తెలంగాణ నేపథ్యంతో కూడిన  సందేశాత్మక చిత్రాలు .. ప్రజలను చైతన్యవంతులను చేసే సినిమాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఆ వరుసలో వచ్చిన మరో సినిమానే 'కలివి వనం'. తెలంగాణ జానపదాలతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న నాగదుర్గ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. నవంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది. 

కథ: అది తెలంగాణ ప్రాంతం .. జగిత్యాల మండలం పరిధిలోని 'గుట్రాజ్ పల్లి' గ్రామం. అక్కడ తన తాతయ్య భూమయ్య (సమ్మెట గాంధీ)తో కలిసి హరిత ( నాగదుర్గ) నివసిస్తూ ఉంటుంది. ఆ ఊరులోని స్కూల్ కి ఆనుకుని చిన్నపాటి అడవి ఉంటుంది. ఆ అడవిని పెంచి పోషించింది భూమయ్యనే. ప్రకృతియే ప్రతి ఒక్కరినే కాపాడుతుందనేది ఆయన ఉదేశం.  అందువల్లనే ఆ ఊళ్లోని వాళ్లంతా ఆయనను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. 

ఇక ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఆ ఊరు స్కూల్ పిల్లలకు 'హరిత' చదువు చెబుతూ ఉంటుంది. పిల్లలు ప్రకృతిని ప్రేమించేలా చేయగలిగితే, ఆరోగ్యం .. అభివృద్ధి రెండూ  సాధ్యమవుతాయని ఆమె నమ్ముతుంది. అలాగే రైతులు సేంద్రియ ఎరువులు వాడటం వలన, నేల విషపూరితం కాకుండా ఉంటుందని భావిస్తుంది. అందరూ మొక్కలు పెంచాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఆమెకి జిల్లా కలెక్టర్ నుంచి సైతం గుర్తింపు లభిస్తుంది. 

ఈ నేపథ్యంలో ఆ ఊరు సర్పంచ్ విఠల్ (బిత్తిరి సత్తి) ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ అడవి ఉన్న ప్రదేశంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందనీ, ఫ్యాక్టరీ వలన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెబుతాడు. అప్పుడు హరిత ఎలా స్పందిస్తుంది? ఆ అడవిని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: పల్లెలను పట్టణాలు ఆక్రమించుకుంటూ వెళుతున్నాయి. అభివృద్ధి .. ఉద్యోగాలంటూ ఆశపెట్టి, కొండ్రు స్వార్థపరులు పల్లెలను తమ వ్యాపార సంస్థలకు నిలయాలుగా మార్చేస్తున్నారు. ప్రమాదకరమైన ఫ్యాక్టరీలను పల్లెలకు తరలించి అక్కడ గాలి .. నీరు .. ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు. ఎవరి స్వార్థానికి వారు పల్లెలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భావి తరాల కోసం అడ్డుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పే కథ ఇది. 

గ్రామీణ నేపథ్యంలోని కథలతో చాలానే సినిమాలు వస్తుంటాయి. అయితే గ్రామాన్నే ఒక ప్రధానమైన పాత్రగా చేసుకుని కథను అల్లుకునే సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక కథగా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. దర్శకుడు ఒక గ్రామానికి సంబంధించిన  మూడు తరాలవారిని కలుపుకుంటూ ఈ కథను నడిపించిన తీరు, అక్కడి లొకేషన్స్ ను ఉపయోగించుకున్న విధానం బాగుంది.

పల్లెలు .. పంటలు .. పచ్చదనాన్ని కాపాడవలసిన బాధ్యతను గుర్తుచేసిన విధానం బాగుంది. అయితే కంటెంట్ పై ఇంకాస్త కసరత్తు చేసి .. మరింత పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. బలమైన .. బరువైన సన్నివేశాలను తేలికగా తేల్చి పారేయకుండా ఉంటే, ఎమోషన్స్ వైపు నుంచి ఆడియన్స్ మరింత కనెక్ట్ కావడానికి అవకాశం ఉండేదేమో అనిపిస్తుంది. 

పనితీరు: కథాకథనాలు .. పాత్రలను డిజైన్ చేసే విషయంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయమేనని చెప్పాలి. అయితే అందుకు అవసరమైన ఎమోషన్స్  .. కామెడీ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టవలసిందని అనిపిస్తుంది. జీఎల్ బాబు ఫొటోగ్రఫీ .. మదిన్ సంగీతం .. చంద్రమౌళి ఎడిటింగ్ ఓకే.  

ముగింపు: పచ్చదనం కోసం పాటు పడే ఒక గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి తోసేయడానికి కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తే, ఆ గ్రామాన్ని గ్రామస్తులు ఎలా కాపాడుకున్నారనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు ఆకట్టుకుంటుంది. ఒక మంచి పల్లెటూరును చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఒక సందేశాన్ని సినిమాగా చెప్పాలనుకున్నప్పుడు అందుకు అవసరమైన వినోదపరమైన అంశాలను కలుపుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. ఈ విషయంలోనే ఈ సినిమా కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది.