సాధారణంగా మలయాళం నుంచి థ్రిల్లర్ నేపథ్యంలోని కథలు ఓటీటీ తెరపైకి ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈ సారి మలయాళం నుంచి బ్లాక్ కామెడీ డ్రామా జోనర్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే 'అవిహితం'. అక్టోబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీ నుంచి మలయాళంతో పాటు ఇతర భాషల్లోను 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 'సెన్నా హెగ్డే' దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ప్రకాశ్ ఎప్పటిలాగే ఓ రాత్రివేళ తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటాడు. అక్కడి నుంచి అతను తిరిగి వస్తుండగా, పొదలచాటున ఏదో అలికిడి అవుతుంది. అతను రహస్యంగా ఆ వైపుకు అడుగులు వేస్తాడు. ఆ చీకట్లో వినోద్ .. ఓ యువతి కలుసుకోవడం చూస్తాడు.. ఆ యువతి ఎవరనేది అతనికి కనిపించదు. కానీ ఆ పక్కనే 'నిర్మల' ఇల్లు ఉండటం వలన,  ఆమెనే అయ్యుంటుందని అనుకుంటాడు. మరునాడు ఉదయం ఈ విషయాన్ని తన స్నేహితుడైన 'వేణు'కి చెబుతాడు.

ప్రకాశ్ మాటలను వేణు నమ్మలేకపోతాడు. అతనితో కలిసి ఆ రాత్రి ఆ ప్రదేశానికి వెళతాడు. ప్రకాశ్ చెప్పినట్టుగానే అక్కడ వినోద్ ఒక యువతిని చాటుగా కలవడం .. సరసాలాడటం వేణు కూడా చూస్తాడు. ఆ యువతి నిర్మలనే అయ్యుంటుందని అతను కూడా భావిస్తాడు. నిర్మల భర్త ముకుందన్ .. మరిది మురళి .. మామ మాధవన్ పక్క ఊరుకి పనిపై వెళతారు. తన అత్తగారు .. పాప 'మీనూ'తో కలిసి నిర్మల ఉంటుంది. ఆమెను గురించి మురళికి కాల్ చేసి చెబుతాడు వేణు. 

తన అన్నయ్య ముకుందన్ మంచితనాన్ని అమాయకత్వం క్రింద భావించి అతనిని నిర్మల మోసం చేస్తోందని మురళి భావిస్తాడు. తమ కుటుంబంతో ఉన్న పాత 'పగ' కారణంగా వినోద్ ఇలా చేస్తున్నాడని అనుకుంటాడు. ఆ కోపంతో అతను ఏం చేస్తాడు? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? వినోద్ - నిర్మల విషయంలో వారి అనుమానం నిజమేనా? అనేది మిగతా కథ.

విశ్లేషణ: ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. విలేజ్ లో పని తక్కువగా ఉండి .. కబుర్లతో కాలక్షేపం చేసే కొందరు కనిపిస్తూ ఉంటారు. వాళ్ల చర్చల్లో ఇతరులను గురించిన మాటలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఇతరుల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే తాపత్రయం వాళ్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇతరుల ఇళ్లలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ పెద్ద మనుషులుగా మారిపోతూ ఉంటారు. 

ఇక గ్రామాలలో ఇంకో రకం మనుషులు కూడా మనకి తారసపడుతూ ఉంటారు. తమకంట పడకుండా ఎవరూ తప్పించుకోలేరని భావిస్తూ, తాము నమ్మిన విషయాన్ని ఊరందరితో నమ్మించడానికి నానాపాట్లు పడుతూ ఉంటారు. అలాంటి కొందరు పెద్ద మనుషుల చుట్టూ తిరిగే ఈ కథను దర్శకుడు తయారు చేసుకున్న తీరు ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసిన విధానమే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి.

కాలాక్షేపం కోసం .. తాము హైలైట్ కావడం కోసం కారణాలు వెతుక్కునేవారు కొందరు. తమకి ఆసక్తిని కలిగించే విషయాలను ప్రచారం చేయడానికి ఉత్సాహాన్ని చూపించేవారు మరికొందరు .. వాళ్ల తొందరపాటు కారణంగా ఇబ్బందులు పడేవారు కొందరు. ఇలాంటి ఒక కంటెంట్ ను ఇంట్రెస్టింగ్ గా నడిపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి.    
 
 పనితీరు: గ్రామీణ ప్రాంతాలలో మనచుట్టూ జరిగే సంఘటనలే ఈ కథ. మనచుట్టూ తిరిగేవే ఇందులోని పాత్రలు అన్నట్టుగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ప్రతి పాత్రను సహజత్వానికి దగ్గరగా ఆయన డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. ఆ పాత్రల స్వరూప స్వభావాలు మనకి బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తాయి. 

ఏదో ఘనకార్యం చేయబోతున్నట్టుగా .. ఏదో సాధించబోతున్నట్టుగా పెద్దల ఆశీస్సులు అందుకోవడం .. దేవుడికి నమస్కరించుకోవడం వంటి సన్నివేశాలు సరదాగా నవ్విస్తాయి. ఆర్టిస్టుల మాదిరిగా ఎవరూ అనిపించరు. అందరూ ఆ విలేజ్ కి చెందినవారే అన్నట్టుగా గొప్పగా నటించారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్, కథను మరింత సహజంగా ఆవిష్కరించడంలో తమవంతు పాత్రను పోషించాయి. 

ముగింపు
: విలేజ్ నేపథ్యలో సాగే ఈ కథ, అక్కడి మనుషులు .. వాళ్ల స్వభావాలను ఆసక్తికరంగా ఆవిష్కరిస్తుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా సరదాగా సాగిపోతుంది. ఈ సినిమాను స్క్రీన్ పై చూస్తున్నట్టు కాకుండా, ఆ ఊళ్లో ఉండి .. అక్కడి సన్నివేశాల్లో మనం కూడా భాగమైనట్టుగా అనిపిస్తుంది.