కృష్ణ కథానాయకుడిగా కన్నడలో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూపొందింది. ఆ సినిమా పేరే 'బ్రాట్'.శశాంక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది.  కొన్ని రోజుల క్రితం 'అమెజాన్ ప్రైమ్'లో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, ఈ నెల 13 నుంచి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. మనీషా కథానాయికగా నటించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: మహాదేవయ్య (అచ్యుత్ కుమార్) ఓ నిజాయితీ పరుడైన పోలీస్ కానిస్టేబుల్. భార్య రేణుక .. కొడుకు కృష్ణ (డార్లింగ్ కృష్ణ) కలిసి అతను చాలా సింపుల్ లైఫ్ ను కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన సీనియర్ ఆఫీసర్ రవి కుమార్ (రమేశ్ ఇందిర) అవినీతి పరుడైనా, మహాదేవయ్యను మాత్రం ఆ ఊబిలోకి లాగలేకపోతాడు. మహాదేవయ్య కొడుకు కృష్ణ మాత్రం తన జీవితం పట్ల చాలా అసంతృప్తితో ఉంటాడు. ఈజీగా డబ్బు సంపాదించి సుఖపడాలనేది అతని ఆశ. 

ఈజీగా డబ్బు సంపాదించడం కోసం అతను క్రికెట్ బెట్టింగ్ ను మార్గంగా ఎంచుకుంటాడు. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో డాలర్ మణి ( డ్రాగన్ మంజు) బెట్టింగ్ దందాను నడుపుతూ ఉంటాడు. అతనికి అండగా పోలీస్ ఆఫీసర్ రవికుమార్ ఉంటాడు. ఇద్దరూ కలిసి పెద్ద మొత్తంలో సంపాదిస్తూ ఉంటారు. ఒకసారి కృష్ణ తన నలుగురి ఫ్రెండ్స్ డబ్బును, తాను ఇష్టపడుతున్న మనీషా (మనీషా) డబ్బును బెట్టింగులో పెడతాడు. ఆ బెట్టింగులో గెలిస్తే వాళ్లు తమ ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. 

అయితే ఆ బెట్టింగులో వాళ్లు గెలిచినప్పటికీ డబ్బు ఇవ్వకుండా డాలర్ మణి మోసం చేస్తాడు. తాము గెలిచిన డబ్బు తమకి ఇవ్వొద్దనీ, తమ డబ్బు మాత్రం తిరిగి ఇచ్చేయమని కృష్ణ రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు డాలర్ మణి నిరాకరిస్తాడు. అతని మోసం కారణంగా కృష్ణ ఒక ఫ్రెండ్ ను కోల్పోతాడు. తన లవర్ జీవితం ప్రమాదంలో పడటానికి కారకుడవుతాడు. అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎన్నో కుటుంబాలు బజారున పడ్డాయి. ఎంతోమంది ఈ ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాంటి క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. క్రికెట్ బెట్టింగ్ అనే మాట చాలామంది .. చాలా చోట్ల విని ఉంటారు. అలాంటి క్రికెట్ బెట్టింగ్ ఎలా జరుగుతుంది? ఆ మాయలో పడినవాళ్లు ఎలా తమ డబ్బు పోగొట్టుకుంటారు? తెర వెనుక ఏం జరుగుతూ ఉంటుంది? అనేది స్పష్టంగా చూపించిన సినిమా ఇది. 

గతంలో ఈ తరహా కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు లేకపోలేదు. అయితే అదే విషయాన్ని దర్శకుడు చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడని అనిపిస్తుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ను టచ్ చేస్తూనే, ఎంచుకున్న ప్రధానమైన అంశాన్ని ఆసక్తికరంగా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అనవసరమైన పాత్రలు .. సన్నివేశాలు తెరపై కనిపించవు. 

నిజం కానిది ఎప్పుడూ అందంగానే ఉంటుంది .. ఆకర్షణీయంగానే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మార్గంలో వెళుతున్న కొడుకును కట్టడి చేయడానికి ఒక తండ్రి పడే ఆవేదన ఈ కథలో ఎక్కువ ఎమోషన్స్ ను రాబడుతుంది. 'నేటి ప్రపంచంలో నిజాన్ని నిరూపించడానికి కూడా అబద్ధమే చెప్పాల్సి ఉంటుంది' అనే కొడుకు డైలాగ్ కూడా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. లూజ్ సీన్స్ లేకపోడం వలన, యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు. 

పనితీరు: ఓ మాదిరి బడ్జెట్ లో తెరకెక్కిన సినిమాగా ఇది కనిపిస్తుంది. దర్శకుడు ఎక్కడా కూడా అనవసరమైన హడావిడి చేయలేదు. కథ చాలా సాదాసీదాగా సాగిపోతూ, సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళుతుంది. నటీనటులంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. అభిలాష్ ఫొటోగ్రఫీ .. అర్జున్ జన్య సంగీతం .. గిరి మహేశ్ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి. 

ముగింపు: నిజాయితీనే తన బలమని నమ్మిన ఒక పోలీస్ ఆఫీసర్. అది బలం కాదు .. బలహీనత అని భావించే అతని కొడుకు మధ్య నడిచే కథ ఇది. విలాసవంతమైన జీవితం కోసం ఈజీ మనీ కావాలి .. అందుకోసం పక్క దారులు తొక్కడంలో తప్పులేదని భావించిన ఆ కొడుకు చివరికి తెలుసుకున్నది ఏమిటి? అనే ఈ కథ, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.