ఈషా రెబ్బా .. పాయల్ రాజ్ పుత్ .. పూర్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన 'త్రీ రోజెస్' సిరీస్, 2021లో ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. అప్పటి నుంచి సీజన్ 2 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ నుంచి సీజన్ 2 వచ్చేసింది. 4 ఎపిసోడ్స్ తో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈషా రెబ్బాతో పాటు ఈ సారి రాశి సింగ్ - కుషిత సందడి చేయడం విశేషం. సీజన్ 2 ఏ స్థాయిలో అలరించిందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: రీతూ (ఈషా రెబ్బా) మేఘన (రాశీ సింగ్) స్రష్ట (కుషిత) ముంబైలో ఓ హాస్టల్ లో ఉంటారు. రీతూకి 'సమీర్' తో బ్రేకప్ జరుగుతుంది. సమీర్ తో బ్రేకప్ జరిగితే తనతో చెప్పమన్న ప్రసాద్ (హర్ష) మాటలు ఆమెకి గుర్తుంటాయి. అయితే ఆ మాటలను కూడా పట్టించుకోకుండా ఆమె కెరియర్ పై దృష్టి పెడుతుంది. యాడ్ ఏజెన్సీ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తూ ఉంటుంది.

 'మేఘన' తల్లి .. ఆమె మేనమామ ఊర్లో కేటరింగ్ నడుపుతూ ఉంటారు. మేఘనకు వీరభోగ వసంత రాయలు (సత్య)తో విడాకులు జరిగిన విహాయం ఆమె తల్లికి గానీ .. మేనమామాకి గాని తెలియదు. ప్రతి నెలా అతను ఇచ్చే భరణంతో ఆమె జీవితం కొనసాగుతూ ఉంటుంది. 'స్రష్ట' విషయానికి వస్తే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ ఆమె. బాధ్యతగా నడుచుకోవాలని చెప్పేవాళ్లు లేక ఆకతాయితనంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. 

ఒంటరిగా ఉంటున్న గురుమూర్తి (ప్రభాస్ శ్రీను)కి లేడీస్ పట్ల వ్యామోహం ఎక్కువ. అందువలన, యాడ్ ఏజెన్సీ కోసం తన ఆఫీసు వాడుకోమంటూ అతను రీతూ ముందుకొస్తాడు. ఇక క్లయింట్ కోసం .. ఫస్టు యాడ్ చేయవలసిన మోడల్ కోసం రీతూ వెయిట్ చేస్తుండగా, ప్రసాద్ .. మనో మళ్లీ ఆమె లైఫ్ లోకి వస్తారు. మేఘనకి భరణం ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో వీరభోగ వసంత రాయలు మాస్టర్ ప్లాన్స్ వేస్తుంటాడు. స్రష్ట అమాయకత్వాన్ని గమనించిన కొందరు, ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ ఉచ్చులో నుంచి ఈ ముగ్గురూ బయటపడతారా లేదా? అనేదే కథ.      

విశ్లేషణ: జీవితం అందంగా .. ఆనందంగా సాగిపోవాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి .. అండదండలు ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఒక రక్షణ వలయంలో ఉండాలి. లేదంటే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని .. తమకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించేవాళ్లు చాలామంది కనిపిస్తారు. అలాంటివారు విసిరే 'వల'ల నుంచి తప్పించుకుంటూ, తమకి నచ్చినట్టుగా బ్రతడానికి పోరాడే ముగ్గురు యువతుల కథ ఇది. 

చాలామంది తమ జీవితంలో తెగించి ముందుకు వెళ్లకపోవడానికి కారణం బంధాలనే చెప్పాలి. ఉన్న బంధాలకు తోడు కొత్త బంధాలు ఏర్పడి మనిషిని మరింతగా కదలకుండా చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు స్వేచ్ఛను అపహరిస్తూ ఉంటాయి. ఏది నిజం .. ఏది ఆకర్షణ అనేది తెలుసుకుని, అలాంటి బంధాలలో నుంచి బయటపడటంలోనే అసలైన ఆనందం ఉంటుంది అంటూ ఈ కథ ఇచ్చిన సందేశం కనెక్ట్ అవుతుంది. 

ప్రేమించడమంటే అవతల వ్యక్తిని మోసం చేసి మన మార్గంలోకి తెచ్చుకోవడం కాదు, అవతల వాళ్లు కోరుకున్నట్టుగా మారడానికి మనం ప్రయత్నించడం అనే ఒక సందేశం మనకి 'మనో' పాత్ర వైపు నుంచి కనిపిస్తుంది. ఆకతాయితనం చూడటానికి సరదాగా అనిపించినా, ఒక్కోసారి అది ప్రమాదంలోకి నెట్టేస్తుంది అనే విషయానికి స్రష్ట పాత్ర అద్దం పడుతుంది. ఇలా ఈ సీజన్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తూ, కామెడీ టచ్ తో ఎంటర్టైన్ చేస్తుంది.

 పనితీరు: 'త్రీ రోజెస్' సీజన్ 1కి మంచి రెస్పాన్స్ రావడం వలన, ఈ సీజన్ విషయంలో దర్శకుడిపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. అయితే ఫస్టు సీజన్ కి ఎంతమాత్రం తగ్గకుండా సీజన్ 2 కూడా వినోదభరితంగా కొనసాగుతుంది. హీరోయిన్స్ గ్లామర్ .. కామెడీ డ్రామా ఈ సీజన్ కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. 

ఈషా రెబ్బా .. రాశీసింగ్ .. కుషిత చాలా గ్లామరస్ గా కనిపించారు. పాత్ర పరిధిలో మెప్పించారు. పిసినారి భర్తగా సత్య కామెడీ ఈ సీజన్ కి హైలైట్ గా నిలిచింది. హర్షతో పాటు మిగిలిన వాళ్లంతా బాగానే చేశారు. శక్తి అరవింద్ ఫొటోగ్రఫీ .. అజయ్ అరాసాడ నేపథ్య సంగీతం .. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఈ సీజన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. 

ముగింపు: సీజన్ 1లో ముగ్గురు యువతుకు వేరు వేరుగా సమస్యలను ఫేస్ చేస్తారు. ఈ సీజన్ లో ముగ్గురు యువతులు కూడా ఒక కప్పుక్రింద ఉంటూ కలిసి సమస్యలను ఎదుర్కుంటారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ తో కూడిన ఈ కంటెంట్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది.