'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' (ఆహా) సిరీస్ రివ్యూ!

  • ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా సిరీస్ 
  • అందుబాటులోకి 5 ఎపిసోడ్స్
  • రాజకీయం - రౌడీయిజం చుట్టూ తిరిగే కథ 
  • ఆకట్టుకుంటున్న ఎమోషనల్ డ్రామా 
  • ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్

తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రీసెంటుగా ఓ వెబ్ సిరీస్ 'ఆహా' ఓటీటీలోకి  అడుగుపెట్టింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన సిరీస్ ఇది. అశ్విన్ .. గురు లక్ష్మణన్ .. పదినే కుమార్ .. శ్రీతు కృష్ణన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి జస్విని దర్శకత్వం వహించారు. డిసెంబర్ 5 నుంచి ప్రతి శుక్రవారం ఎపిసోడ్స్ వదులుతూ వస్తున్నారు. ఇంతవరకూ వదిలిన 5 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. 

కథ: 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' పరిధిలో దసరా నవరాత్రులకు సంబంధించిన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ గా వెట్రి మారన్ (అశ్విన్) వస్తాడు. అక్కడ రాజకీయాల ముసుగులో ఏ స్థాయిలో రాక్షసత్వం ఉందనేది వెట్రి మారన్ కి తెలుసు. అదే పోలీస్ స్టేషన్ లో మాసాని (పదినే కుమార్) కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటుంది. అమ్మవారి భక్తురాలైన మాసానికి జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. మూడు హత్యలు జరగనున్న విషయం కూడా ఆమెకి అలాగే తెలుస్తుంది. 

ఈ విషయాన్ని ఆమె తనతో పాటు పనిచేస్తున్న మిగతా పోలీస్ లకు చెబుతుంది. ఆమెకి అలా అనిపించిందంటే తప్పకుండా జరుగుతుందని తెలిసి ఉండటం వలన, వాళ్లంతా కూడా ఆందోళన చెందుతారు. ఎందుకంటే 'ధూల్ పేట్ శంకర్' కి చెందిన మనుషులు శత్రువులపై పగ తీర్చుకునే పనిలో ఉన్నారనే విషయం వాళ్లకి తెలుసు. ఊహించినట్టుగా ఆ ఊళ్లో మూడు హత్యలు జరుగుతాయి. ఆ ముగ్గురులో 'ఉమాపతి' కూతురు 'సంధ్య' కూడా ఉండటంతో ఊరంతా ఉలిక్కి పడుతుంది. 

సంధ్య బంగారు నగలు దొంగతనంగా అమ్మడానికి వెళ్లిన 'సుకుమార్' పోలీసులకు పట్టుబడతాడు. ఉమాపతి ఐస్ మిల్ లో సుకుమార్ పనిచేస్తూ ఉంటాడు. తాను .. సంధ్య ప్రేమించుకున్నామనీ, తనకి ఆమెనే ఆ నగలు ఇచ్చిందని సుకుమార్ చెబుతాడు. సంధ్యను తాను చంపలేదనీ, ఎవరు చంపారో తెలియదని అంటాడు. దాంతో వెట్రి మారన్ రంగంలోకి దిగుతాడు. సంధ్యను హత్య చేసింది ఎవరు? మిగతా రెండు హత్యల వెనుక ఎవరున్నారు? ధూల్ పేట్ లో ఏం జరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: స్వార్థ రాజకీయాలు .. రౌడీ రాజకీయాల చుట్టూ తిరిగే కథ ఇది. పగ - ప్రతీకారం చుట్టూ తిరిగే ఈ కథను ఊరు వైపు నుంచి కాకుండా, పోలీస్ స్టేషన్ వైపు నుంచి చూపిస్తుంది. ధూల్ పేట్ లో ఉండే సెంటిమెంట్స్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను సైతం టచ్ చేస్తూ ఈ కథను నడిపించారు. ఒక వైపున ఊరు .. మరొక వైపున పోలీస్ స్టేషన్ .. ఈ రెండు వైపుల నుంచి ఈ కథను నడిపిస్తూ వెళ్లారు.

సిరీస్ ఆరంభంలోనే మూడు హత్యలతో ఆడియన్స్ ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు, ఆ మూడు హత్యల వెనుక గల కారణాలను .. కారకులను చూపించే దిశగా ముందుకు వెళ్లడం బాగుంది. ఒక హత్య .. లవ్ స్టోరీతో ముడిపడి ఉండటం మరింత కుతూహలాన్ని పెంచుతుంది. రాజకీయాలతో ముడిపడిన రౌడీయిజం .. పాత పగలు నేపథ్యంలో సన్నివేశాలను అల్లుకున్న తీరు ఉత్కంఠను రేకెత్తించేలా ఉన్నాయి.

నిరంతరం పగ .. ప్రతీకారాలతో రగిలిపోయే గ్రామంలో, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం పోలీసులకు ఎంత కష్టమైన విషయమనేది దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. తొలి ఐదు ఎపిసోడ్స్ లోనే చాలా కథ చెప్పేశారు. ఇంకా 45 ఎపిసోడ్స్ రానున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని మలుపులు తీసుకుంటూ ఆసక్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ గా ఇది మంచి మార్కులు కొట్టేస్తుందనే అనిపిస్తోంది మరి.

పనితీరు: క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలోని సిరీస్ లు ఇంతకుముందు చాలానే వచ్చాయి. అయితే అవి 7 నుంచి 10 ఎపిసోడ్స్ లోపే డిజైన్ చేయబడినవి. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. యాక్షన్ కి సస్పెన్స్ ను .. ఎమోషన్స్ ను .. లవ్ ను జోడిస్తూ అందిస్తూ ఉండటం ఈ సిరీస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 

రమణగిరి వాసన్ రూపొందించిన ఈ కథ, విస్తృతమైన పరిధిని కలిగినదిగా కనిపిస్తోంది. అనేకమైన మలుపులకు అవకాశం ఉన్న కథ ఇది. సతీశ్ కుమార్ ఫొటోగ్రఫీ .. అశ్వత్ నేపథ్య సంగీతం .. సామ్ ఆర్డీఎక్స్ ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. 

ముగింపు: 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' పరిధిలో జరిగే కథ ఇది. ఊళ్లో జరిగే రాజకీయాలు .. రౌడీయిజాన్ని తట్టుకుంటూ ఈ పోలీస్ స్టేషన్ ఎలా ఎదురువెళ్లింది? అనే దిశగా ఆవిష్కరించబడిన ఈ సిరీస్, ఇంట్రెస్టింగ్ డ్రామతో ఆకట్టుకుంటుంది.

Movie Details

Movie Name: Dhoolpet Police Station

Release Date: 2025-12-05

Cast: Ashwin, Guru Lakshmanan, Padine Kumar, Sruthi Krishnan, Preethi Sharma

Director: Jaswini

Producer: Devan Charles- Praveen Kumar

Music: Ashwath

Banner: Parable Pictures

Review By: Peddinti

Dhoolpet Police Station Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews