తమిళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామానే 'ఆరోమలే'. కిషెన్ దాస్ - శివాత్మిక రాజశేఖర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సారంగ్ త్యాగు దర్శకత్వం వహించాడు. నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడి యూత్ నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా ఈ నెల 12 నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. 

కథ: అజిత్ (కిషెన్ దాస్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అతని ఆలోచనలన్నీ 'ప్రేమ' అనే రెండు అక్షరాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ప్రేమలో నిజాయితీ ఉండాలి .. నిర్మలత్వం ఉండాలి .. నిస్వార్ధం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో చూపించే స్థాయిలో ప్రేమ అనేది చాలా డీప్ గా ఉండాలి అనే ఆలోచనలో ఉంటాడు. అంతగా తనని ప్రేమించే అమ్మాయి దొరక్కపోతుందా అని వెయిట్ చేస్తుంటాడు. 

అయితే స్కూల్ ఫైనల్ నుంచి కాలేజ్ పూర్తయ్యే వరకూ కూడా అజిత్ ప్రేమ విషయంలో ఎదురుదెబ్బలు తింటూనే వస్తాడు. స్మృతి .. మేఘ .. స్నేహా అందరూ అతని ప్రేమను పెద్దగా పట్టించుకోరు. అలాంటి పరిస్థితులలోనే అతను ఓ మ్యాట్రిమోనీలో జాబ్ సంపాదిస్తాడు. అక్కడే అతనికి అంజలి ( శివాత్మిక రాజశేఖర్) పరిచయమవుతుంది. తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. తనకి ఆమెనే బాస్ .. పనిరాక్షసి అని తెలిసి బిత్తరపోతాడు.

అలవాటు లేని పని .. ఇష్టం లేని పని. అయినా అక్కడ ఉంటే ఆమెకి చేరువ కావచ్చని భావిస్తాడు. అయితే అసలు ఆమె ప్రేమకు వ్యతిరేకమని తెలుసుకుని షాక్ అవుతాడు. ప్రేమపై పెద్దగా నమ్మకం .. ఫీలింగ్స్ లేవని తెలుసుకుంటాడు. అలాంటి పరిస్థితులలోనే అతనికి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది? అదేమిటి? ప్రేమకు అంజలి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? అజిత్ కి తాను కోరుకునే ప్రేమ లభిస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: టీనేజ్ లోకి అడుగుపెట్టగానే కనిపించే మొదటి లక్షణం 'ప్రేమ'లో పడటమే. ప్రేమలేని జీవితం .. ప్రేమికురాలు లేని జీవితం వృథా అనిపిస్తాయి. జీవితాన్ని మరింత అందంగా మార్చే శక్తి ప్రేమకి తప్ప మరిదేనికీ లేదనే ఒక బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. తాను ఇష్టపడిన అమ్మాయి, తన కంటే ఎక్కువగా తనని ప్రేమించాలనే ఒక ఆశ మొదలవుతుంది. అయితే తాను ప్రేమించే అమ్మాయికి అసలు ప్రేమపైనే నమ్మకం లేదని తెలిస్తే ఆ కుర్రాడి పరిస్థితి ఏమిటి అనేదే ఈ సినిమాలోని ఆసక్తికరమైన అంశం.

ఈ సినిమాలోని కథానాయకుడికి ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. తనకి బాస్ గా ఉన్న అంజలిని మెప్పిస్తూ తన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి. అదే సమయంలో తనపై ఆమెకి ఇష్టం ఏర్పడేలా చేయాలి. ఈ నేపథ్యంలో దర్శకుడు డిజైన్ చేసుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా ముందుకు సాగుతాయి. ఇక తన ప్రేమ విషయంలోనే కాదు, ఇతరుల ప్రేమను కూడా అర్థం చేసుకుని వాళ్లను కలపడానికి హీరో చేసే ప్రయత్నంతో, దర్శకుడు ఆ పాత్రను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. 

  ఇది చాలా సింపుల్ కంటెంట్ .. బడ్జెట్ పరంగా చూసుకున్నా చాలా చిన్న సినిమా. అయితే కథలోని ఆత్మ కదిలిస్తుంది. సహజత్వనమనేది మన చేయి పుచ్చుకుని నడిపిస్తుంది. జీవితంలో ఓదార్చేవాళ్లు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదనే సందేశం కూడా కనిపిస్తుంది. ఫ్యామిలీ వైపు నుంచి ఎమోషన్స్ .. ఫ్రెండ్స్ వైపు నుంచి కామెడీ టచ్ ఇచ్చే ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.  
       
పనితీరు: ఓ కాలనీ .. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ .. ఓ చిన్నపాటి ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక లవ్ స్టోరీ ఇది. దర్శకుడు ఎక్కడా అద్భుతాలు చేయడానికి ట్రై చేయలేదు. సదాసీదాగా జీవితాన్ని కొనసాగించే ప్రతి ఒక్కరూ ఈ పాత్రలలో తమని తాము చూసుకునేలా ఈ సినిమాలోని పాత్రలను ఆవిష్కరించాడు. కథ వాస్తవాలను దాటి వెళ్లకుండా చూసుకున్నాడు. 

శివాత్మిక రాజశేఖర్ .. కిషెన్ దాస్ నటన చాలా బాగుంది. ఇద్దరూ చాలా సహజంగా చేశారు. గౌతమ్ రాజేంద్రన్ ఫొటోగ్రఫీ .. సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం .. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ కథాకథనాలకు మరింత బలాన్ని జోడించాయి. 

ముగింపు: మనలను ప్రేమించే ఒక మనిషి .. మన గురించి ఆలోచించే ఒక మనిషి .. మనం లేకపోతే అంతా శూన్యమైపోయినట్టుగా భావించేవారు దొరకడం చాలా కష్టం. అంతగా ప్రేమించే మనిషి దొరికితే జీవితంలో ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది. విజయాలను సాధించడానికి అవసరమైన ఉత్సహాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఆవిష్కరించే ఈ సినిమా, యూత్ కి నచ్చుతుంది.