రక్షిత్ అట్లూరి పేరు వినగానే 'పలాస' సినిమా గుర్తుకు వస్తుంది. అలాగే కోమలీ ప్రసాద్, పోలీస్ ఆఫీసర్ పాత్రలలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఇద్దరూ జంటగా నటించిన సినిమానే 'శశివదనే'. సాయి మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథ ఇది. 

కథ: గోదావరి లంకల గ్రామానికి చెందిన యువకుడు రాఘవ ( రక్షిత్ అట్లూరి). చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రాఘవ ఆలనా పాలన తండ్రి జానయ్య ( శ్రీమాన్) చూసుకుంటాడు. తన స్నేహితుడైన 'కిట్టూ'తో ఆడుతూ పాడుతూ తిరుగుతూనే, రాఘవ డిగ్రీ పూర్తి చేస్తాడు. పై చదువులకు పట్నం వెళ్లాలని అనుకుంటున్న సమయంలోనే, శశి( కోమలీ ప్రసాద్) తారసపడుతుంది. తొలి చూపులోనే రాఘవ మనసు పారేసుకుంటాడు. ఆమెది కూడా ఆ పక్కనే ఉన్న ఊరే.

చిన్నతనంలోనే శశి తల్లిదండ్రులను కోల్పోతుంది. అమ్మమ్మ దగ్గరే పెరుగుతుంది. శశికి బావ వరసయ్యే ఒక వ్యక్తి ఉంటాడు. వ్యసనాలకు బానిసైన అతను, శశిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. అతని బారి నుంచి తనని తాను ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఆమెకి, రాఘవ పరిచయం కొండంత బలాన్ని ఇస్తుంది. ఆమె కూడా అతనిని ప్రేమించడం మొదలుపెడుతుంది. 

ఈ ఇద్దరి ప్రేమ విషయం శశి బావకి తెలిసిపోతుంది. శశిని తన దానిగా చేసుకోవాలంటే, రాఘవను అడ్డు తప్పించాలని అతను భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతని కారణంగా రాఘవకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? శశిని పెళ్లి చేసుకోవాలనే రాఘవ కోరిక నెరవేరుతుందా? వాళ్లిద్దరినీ విడదీయాలనే ఆమె బావ ప్రయత్నం ఫలిస్తుందా?  అనేది మిగతా కథ.

విశ్లేషణ: విలేజ్ నేపథ్యంలో .. జీవం ఉన్న ప్రేమకథలు .. స్వచ్ఛమైన ప్రేమకథలు .. తెరపై కనిపించి చాలా కాలమే అయింది. అలాంటి పరిస్థితుల్లో ఓ మాదిరి బడ్జెట్ లో .. చాలా పరిమితమైన పాత్రలతో తెరపైకి వచ్చిన ప్రేమకథనే 'శశివదనే'. లవ్ స్టోరీస్ కి ఆత్మలాంటిదైన ఫీల్ .. ఈ కథలో ఏమూలనైనా కనిపించిందా? అంటే కనిపించింది అనే చెప్పాలి. నిరీక్షణను కూడా ఆస్వాదించేదే నిజమైన ప్రేమ అనే ఉద్దేశంతో దర్శకుడు చేసిన ఆవిష్కరణ బాగుంది. 

గ్రామీణ ప్రాంతాలలో పనీపాటా లేకుండా ఆకతాయిగా తిరిగే కుర్రాళ్లు .. అందమైన అమ్మాయిల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడానికి పడే పాట్లు .. వాళ్ల వీధిలో అటూ ఇటూ తిరుగుతూ 'బీట్' వేయడం .. అమ్మాయిలు చేసే బెట్టు .. ఇలా చాలా సహజమైన సన్నివేశాలు తెరపై పరిగెడుతూ కనెక్ట్ అవుతుంటాయి. లవ్ తో పాటు కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ ను యాడ్ చేస్తూ, బోర్ కొట్టకుండా ముందుకు తీసుకువెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. 

ప్రేమకథలకు గ్రామీణ నేపథ్యం ఎప్పుడూ ప్రధానమైన బలంగానే నిలుస్తుందనే విషయాన్ని గతంలో చాలానే సినిమాలు నిరూపించాయి. అదే విషయాన్ని ఈ సినిమా మరో మారు స్పష్టం చేసిందని చెప్పచ్చు. గోదావరి ప్రయాణం .. బోట్లు .. కొబ్బరి చెట్లు .. పంటపొలాలు .. ఇవన్నీ కూడా ఈ కథకు మరింత సహజత్వాన్ని .. అందాన్ని తీసుకొచ్చాయి. విలన్ పాత్రను ఇంకాస్త పవర్ఫుల్ గా  చూపిస్తే బాగుండేదనే అభిప్రాయం మాత్రం కలుగుతుంది.  

పనితీరు: హీరో .. అతని తండ్రి .. స్నేహితుడు, హీరోయిన్ .. ఆమె బావ. ఈ ఐదు పాత్రల మధ్యనే కథ అంతా నడుస్తుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా ఈ కథను నడిపించడంలో దర్శకుడు చాలావరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.చాలా రోజుల తరువాత విలేజ్ నేపథ్యంలో ఒక మంచి ప్రేమకథను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

శరవణ వాసుదేవన్ - అనుదీప్ దేవన్ అందించిన బాణీలు .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫొటోగ్రఫీ బాగుంది .. పాటల చిత్రీకరణ విషయంలో మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఎడిటింగ్ కూడా ఓకే. 

ముగింపు: గ్రామీణ నేపథ్యంలో .. చాలా తక్కువ పాత్రలతో .. సాదాసీదాగా సాగిపోయే ప్రేమకథనే ఇది. అయితే సహజత్వానికి దగ్గరగా ఈ కథను నడిపించిన తీరు .. గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరించిన విధానం కారణంగా ఎక్కడా కూడా మనకి బోర్ అనిపించదు.