చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన సాత్విక్ వర్మ హీరోగా చేసిన సినిమానే 'ప్రేమిస్తున్నా'. ఈ సినిమాతో హీరోయిన్ గా ప్రీతి నేహా పరిచయమైంది. నవంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీకి వచ్చేసింది. భాను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ సినిమా, నవంబర్ 28వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ను ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకోగలిగింది అనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: హీరో (సాత్విక్ వర్మ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. అతని తల్లి శారద (విజి చంద్రశేఖర్) రైల్వే లో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. భర్త చనిపోవడంతో, కొడుకు ఆలనా పాలన తానే చూస్తుంది. ఎదిగిన కొడుకు తనకి అండగా నిలబడతాడనే ఆశతోనే అతనిని చదివిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే వాళ్లు బదిలీపై ఒక ఊరుకు చేరుకుంటారు. ఆ కాలనీలోనే అతనికి ఒక అమ్మాయి (ప్రీతి నేహా) కనిపిస్తుంది. తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. 

ఇక అప్పటి నుంచి ఆమె వెంటపడటం మొదలుపెడతాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని స్నేహితులతో చెబుతాడు. ఆమె కోసం పరీక్షలు ..  ఇంటర్వ్యూలు కూడా వదులుకుంటూ ఉంటాడు. తాను కష్టపడి జాబ్ తెచ్చుకుని తల్లి ముచ్చటను తీర్చాలనే విషయాన్ని పక్కన పెట్టేస్తాడు. ఈ విషయాన్ని స్నేహితులు గుర్తు చేసినా పట్టించుకోడు. ఆ అమ్మాయిని గురించిన ఆలోచనలతోనే పగలూ రాత్రి గడిపేస్తూ ఉంటాడు. 

ఈ నేపథ్యంలోనే తన కూతురు వెంట ఓ కుర్రాడు పడుతున్నాడనే విషయం ఆ అమ్మాయి తండ్రి మురళికి తెలుస్తుంది.  కుర్రాడు ఎవరో కాదు .. శారద కొడుకని తెలుసుకుంటాడు. ఆ నిజం తెలియగానే అతను తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శారద కుటుంబంతో మురళికి ఉన్న సంబంధం ఏమిటి? అతనికి అంతగా కోపం రావడానికి గల కారణం ఏమిటి? నిజం తెలిసిన తరువాత అతను ఏం చేస్తాడు? అనేది కథ. 

విశ్లేషణ: 'ఎక్కడ ఉన్నా ఏమైనా .. మనమెవరికి వారై వేరైనా .. నీ సుఖమే నే కోరుకున్నా ..' అంటూ సాగే ఒక పాత పాట .. ఈ నాటికీ మన చెవుల్లో మ్రోగుతూనే ఉంటుంది. మనసు పడిన అమ్మాయి దక్కకపోయినా ఆమె క్షేమంగా .. సుఖంగా ఉంటే చాలని కోరుకునే ఒక ప్రేమికుడి పాట ఇది. నిజమైన ప్రేమ అంటే అది. ఈ సినిమాలో దర్శకుడు కూడా ఇతర పాత్రలతో ఇదే విషయం చెప్పిస్తాడు. కానీ ఇక్కడి హీరో ప్రేమికుడా? ఉన్మాదా? అనే విషయంలో మనం ఒక క్లారిటీకి రాకుండా ఆ పాత్రను నడిపిస్తాడు.

ఐ లవ్ యూ అంటూ వెంటపడే హీరోలను చూస్తూ పెరిగిన ఆడియన్స్, హీరో ట్రెండ్ మార్చుకుని 'నీతో రొమాన్స్ చేయాలని ఉంది' అనగానే, ఇదేదో కొత్తగా ఉందని నోరెళ్ల బెట్టాలి. 'ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు, ఒకసారికి మాత్రమే నీ కోరికను తీర్చుకునే అవకాశం ఇస్తున్నాను' అంటుంది హీరోయిన్. 'అబ్బా భలే డెసిషన్ తీసుకుందే అని ఆడియన్స్ కళ్లప్పగించుకుని ఆ రొమాంటిక్ సీన్ చూడాలి. 

తన కోరిక తీర్చమంటూ వెంటపడే హీరో, ఇది కామం కాదు ప్రేమ అంటాడు. అతని కోరికను తీర్చిన అమ్మాయి, నీది నిజమైన ప్రేమకాదు అంటుంది. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉంటాయి. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం ప్రేమకి .. కోరికకి సరైన అర్థం అందక సతమతమైపోతాడు. వీరిద్దరే ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే, ఇంతటితో కథ అయిపోలేదంటూ మరో పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆ తేడా పాత్రను తట్టుకుని కథలో నుంచి బయటపడటానికి పెద్ద పోరాటమే చేయవలసి ఉంటుంది.

పనితీరు: ఏ కథకైనా ఒక స్పష్టత అవసరం. మనం ఏం చెబుతున్నాం .. ప్రేక్షకులకు అది ఎలా అర్థమయ్యే అవకాశం ఉంది అనే పరిశీలన చాలా అవసరం. లేదంటే మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామా? ఈ విషయంలో దర్శకుడికే సరైన స్పష్టత లేదా? అనే ఒక సందేహం తలెత్తకుండా ఉండదు. పసిపిల్లలలో దైవత్వాన్ని .. అమ్మ ప్రేమలోని ఔన్నత్యాన్ని గుర్తించలేనివాడు ప్రేమికుడు ఎలా అవుతాడనేది దర్శకుడే వేసుకోవలసిన ప్రశ్న.

ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులు, తమ పాత్రల పరిధిలో మెప్పించారు. బాలనటుడిగా చేసిన సాత్విక్ వర్మకి హీరోగా ఇది మొదటి సినిమా అయ్యుండొచ్చు. ఇక కథానాయికగా ప్రీతి నేహాకి ఇది ఫస్టు మూవీ. కొత్త అమ్మాయి అయినా ఎక్కడా ఆ తేడా తెలియనీయలేదు. ఇద్దరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.    
  
ముగింపు: ప్రేమకథకు ఉండవలసిన ప్రధమ లక్షణం .. ప్రధానమైన లక్షణం సున్నితత్వం. రాక్షసత్వం కాదు. ఏది అసలైన ప్రేమనో  తెలియని ఒక అయోమయంలోకి ప్రేక్షకులను నెట్టేయకూడదు. ఒక 'గే' కంటే .. ఒక 'సైకో' నయమని చెప్పే ముగింపు ఎంతవరకూ కరెక్ట్ అనేది యూత్ వేసుకోవలసిన ప్రశ్న.