వెబ్ సిరీస్ లలో తన ప్రత్యేకతను చాటుతూ 'ఫ్యామిలీ మ్యాన్' దూసుకుపోతోంది. కథాకథనాల పరంగా .. యాక్షన్ దృశ్యాల పరంగా మంచి మార్కులు కొట్టేసిన సిరీస్ ఇది. ఇంతవరకూ వచ్చిన రెండు సీజన్లకు ఆడియన్స్ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో సీజన్ ఈ నెల 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సీజన్ 3 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతూ ఉంటాయి. ఆ అలజడులు ఆరకుండా చేయడానికి చైనా 'గువాన్ యు' అనే ప్రాజెక్టును ప్రారంభిస్తుంది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో ప్రధాని బసు ( సీమా బిశ్వాస్) ప్రాజెక్ట్ సహకార్ ను ఏర్పాటు చేస్తుంది. అయితే అక్కడ స్థానిక రెబల్స్ కు నచ్చ జెప్పడం ప్రధానమైన సమస్యగా మారుతుంది. దాంతో శాంతి ఒప్పందం కోసం, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సీనియర్ ఆఫీసర్ గౌతమ్ కులకర్ణి (దిలీప్ తాహిల్) ఏజెంట్ శ్రీకాంత్ (మనోజ్ బాజ్ పాయ్) నియమించబడతారు. ఆ పనిపై 'నాగాలాండ్' వెళతారు
ఇక రుక్మాంగద ( జైదీప్ అహ్లావత్) మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు సుపారీలు తీసుకుని అవతల వ్యక్తులను లేపేస్తూ ఉంటాడు. మీరా ఎస్టిన్ (నిమ్రత్ కౌర్) సమీర్ ద్వారా ఆమె రుక్మాంగద్ కి టచ్ లోకి వెళుతుంది. నాగాలాండ్ లో ఉన్న కులకర్ణిని .. ఏజెంట్ శ్రీకాంత్ ను లేపేయమని చెబుతుంది. దాంతో లోకల్ గా ఉన్న గ్యాంగ్ ను సిద్ధం చేసుకుని రుక్మాంగద రంగంలోకి దిగుతాడు. అయితే ఆ దాడిలో కులకర్ణి మాత్రమే చనిపోతాడు.
కులకర్ణి హత్య విషయంలో ఏజెంట్ శ్రీకాంత్ పైనే డిపార్టుమెంటు వారికి అనుమానం కలుగుతుంది. దాంతో వాళ్లు అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తారు. అరెస్టు వారెంట్ జారీ చేస్తారు. తాను దోషిని కాదని నిరూపించుకోవలసిన బాధ్యత శ్రీకాంత్ పై పడుతుంది. అయితే ఆ పని పూర్తి చేసేవరకూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలి. రుక్మాంగద్ ను వెతుక్కుంటూ అతను బయల్దేరితే, అతనిని పోలీసులతో పాటు రుక్మాంగద్ కూడా వెంటాడుతూ ఉంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఎవరి ప్రయత్నం ఫలిస్తుంది? అనేదే కథ.
విశ్లేషణ: ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు .. శాంతి ఒప్పందాలకు సంబంధించిన సన్నాహాలతో ఈ కథ మొదలవుతుంది. కులకర్ణి - శ్రీకాంత్ పై రుక్మా ఎటాక్ చేయడం .. అతను రహస్య ప్రదేశాలకు పారిపోవడం .. కులకర్ణి హత్య విషయంలో ఏజెంట్ శ్రీకాంత్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం .. అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఫ్యామిలీతో పాటు తప్పించుకోవడం వరకూ ఈ కథ పరుగులు తీస్తుంది.
శ్రీకాంత్ కోసం పోలీసులు గాలించడం .. అతను ఫ్యామిలీతో రహస్యంగా మకాం మారుస్తూ ఉండటం .. రుక్మా అతని ప్రియురాలు 'నీమా' గురించిన ట్రాక్ తెరపైకి వస్తాయి. నిజానికి ఈ మూడు ట్రాకులు కుతూహలాన్ని కలిగించేవే. పోలీస్ బృందం వేసే ఎత్తులు .. వాళ్లకి మస్కా కొట్టి మరో దారిలో శ్రీకాంత్ తప్పించుకోవడం .. రుక్మా కారణంగా 'నీమా' ప్రమాదంలో పడటం వంటి సన్నివేశాలు ఆడియన్స్ ను టెన్షన్ పెట్టాలి. కానీ అలా జరగలేదు.
మూడో ఎపిసోడ్ తరువాత ఈ మూడు వైపుల నుంచి కథ ఆశించినస్థాయిలో ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. కథనం ఒక్కసారిగా వేగాన్ని కోల్పోయి .. నిదానంగా, నింపాదిగా నడవడం మొదలవుతుంది. సన్నివేశాలు చాలా నీరసంగా కదులుతూ ఉంటాయి. యాక్షన్ సన్నివేశాల మాదిరిగా, ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలు పెద్దగా అవి కనెక్ట్ కావు. నాగాలాండ్ కి సంబంధించిన లొకేషన్స్ ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తాయి.
పనితీరు: దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ కథను చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టారు. నాగాలాండ్ కి సంబంధించిన ఎపిసోడ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. అయితే ఆ తరువాత నుంచి వేగం తగ్గుతూ వెళుతుంది. యాక్షన్ సన్నివేశాలు మందగించడం .. ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం వలన, కథ కాస్త డీలాపడినట్టుగా అనిపిస్తుంది.
మనోజ్ బాజ్ పాయ్ నటనకి వంక బెట్టవలసిన అవసరం లేదు. జైదీప్ అహ్లావత్ నటన బాగుంది. ప్రియమణితో పాటు మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రపరిధిలో నటించారు. నాగాలాండ్ లొకేషన్స్ ను కవర్ చేసిన తీరు .. ఛేజింగ్స్ ను చిత్రీకరించిన విధానంతో కెమెరా వర్క్ మార్కులు కొట్టేస్తుంది. ఇక సందర్భానికి తగినట్టుగా నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది.
ముగింపు: 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 నుంచి 7 ఎపిసోడ్స్ వదిలితే, మొదటి 3 ఎపిసోడ్స్ మాత్రమే ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి. ఆ తరువాత నుంచి ఆ స్థాయి వేగంతో కథ ముందుకు వెళ్లలేకపోతుంది. కథలో ప్రధానమైన సమస్య .. అందుకు కారణమైన పాత్రలు అలా ఉండగానే సీజన్ 3 ముగుస్తుంది. దీనిని బట్టి నాలుగో సీజన్ ఉందనే హింట్ ఇచ్చారు.
'ఫ్యామిలీ మ్యాన్ 3' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
The Family Man 3 Review
- 'ఫ్యామిలీ మ్యాన్' నుంచి సీజన్ 3
- 7 ఎపిసోడ్స్ గా వచ్చిన సిరీస్
- 4వ ఎపిసోడ్ నుంచి తగ్గిన వేగం
- హైలైట్ గా నిలిచిన యాక్షన్ సీన్స్
- సీజన్ 4 దిశగా వెళ్లిన ముగింపు
Movie Details
Movie Name: The Family Man 3
Release Date: 2025-11-21
Cast: Manoj Bajpayee, Priyamani, Jaideep Ahlawath, Sharib Hashmi, Nimrath Kaur
Director: Raj - DK
Music: -
Banner: A D2R Films Production
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer