గ్లామర్ క్వీన్ గా తెలుగు .. కన్నడ .. తమిళ .. హిందీ బాషలలో రష్మిక దూసుకుపోతోంది. అలాంటి రష్మిక తన కెరియర్లో తొలిసారిగా చేసిన రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమానే 'థామా'. అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. కొన్ని రోజుల క్రితం రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ఆ నిబంధన లేకుండా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
కథ: ఢిల్లీలో అలోక్ (ఆయుష్మాన్ ఖురాన) జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. రామ్ బజాజ్ గోయెల్ (పరేశ్ రావెల్) దంపతుల ఒక్కగా నొక్క కొడుకు అతను. ఒకసారి అతను తన టీమ్ తో కలిసి ఫారెస్ట్ ఏరియాకి వెళతాడు. ఆ అడవిలో మనుషుల రక్తం రుచి మరిగిన భేతాళ తెగకి చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. వాళ్లు అలోక్ ను బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళతారు. అతని ప్రాణాలు తీయడానికి వాళ్లు ప్రయత్నించగా, అదే తెగకి చెందిన 'తడ్కా' (రష్మిక) అడ్డుపడుతుంది.
భేతాళ జాతికి చెందిన ప్రజలు కొన్ని నియమాలు ఏర్పరచుకుంటారు. ఆ నియమాలను ఉల్లంఘించినవారు 100 ఏళ్లపాటు బందీగా చీకటి గుహలో శిక్షను అనుభవించవలసి ఉంటుంది. 'థామా' స్థానాన్ని దక్కించుకోవాలన్న 'యక్షాసన్' (నవాజుద్దీన్ సిద్ధికీ) ప్రస్తుతం అలాంటి శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో అలోక్ ను తప్పించడం కోసం అతనితో కలిసి పారిపోయి, 'తడ్కా' కూడా నియమాన్ని ఉల్లంఘిస్తుంది.
'తడ్కా'ను వెంటబెట్టుకుని అలోక్ తన ఇంటికి తీసుకుని వెళతాడు. 'తారిక' పేరుతో ఆమెను వాళ్లకి పరిచయం చేస్తాడు. అయితే ఆమె మాటతీరు .. ప్రవర్తన అలోక్ తండ్రి రామ్ బజాజ్ కి అనుమానాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయన ఒక మాంత్రికుడిని కలుస్తాడు. 'తడ్కా' ఆచూకీ తెలుసుకోవడం కోసం బేతాళ అనుచరులు వెదుకుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలోనే 'తడ్కా' సాధారణ యువతి కాదనే నిజం అలోక్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ ఇద్దరిలో ఎవరు ఎవరిని కాపాడుకుంటారు? అనేది కథ.
విశ్లేషణ: సినిమా అంటేనే ఒక ఊహా ప్రపంచం .. కాల్పానిక జగత్తు, అసాధ్యాలన్నీ ఇక్కడ సుసాధ్యాలవుతాయి. తెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. ఇలా జరిగే అవకాశం లేదు అనుకోకుండా ప్రేక్షకులు ఆ విజువల్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక కథాంశంతో తెరకెక్కిన సినిమానే 'థామా'. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, విజువల్స్ పరంగా పండుగ చేస్తుంది.
అడవిలోని ఒక చీకటి ప్రపంచం .. అక్కడ రక్తం తాగే ఒక రాక్షస లోకం .. శక్తుల కోసం వాళ్లు చేసే పోరాటం .. ఆ తెగకి చెందిన ఓ యువతి, ఓ సాధారణ యువకుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. మానవ ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఆమె వెళితే, ఆమె కోసం అతను రాక్షస లోకంలోకి అడుగుపెడతాడు. ప్రేమ కోసం చేసే ఈ పోరాటమే ఈ కథను కనెక్ట్ చేస్తుంది.
ఈ కథలో లవ్ ఉంది . ఎమోషన్ ఉంది .. కామెడీ ఉంది .. యాక్షన్ ఉంది. అన్నింటికీ మించి అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ట్విస్టులేమీ ఉండవు గానీ, విజువల్ ట్రీట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. ఈ ట్రీట్ ఇక్కడితో అయిపోలేదు అన్నట్టుగా సీక్వెల్ కి ఒక రూట్ వేసి వదిలేశారు.
పనితీరు: ఇటు దెయ్యం సినిమా కాకుండా .. అటు డ్రాకులా సినిమా కాకుండా .. క్షుద్ర శక్తులకు సంబంధించిన సినిమా కూడా కాకుండా దర్శకుడు ఒక కొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడనే చెప్పాలి. పనిలో పనిగా ఒక స్పెషల్ ఎపిసోడ్ ను క్రియేట్ చేసి, 'భేడియా' సినిమా వైపు నుంచి ఉన్న క్రేజ్ ను కూడా బాగానే వాడుకున్నారు.
సౌరభ్ గోస్వామి కెమెరా పనితనం .. సచిన్ - జిగర్, అరియన్ సంగీతం ఆకట్టుకుంటుంది. హేమంతి సర్కార్ ఎడిటింగ్ కూడా ఓకే. వీఎఫ్ ఎక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.
ముగింపు: కొన్ని కథలు ఊహలకు దగ్గరగా .. వాస్తవాలకు దూరంగా ఉంటాయి. అలాంటి కథలలో లాజిక్కులు వెదకకూడదు కూడా. అసాధ్యమనిపించే ఆ విజువల్స్ ను చూస్తూ ఎంజాయ్ చేయడమే. అలాంటి కేటగిరిలోకి చెందిన సినిమానే ఇది.
'థామా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Thamma Review
- బాలీవుడ్ లో హిట్ కొట్టిన 'థామా'
- తెలుగులోను అందుబాటులోకి
- లవ్ టచ్ తో నడిచే యాక్షన్
- హైలైట్ గా నిలిచే విజువల్స్
Movie Details
Movie Name: Thamma
Release Date: 2025-12-16
Cast: Ayushmann Khurrana,Rashmika Mandanna,Nawazuddin Siddiqui,Paresh Rawal ,Geeta Agarwal Sharma
Director: Aditya Sarpotdar
Music: Sachin–Jigar
Banner: Maddock Films
Review By: Peddinti
Trailer