'రాజు వెడ్స్‌ రాంబాయి' మూవీ రివ్యూ

  • యదార్థ ప్రేమకథ 
  • సాగతీతగా సెకండాఫ్‌ 
  • అలరించే నాయకా, నాయికల నటన 
  • హృదయాలను హత్తుకునే క్లైమాక్స్‌
ఓ ఊర్లో జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన చిత్రం 'రాజు వెడ్స్‌ రాంబాయి'. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి ఓ సరికొత్త ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుందని విడుదలకు ముందు నుంచే మేకర్స్‌ ప్రకటించడం.. ఈ చిత్రం నచ్చకపోతే నేను డ్రాయర్‌ మీద అమీర్‌పేట్‌ చౌరస్తాలో ఉరుకుతా అని దర్శకుడు బహిరంగంగా సవాల్‌ విసరడంతో ఈ చిత్రంపై, ఈ సినిమా ఫలితంపై అందరిలోనూ ఆసక్తి కలిగింది. ఇక ఈ వాస్తవ ప్రేమకథ ప్రేక్షకులను అలరించిందా? ఈ సినిమా సమీక్షలో తెలుసుకుందాం.

కథ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... ఓ పల్లెటూరులో జరిగే కథ ఇది. ఆ ఊర్లో తండ్రి వారసత్వంగా ఫంక్షన్‌లకు బ్యాండ్‌ కొట్టుకుంటూ, ఫ్రెండ్స్‌తో  సరదాగా తిరుగుతుంటాడు రాజు. (అఖిల్‌ రాజ్‌) అదే ఊరికి చెందిన  రాంబాయిని (తేజస్విని) ప్రేమిస్తుంటాడు. ప్రారంభంలో రాజు ప్రేమను తిరస్కరించినా, తరువాత అతను తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న తరువాత రాంబాయి కూడా రాజుని ప్రేమిస్తుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న మాత్రం తన కూతురును ఓ గవర్నమెంట్‌ ఉద్యోగికి  ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. 

ఎట్టి పరిస్థితుల్లోనైనా రాంబాయికి ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమే చేయాలనే సంకల్పంతో ఉంటాడు వెంకన్న. అయితే రాజు, రాంబాయి పెళ్లి కోసం శారీరకంగా కలుసుకుంటారు. తనను, రాజు గర్బవతిని చేస్తే తండ్రి తప్పకుండా తమ పెళ్లి చేస్తాడని అనుకుంటారు ఈ ప్రేమికులు. అయితే ఈ నేపథ్యంలో రాజు, రాంబాయిల ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది? రాజు, రాంబాయిలు పెళ్లి చేసుకోకుండా వెంకన్న ఎంతటి దుర్మారపు ఆలోచన చేశాడు? అనేది మిగతా కథ 

విశ్లేషణ: ఇప్పటి వరకు తెలుగు సినిమాలో, ఇతర భాష సినిమాల్లో కూడా ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఇందులో కొన్ని సమాజంలో జరిగిన యదార్థ ప్రేమకథలను కూడా తెరకెక్కించారు. ఈ చిత్ర దర్శకుడు కూడా ఓ గ్రామంలో జరిగిన నిజ జీవిత ప్రేమకథను ఈ సినిమా రూపంలో తెరకెక్కించాడు. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పతాక సన్నివేశాలు అందరిని షాకింగ్‌కు గురిచేసే విధంగా ఉంటాయి. ఇంత వరకు ఏ ప్రేమకథలో చూడని పతాక సన్నివేశాలు ఇందులో ఉంటాయి. ఈ క్లైమాక్స్‌పైనే దర్శక, నిర్మాతలు ఆశలన్నీ పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా అనిపిస్తుంది. 

అయితే మిగతా సన్నివేశాలు, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, పాత్రలపై దర్శకుడు పెద్దగా వర్క్‌ చేయలేదని అనిపిస్తుంది. సినిమాలోని ఏ పాత్ర కూడా సంపూర్ణంగా అనిపించదు. ముఖ్యంగా నిన్ను ప్రేమించకపోతే నువ్వు కొడతావు, ప్రేమిస్తే మా నాన్నకొడతాడు అంటూ హీరోయిన్‌ చెప్పే సంభాషణ విన్నప్పుడు మాత్రం హీరో పాత్రపై ఎందుకో తెలియని అసహ్యం కలుగుతుంది. మూర్ఖుడైన తండ్రి, మరింత మూర్ఖుడైన ప్రేమికుడు మధ్య నలిగిపోయిన అమ్మాయిలా హీరోయిన్ పాత్రను డిజైన్‌ చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంది. అయితే ఫోన్‌ ఎత్తకపోతే... హీరోయిన్‌ను కట్టెతో వాతలు పడేటట్లు రాజు కొట్టడం ఎంత వరకు సబబు అనిపించిందో దర్శకుడికే తెలియాలి. 

పతాక సన్నివేశాల్లో హీరోయిన్‌ మీద ఉన్న అమితమైన, గాఢ ప్రేమను చూపించడానికి ముందు హీరో పాత్ర చిత్రణను ఇంత కఠినంగా డిజైన్‌ చేయడం అవసరమా? అనిపిస్తుంది. ఈ సినిమాలో పతాక సన్నివేశాల్లో మినహా ఎక్కడా కూడా ఎమోషన్‌ క్యారీ అవ్వలేదు. హీరో, హీరో ఫ్రెండ్స్‌ చేసే వినోదం అక్కడక్కడ పర్వాలేదు..కానీ ఇలాంటి సినిమాలకు కమర్షియల్‌ యాంగిల్‌లో ఆలోచిస్తే వినోదం డోస్‌ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం చాలా నెమ్మదిగా, సాగతీతగా అనిపిస్తుంది. అయితే కేవలం ఈ సినిమాలో పతాకా సన్నివేశాలు మాత్రమే ఆకర్షణగా నిలుస్తాయి. అది కూడా ఇలాంటి ప్రేమకథలను ఎంకరేజ్ చేసే  ఆడియన్స్‌ను మాత్రమే ఈ క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. 


నటీనటుల పనితీరు: రాజుగా అఖిల్‌ రాజ్‌, రాంబాయిగా తేజస్విని నటన ఎంతో సహజంగా ఉంది. ఎక్కడా వాళ్లు ఆ పాత్రలో నటించిన ఫీలింగ్‌ రాలేదు అంటే వాళ్లు ఆ పాత్రల్లో ఎంతగా ఒదిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. వెంకన్నగా చైతన్య జొన్నలగడ్డ ప్రతి నాయకుడి పాత్రలో భయపెట్టాడు. కానీ తన మార్క్‌ను క్రియేట్‌ చేసుకోలేకపోయాడు. ఆయన పాత్ర చిత్రణలో లోపం కనిపించింది. ఇక  హీరో ఫ్రెండ్స్‌ పాత్రలు మన ఊరిలో ఉండే గ్యాంగ్‌ను గుర్తు చేశాయి. దర్శకుడు తను రాసుకున్న నిజ జీవిత ప్రేమకథను రస్టిక్‌గా, నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే కథలో ఎమోషన్‌ను ఆద్యంతం కొనసాగేలా తెరకెక్కించి ఉంటే సినిమా అందరి హృదయాలను హత్తుకునేది. సురేష్‌ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం సినిమాలోని స్పీడ్‌ను పెంచాయి. 

ఫైనల్‌గా: యదార్థ ప్రేమకథలను, ప్రేమకథల్లో  హృదయాలను బరువెక్కించే పతాక సన్నివేశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. అయితే ఈ సినిమా పతాక సన్నివేశాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే దానిని బట్టే ఈ సినిమా బాక్సాఫీస్‌ ఫలితం  ఆధారపడి ఉంది.

Movie Details

Movie Name: Raju Weds Rambai

Release Date: 2025-11-21

Cast: Akhil Raj, Tejaswini, Anita Chowdary, Chaitu Jonnalagadda,Shivaji Raja

Director: Saailu Kampati

Producer: Venu Udugula,Rahul Mopidevi

Music: Suresh Bobbili

Banner: ETV Win Originals

Review By: Maduri Madhu

Raju Weds Rambai Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews