అదితి పోహంకర్ కి ఓటీటీ వైపు నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇంతకు ముందు ఆమె నుంచి వచ్చిన వెబ్ సిరీస్ లు ఆమె అభిమానుల సంఖ్యను పెంచుతూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఇప్పుడు మరో వెబ్ సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ పేరే 'జిద్దీ ఇష్క్ '. రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా .. 7 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సిరీస్ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: మెహుల్ (అదితి పోహంకర్) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లి .. తండ్రి .. తమ్ముడు 'నీల్' .. ఇదే ఆమె కుటుంబం. కోల్ కతాలోని ఓ ఇంట్లో వారు నివసిస్తూ ఉంటారు. అదే వీధిలో శేఖర్ (పరమబ్రత ఛటర్జీ) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతను సిద్ధార్థ్ రాయ్ (సుమిత్ వ్యాస్)కి చెందిన ఒక పెద్ద సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ రాయ్ శ్రీమంతుడు. అతనికి గల డబ్బు .. పరపతి కారణంగా అందరూ భయపడుతూ ఉంటారు. అతను విలాస పురుషుడని అంతా చెప్పుకుంటూ ఉంటారు. 'రాకా' అనే వ్యక్తి అతనికి రక్షణగా అనుక్షణం పక్కనే ఉంటూ ఉంటాడు.
పక్కనే పక్కనే ఇళ్లు ఉన్న కారణంగా శేఖర్ - మెహుల్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. శేఖర్ వ్యక్తిత్త్వం నచ్చిన కారణంగా, మెహుల్ అతనిని ప్రేమిస్తుంది .. పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఒక రోజున శేఖర్ ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకుని వెళతారు. ఆ తరువాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఊహించని ఈ సంఘటనకు మెహుల్ నివ్వెరపోతుంది. శేఖర్ తల్లి బాధ్యతను కూడా ఆమెనే తీసుకుంటుంది.
శేఖర్ ఎందుకు చనిపోయాడు? అనే ఒక సందేహం మెహుల్ ను వెంటాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ రాయ్ సంస్థ నుంచి వచ్చి, మెహుల్ పనిచేస్తున్న సంస్థలో 'మౌసమి' చేరుతుంది. గతంలో ఆమె సిద్ధార్థ్ రాయ్ కి సంబంధించిన సంస్థలో, శేఖర్ తో కలిసి పనిచేయడాన్ని మెహుల్ గుర్తుచేసుకుంటుంది. శేఖర్ ఆత్మహత్యకి కారణం ఏమిటని మౌసమిని అడుగుతుంది.
శేఖర్ ఎలా చనిపోయాడనేది తెలియాలంటే, గతంలో అతను ప్రేమించిన సయాంతిక ఆచూకీ తెలుకోవాలని మౌసమి చెబుతుంది. అయితే సయాంతికను సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడనీ, పెళ్లైన తరువాత నుంచి సయాంతిక ఏమైపోయిందనేది తెలియడం లేదని చెబుతుంది. దాంతో సయాంతిక ఆచూకీ తెలుకోవడం కోసం మెహుల్ రంగంలోకి దిగుతుంది. సయాంతిక ఏమైపోతుంది? శేఖర్ మరణానికి కారకులు ఎవరు? ఈ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మెహుల్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువతి, ఒక మంచి మనిషిని ఇష్టపడుతుంది. అయితే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అందుకు కారకులు ఎవరనేది తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ యువతి చేసే పోరాటంగా దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. మొదటి నుంచి చివరివరకూ ఈ కథ ఎక్కడా పట్టు సడలకుండా, ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ కథ సిద్ధార్థ్ రాయ్ .. మెహుల్ .. శేఖర్ .. అనే మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తరువాత వరుసలో రాకా .. ఆనంద్ .. సయాంతిక .. మౌసమి .. సోలంకి అనే పాత్రలు కనిపిస్తాయి. ప్రతి పాత్రకు ఒక గుర్తింపు .. ప్రయోజనం ఉంటాయి. అక్కడక్కడా యాక్షన్ ను .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. అందువలన ఎక్కడా కూడా ఈ కంటెంట్ బోర్ అనిపించదు.
ప్రేమించడమంటే భౌతికంగా ఉన్నప్పుడు కలిసి తిరగడం .. కబుర్లు చెప్పుకోవడం కాదు. ఆ వ్యక్తి అన్యాయంగా బలైపోతే వారి కోసం పోరాడటం .. వారి కుటుంబానికి అండగా నిలబడటం అనే దిశగా ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎక్కడా అనవసరమైన .. మరీ అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఈ కథను పరిగెత్తించిన విధానం ఆడియన్స్ ను మెప్పిస్తుంది.
పనితీరు: దర్శకుడు స్క్రిప్ట్ మీద గట్టిగానే కసరత్తు చేశాడని అనిపిస్తుంది. లూజ్ సీన్స్ ఎక్కడా కనిపించవు. కథ మొదలైన దగ్గర నుంచి పెర్ఫెక్ట్ గా ముందుకు సాగుతూనే ఉంటుంది. యాక్షన్ .. ఎమోషన్ .. ఈ మధ్యలో సాగే సస్పెన్స్ తో కూడిన డ్రామా చాలా కుతూహలంగా అనిపిస్తుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన అదితి పోహంకర్ - సుమిత్ వ్యాస్ నటన ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వర్క్ డీసెంట్ గా అనిపిస్తుంది. బలమైన డ్రామాతో నడిచిన ఈ సిరీస్ ఆడియన్స్ కి చాలావరకూ నచ్చుతుందనే చెప్పాలి.
ముగింపు: డబ్బు కోసం నిజమైన ప్రేమను సమాధి చేసేవాళ్లు మాత్రమే కాదు, నిజమైన ప్రేమ కోసం ప్రాణాలకు తెగించేవారు సైతం లేకపోలేదు అనే సందేశాన్ని చాటే సిరీస్ ఇది. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన ఈ డ్రామా, మొదటి నుంచి చివరి వరకూ బోర్ అనిపించకుండా సాగుతుంది.
'జిద్దీ ఇష్క్ ' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Ziddi Ishq Review
- అదితి పోహంకర్ నుంచి 'జిద్దీ ఇష్క్'
- 7 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
- 7 భాషల్లో జరుగుతున్న స్ట్రీమింగ్
- ఆసక్తికరమైన కథాకథనాలు
- హైలైట్ గా నిలిచే యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్
Movie Details
Movie Name: Ziddi Ishq
Release Date: 2025-11-21
Cast: Aaditi Pohankar,Parambrata Chatterjee,Sumeet Vyas,Riya Sen,Priyanshu Painyuli
Director: Raj Chakraborty
Music: -
Banner: -
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer