జాతిరత్నాలు, మ్యాడ్‌, మ్యాడ్‌ 2 చిత్రాల విజయాల తరువాత ఆ తరహా చిత్రాల పరంపర తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువైంది. ఆ కోవలోనే వచ్చిన చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. నరేష్‌ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా, జీవన్‌, రాజ్‌కుమార్‌, వంశీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: గుర్రం పాపిరెడ్డి (నరేష్‌ ఆగస్త్య) ఓ బ్యాంక్‌ దోపిడీకి ప్రయత్నించి, ఫెయిల్‌ కావడంతో ఓ పథకం ప్రకారం ఎర్రగడ్డ పిచ్చాసుప్రతిలో జాయిన్‌ అవుతాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న సౌదామిని (ఫరియా  అబ్దుల్లా)తో కలిసి డబ్బు కొల్లగొట్టడానికి ఓ ప్లాన్‌ వేస్తాడు. అందులో భాగంగా శ్రీశైలంలో ఓ శ్మశానంలోని శవాన్ని తవ్వి తీసుకొచ్చి.. దాన్ని హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న శ్మశానంలో ఉన్నకళింగ పోతురాజు సమాధిలో పెట్టాలని అనుకుంటారు. 

ఈ పనిని చేయడం కోసం డబ్బు ఇస్తానని ఆశ చూపి గొయ్యి అలియాస్‌ కళింగ గవ్వరాజు (జీవన్‌), మిలటరీ (రాజ్‌కుమార్‌ కసిరెడ్డి), చిలిపి (వంశీధర్‌ గౌడ్‌)లను ఒప్పిస్తాడు. ఇక శవాలు మార్చడం కోసం ప్రయత్నించిన పాపిరెడ్డి, సౌదామిని అండ్‌ గ్యాంగ్‌కు ఎదురైన సవాళ్లు ఏమిటి? ఈ కథకు కళింగ రాజులకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు వుడ్‌రాజు (యోగిబాబు) ఎవరు? అనేది మిగతా కథ 

విశ్లేషణ: ఇదొక డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌. ఓ కన్‌ఫ్యూజన్‌ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనే లక్ష్యంతో దర్శకుడు అల్లుకున్న కథ ఇది. సినిమా ప్రారంభంలో కాస్త తడబడినట్లుగా బోరింగ్‌గా అనిపించినా, కథలోకి వెళ్లగానే ఆసక్తి మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి కథ ముగిసే వరకు అక్కడ అక్కడ నవ్విస్తూ, ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో షాకిసూ కథ నడిపిన విధానం బాగుంది. హీరో నరేష్‌, హీరోయిన్‌ ఫరియా  అబ్దుల్లాలు కలిసి ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకోవడం, ఇందుకోసం వీళ్లు పన్నిన పన్నాగం ఆకట్టుకుంటుంది. కళింగ రాజ్యంకు ఈ కథకు ముడిపెట్టిన విధానం అలరిస్తుంది.

 ప్రథమార్థంలో తొలి అరగంట కాస్త స్లో అయినా ఆ తరువాత కథనం ఊపందుకుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లోని ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. తొలిభాగం ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్‌లో కొన్ని కోర్టు సన్నివేశాలు కారణంగా సాగదీతగా అనిపిస్తుంది. వైద్యనాధన్‌ జిల్లా జడ్జిగా బ్రహ్మానందం పాత్రతో నవ్వులు పూయించే ప్రయత్నం చేసినా..అది పెద్దగా వర్కవుట్‌ అవ్వలేదు. ఇక శ్మశానంలో శవాలు మార్చే సన్నివేశాల్లో వినోదం ప్రేక్షకులను నవ్విస్తుంది. 

దర్శకుడు ప్రేక్షకులను థ్రిల్ల్‌ చేయాలనే భావనతో ట్విస్ట్‌లపై పెట్టిన ఎఫర్ట్‌ మరింత వినోదం పండించడంలో పెట్టి.. మరికొన్ని కామెడీ సన్నివేశాలను వర్కవుట్‌ చేసి ఉంటే కథనం ఊపందుకునేది. కథలో కన్‌ఫ్యూజన్‌ కూడా ఎక్కువ ఉండటంతో ప్రేక్షకుడికి అది భారంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వినోదాత్మకమైన కథలో  ప్రేక్షకుడి బుర్రకు పదును పెట్టాలనే ఆలోచనతో దర్శకుడు చేసిన కన్‌ఫ్యూజన్‌ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మైనస్‌గా మారింది. అయితే పతాక సన్నివేశాలు మాత్రం ఆడియన్స్‌కు సంతృప్తినిస్తాయి. 

నటీనటుల పనితీరు: గుర్రం పాపిరెడ్డిగా  నరేష్‌ ఆగస్త్య నటన ఆకట్టుకుంటుంది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఆయన మెప్పించాడు. సౌదామనిగా ఫరియా అబ్దుల్లా పర్‌పార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కామెడీ పాత్రలను పండించే అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్‌ల్లో ఫరియా కూడా ఉంటుంది. ఆమె హావాభావాలు, డైలాగ్‌  డెలివరీ అలరిస్తుంది. గొయ్యి పాత్రలో జీవన్‌ తనదైన శైలిలో నటించాడు. 

బ్రహ్మానందం పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. జడ్జి పాత్రలో వినోదాన్నిపంచాడు. యోగిబాబు పాత్ర నిడివి చాలా తక్కువ. రాజ్‌కుమార్‌, వంశీధర్‌ గౌడ్‌ తమ సహజ నటనతో నవ్వించారు. దర్శకుడు ప్రారంభంలో తడబడిన ఆ తరువాత కథను నడిపిన విధానంతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు పర్వాలేదు. 


ఫైనల్‌గా:  కొన్ని నవ్వుల కోసం.. కొన్ని ట్విస్ట్‌ల కోసం 'గుర్రం పాపిరెడ్డి'ని చూడొచ్చు.. వినోదాత్మక సినిమాలను థియేటర్‌లో క్రమం తప్పకుండా చూసేవారికి టైమ్‌ పాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.