'ఆర్యన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • తమిళంలో రూపొందిన 'ఆర్యన్'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • కొత్త పాయింట్ ను టచ్ చేసిన డైరెక్టర్ 
  • కొన్ని సన్నివేశాల్లో తగ్గిన బలం 
  • ఫరవాలేదనిపించే కంటెంట్      

విష్ణు విశాల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఆయన హీరోగా రూపొందిన తమిళ సినిమానే 'ఆర్యన్'. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచి తమిళంతో పాటు ఇతర భాషల్లోను 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి వచ్చింది. 

కథ: చెన్నై లోని ఒక టీవీ ఛానల్ కి సంబంధించిన స్టూడియోలో, హీరో కైలాశ్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. అతణ్ణి నైనా (శ్రద్ధా శ్రీనాథ్) ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఆడియన్స్ తో కూడిన 'లైవ్ షో' అది. ఆ షో రన్ అవుతూ ఉండగా, ఆడియన్స్ లో నుంచి ఆత్రేయ (సెల్వ రాఘవన్) కెమెరా ముందుకు వస్తాడు. కైలాశ్ ను గాయపరచడమే కాకుండా, లైవ్ షోను అలాగే రన్ చేయకపోతే చంపేస్తానని బెదిస్తాడు. ఆ స్టూడిలోకి ఎవరూ రాకుండా లాక్ చేస్తాడు. 

రచనల పట్ల తనకి గల ఆసకిని గురించి ఆత్రేయ ప్రస్తావిస్తాడు. సమాజాన్ని చాలా దగ్గరగా పరిశీలించి పదేళ్ల పాటు చేసిన రచనలను ఒక పబ్లిషర్ పక్కన పడేశాడంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. అందరికీ ఆసక్తిని కలిగించేలా తాను ఒక కథను చూపించబోతున్నానని అంటాడు. మరి కాసేపట్లో నారాయణ అనే వ్యక్తి చనిపోతాడనీ, ఆ తరువాత రోజుకొకరు చొప్పున 5 రోజుల పాటు ఐదు హత్యలు జరుగుతాయని చెబుతాడు. 

ఆత్రేయ అసలు పేరు నారాయణ అని తెలియడంతో, లైవ్ చూస్తున్న వాళ్లంతా ఉలిక్కిపడతారు. తాను చనిపోయిన తరువాత ఐదు హత్యలు ఎలా జరుగుతాయనేది చూడాలంటే వెయిట్ చేయమని అంటాడు. హత్య జరగడానికి ఒక గంట ముందు మాత్రమే హత్య చేయబడేది ఎవరనేది చెబుతానని అంటాడు. అది ఎలా అనేది కూడా సస్పెన్స్ అంటూ అతను షూట్ చేసుకుని చనిపోతాడు. దాంతో ఈ కేసును పరిష్కరించడానికి ఏసీపీ నంద (విష్ణు విశాల్) రంగంలోకి దిగుతాడు. ఆత్రేయ ఆ మర్డర్స్ ను ఎలా ప్లాన్ చేశాడు? అతను చంపాలనుకున్న ఐదుగురు ఎవరు? అందుకు కారణం ఏమిటి? ఏసీపీ నంద వాటిని అడ్డుకోగలుగుతాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సాధారణంగా ఒక సైకో వరుస హత్యలు చేసుకుంటూ వెళ్లడం, అతణ్ణి పట్టుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టడం చాలా సినిమాలలో జరుగుతూ ఉంటుంది. హంతకుడు ఎవరు? అతను ఎవరిని చంపాలనుకుంటున్నాడు? ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? అనేది ఆడియన్స్ లో ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. అయితే హంతకుడు తాను చనిపోయిన తరువాత హత్యలు జరిగేలా ప్లాన్ చేయడమే ఈ కథలోని కొత్త పాయింట్. 

దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు కొత్తగా అనిపిస్తుంది. ఐదు రోజులు .. జరగనున్న ఐదు హత్యలు .. ఆల్రెడీ చనిపోయిన హంతకుడు ఎలా హింట్ ఇవ్వనున్నాడు? అతను టార్గెట్ చేసినవారిని కాపాడేది ఎలా? అనేది తెరపై పోలీస్ డిపార్టుమెంట్ ముందున్న ప్రశ్న. వాళ్లు చేసే ప్రయత్నాలతో ఈ కథ కదులుతూ ఉంటుంది. ముందుగా పోలీసులు .. వాళ్ల వెనుకే టెన్షన్ తో ప్రేక్షకులను పరుగులు పెట్టించడానికి  దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు. 

ఈ కథ మొదటి సీన్ తోనే ఆడియన్స్ లో ఉత్కంఠను పెంచుతుంది. అక్కడి నుంచి ఆసక్తికరంగానే కొనసాగుతూ ఉంటుంది. ఆల్రెడీ చనిపోయిన హంతకుడు ఎలా చంపుతాడు? అనేదే కుతూహలాన్ని రేకెత్తించే ప్రధామైన అంశం. అంతవరకూ బాగానే ఉంది. అయితే హంతకుడు హత్యలను ప్లాన్ చేసిన తీరు .. ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే అంశాల దగ్గర మాత్రం పట్టు సడలిపోయినట్టుగా అనిపిస్తుంది.

పనితీరు: దర్శకుడు ఎంచుకున్న కథలో ఒక కొత్త పాయింట్ ఉంది. హంతకుడు ఇచ్చే హింట్ .. హత్యలు జరగకుండా ఆపడానికి పోలీస్ టీమ్ పరుగులు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అయితే  హత్యలు జరిగే విధానాన్ని డిజైన్ చేసిన పద్ధతులు ఆడియన్స్ కి అంతగా పట్టుకోవు. హత్య చేయబడేవారి నేపథ్యం కూడా బలహీనంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకాస్త కసరత్తు చేసుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదే. 

హంతకుడిగా సెల్వ రాఘవన్ .. పోలీస్ ఆఫీసర్ గా విష్ణు విశాల్ నటన ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు నామమాత్రంగా అనిపిస్తాయంతే. మిగతా ట్రాకులు కూడా అంతగా ప్రభావితం చేయవు. హరీశ్ కన్నన్ ఫొటోగ్రఫీ .. గిబ్రాన్ నేపథ్య సంగీతం .. లోకేశ్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు
: ఈ యాక్షన్ థ్రిల్లర్ కొత్త కోణంలో మొదలవుతుంది. ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది. అయితే హంతకుడి ఉద్దేశం ఏమిటనేది సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పలేదని అనిపిస్తుంది. ఒకవేళ అది అనువాద సమస్య అయినా అయ్యుండొచ్చు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ కంటెంట్ నచ్చే అవకాశాలు ఉన్నాయి.

Movie Details

Movie Name: Aaryan

Release Date: 2025-11-28

Cast: Vishnu Vishal, Selva Raghavan, Shraddha Srinath, Maanasa Choudhary, Maala Parvathi

Director: Praveen K

Producer: Vishnu Vishal

Music: Ghibran

Banner: Vishnu Vishal Studioz

Review By: Peddinti

Aaryan Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews