్గర విక్కీ (గోకుల్ సురేశ్) అసిస్టెంట్ గా చేరతాడు. ఒక రోజున ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) డొమినిక్ దగ్గరికి వస్తుంది. తాను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. 

ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని డొమినిక్ ని మాధురి కోరుతుంది. అతను తనకి ఇవ్వవలసిన నాలుగు నెలల రెంట్ ఇవ్వవలసిన పనిలేదని అంటుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె అదృశ్యమైందని తెలిసి షాక్ అవుతాడు.

పూజ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ను కలుసుకోవడానికని వెళ్లి తిరిగి రాలేదని ఫ్రెండ్స్ చెబుతారు. అప్పటికి వాళ్ల మధ్య బ్రేకప్ జరిగిపోయి రెండేళ్లు అయిందని అంటారు. దాంతో కార్తీక్ ఆచూకీని కనుక్కునే పనిలోపడతాడు డొమినిక్. చివరిసారిగా కార్తీక్ - పూజ కలుసుకున్న 'మునార్'కి తన అసిస్టెంట్ విక్కీతో కలిసి వెళతాడు. పూజ రెండు వారాల క్రితం మిస్సయితే, కార్తీక్ రెండేళ్ల క్రితమే కనిపించకుండా పోయాడని అతని చెల్లెలు నందిత (సుస్మిత భట్) ద్వారా తెలిసిషాక్ అవుతాడు? ఆ తరువాత అతను ఏం చేస్తాడు? ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తాడు? అనేది కథ. 

విశ్లేషణ: సాధారణంగా నేరం జరిగిన ప్రదేశం నుంచి ప్రతి చిన్న 'క్లూ'ను సేకరిస్తుంటారు. ఎందుకంటే ఎంతటి పెద్ద నేరమైనా ఒక చిన్న 'క్లూ' కారణంగా బయటపడిపోతూ ఉంటుంది. కొన్ని నేరాల విషయంలో ఆధారాలే వెతుక్కుంటూ వస్తుంటాయి. నేరస్థులు ఎవరనేది బయటపెట్టేస్తూ ఉంటాయి. ఆ రెండో రకానికి చెందిన కథగా 'డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్' కనిపిస్తుంది. 

సాధారణంగా పర్స్ పారేసుకోవడమో .. పోగొట్టుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఆ పర్స్ ను తిరిగి ఇవ్వడానికి జరిగిన ప్రయత్నం ఎక్కడి వరకూ వెళుతుందనే ఈ కథను దర్శకుడు అల్లుకున్న విధానం అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎక్కడికక్కడ కథ అనేక మలుపులు తీసుకుంటూ ఉత్కంఠను రేపుతోంది. పట్టుగా సాగే ఈ కథలో నుంచి ప్రేక్షకులు జారిపోకుండా ఉంటారని చెప్పచ్చు. 

రెండు వారాల క్రితం మిస్సైన యువతీ, రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన యువకుడిని ఎలా  కలుసుకోవడానికి వెళ్లింది? అనే ఒక అంశం, ఆడియన్స్ ను అలా కట్టిపడేస్తుంది. కదలకుండా ఈ కథను ఫాలో అయ్యేలా చేస్తుంది. ఫైనల్ ట్విస్ట్ ఆడియన్స్ ఎంతమాత్రం గెస్ చేయలేనిదిగా ఉంటుంది. కథనం నిదానంగా సాగుతున్నట్టుగా అనిపించినప్పటికీ, ఎక్కడా బోర్ అనిపించకుండా ట్రావెల్ చేయిస్తుంది.

పనితీరు: ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మమ్ముట్టి గతంలో చాలా సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలో, బడ్జెట్ అంతగా లేని ఓ సాదాసీదా ప్రైవేట్ డిటెక్టివ్ గా ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. తనకి అందుబాటులో ఉన్న వనరులతోనే ఆయన ఒక కేసును ఎలా పరిష్కరించాడనేది, కాస్త కామెడీ టచ్ తో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

మమ్ముట్టి .. గోకుల్ సురేశ్ .. సుస్మిత భట్ .. నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గౌతమ్ మీనన్ టేకింగ్ .. విష్ణుదేవ్ ఫొటోగ్రఫీ .. దర్బుక శివ నేపథ్య సంగీతం .. ఆంటోనీ ఎడిటింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెడతాయి. 

ముగింపు: మమ్ముట్టి కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది. బయట ప్రపంచం ఏ మాత్రం తెలుసుకోలేని ఒక హత్యా నేరాన్ని లేడీస్ పర్స్ ఎలా పట్టించిందనేది ఈ కథ, ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సింపుల్ కంటెంట్ గా కనిపించే ఈ మిస్టరీ థ్రిల్లర్, ఈ జోనర్ ను ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చుతుంది.

Movie Details

Movie Name: Dominic And The Ladies Purse

Release Date: 2025-12-19

Cast: Mammootty, Gokul Suresh,Susmitha Bhat, Vineeth, Shine Tom Chacko

Director: Gautham Vasudev Menon

Producer: Mammootty

Music: Darbuka Siva

Banner: Mammootty kampany

Review By: Peddinti

Dominic And The Ladies Purse Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews