'ఢిల్లీ క్రైమ్ 3' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

  • క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా 'ఢిల్లీ క్రైమ్ 3'  
  • నిన్నటి నుంచి మూడో సీజన్ స్ట్రీమింగ్ 
  • 6 ఎపిసోడ్స్ అందుబాటులోకి 
  • ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 నుంచి 50 నిమిషాలు
  • ఆకట్టుకునే కథాకథనాలు 

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న భారీ వెబ్ సిరీస్ లలో 'ఢిల్లీ క్రైమ్ 3' ఒకటిగా కనిపిస్తుంది. ఇంతవరకూ ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 2019లో మొదటి సీజన్ గా 7 ఎపిసోడ్స్ .. 2022లో రెండో సీజన్ గా  5 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ నెల 13వ తేదీ నుంచి మూడో సీజన్ 6 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ కి వచ్చింది. తనూజ్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సీజన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: హర్యానాను అడ్డాగా చేసుకుని 'పెద్దక్క' పేరుతో మీనా (హ్యూమా ఖురేషి) తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటుంది. విజయ్ -  కుసుమ ఆమె అనుచరులుగా ఉంటారు.  ఢిల్లీలో మీనా మనిషిగా కల్యాణి పనిచేస్తూ ఉంటుంది. కల్యాణి ప్రధానమైన అనుచరుడిగా రాహుల్ ఉంటాడు. బలమైన కుటుంబ నేపథ్యంలేని అమ్మాయిలను టార్గెట్ చేసి, ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్లను నమ్మంచి ఇతర రాష్ట్రాలకు .. ఇతర దేశాలకు తరలిస్తూ ఉంటారు.

ఇక ఢిల్లీలోని ఒక హాస్పిటల్ కి ఒక టీనేజ్ అమ్మాయి వస్తుంది. తీవ్రంగా గాయపడిన ఒక పసిపాపను అక్కడ వదిలేసి పారిపోతుంది. చావు బ్రతుకుల్లో ఉన్న ఆ పాపను రక్షించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తూ ఉంటారు. మరో వైపున ఆ బిడ్డను వదిలి పారిపోయిన టీనేజ్ అమ్మాయి కోసం ఏసీపీ నీతి సింగ్ (రసిక దుగల్) బృందం గాలిస్తూ ఉంటుంది. ఒక పసిపాపను అంత తీవ్రంగా హింసించడం రాష్ట్రమంతటా చర్చనీయాంశమవుతుంది.    

'మిజోరామ్' మీదుగా ఆయుధాలు అక్రమ రవాణా జరుగుతుందని అనుమానించిన డీసీపీ వర్తిక చతుర్వేది (షెఫాలి షా)కి ఒక కంటెయినర్ లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడతారు. దాంతో అక్కడి నుంచి ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. అమ్మాయిలను ఎలా ఉచ్చులోకి లాగుతున్నారు? ఢిల్లీలో ఎక్కడికి తరలిస్తున్నారు? హాస్పిటల్లోని పసిబిడ్డకు .. అమ్మాయిల తరలింపుకు మధ్య ఉన్న సంబంధమేమిటి? ఫైనల్ గా ఈ అమ్మాయిలందరూ ఎక్కడికి చేరుతున్నారు? అనేది మిగతా కథ.

విశ్లేషణ: అనాథలైన .. అభాగ్యులైన అమ్మాయిలకు అందమైన జీవితాన్ని ఆశ చూపించి, వాళ్లపై కోట్ల రూపాయలను సంపాదించే ఒక కిలాడీ గ్యాంగ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆయుధాల మాదిరిగానే అమ్మాయిలు కూడా పాల ట్యాంకర్ లలో .. నీళ్ల ట్యాంకర్ లలో .. కంటెయినర్ లలో తరలించబడుతున్న తీరును దర్శకుడు ఈ కథలో ఆవిష్కరించాడు. ఇలాంటి కేసులలో పోలీస్ లు ఎంత రిస్క్ చేస్తారనేది చూపించిన తీరు మెప్పిస్తుంది.
 
అస్సాం .. హర్యానా .. మిజోరాం .. సూరత్ .. రాజస్థాన్ .. ఢిల్లీ .. ఇలా అనేక ప్రాంతాలను టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. నేరస్థుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? వాళ్లు తమ అవసరాలను బట్టి ఎలా రంగులు మారుస్తూ ఉంటారు? అమాయకుల జీవితాలతో ఎలాంటి విలాసాలను పొందుతుంటారు? అనేది దర్శకుడు చూపించిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.అదే సమయంలో ఆలోచింపజేస్తుంది కూడా.

ఆయా ప్రాంతాలు .. అక్కడి పోలీస్ ఆఫీసర్లు .. వాళ్ల వ్యక్తిగత విషయాలు .. వృత్తి పరమైన సమస్యలు .. వాటిని అధిగమిస్తూ వాళ్లు ముందుకు వెళ్లే విధానం ప్రశంసనీయంగా అనిపిస్తుంది. అమ్మాయిల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే కిలాడీ లేడీలు మాత్రమే కాదు, ఆ అమ్మాయిలను కాపాడటానికి ప్రాణాలకు తెగించే సిన్సియర్ లేడీ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనే విషయాన్ని ఈ సిరీస్ స్పష్టం చేస్తుంది. 

పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే ఈ సీజన్ కి ప్రధానమైన బలం అని చెప్పాలి. అమ్మాయిలను సరఫరా చేసే అరాచక శక్తులకు .. పోలీస్ అధికారులకు మధ్య పోరాటాన్ని అత్యంత ఆసక్తికరంగా ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. అక్రమ మార్గాల ద్వారా సంపాదించాలనుకునేవారికి కనువిప్పి కలిగేలా క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. 

ఆర్టిస్టులంతా కూడా గొప్పగా చేశారు. నిజమైన పోలీస్ ఆఫీసర్లను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ప్రతిభ ఈ సీజన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పాలి.

ముగింపు: భారీతనం .. సహజత్వం .. ఆసక్తికరం .. ఈ మూడింటినీ కలిపి ఆవిష్కరించిన సిరీస్ ఇది. ఈ సీజన్ కోసం ఎంచుకున్న అంశం .. దానిని సమర్థవంతంగా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సీజన్ తో 'ఢిల్లీ క్రైమ్' సిరీస్ తన స్థాయిని మరోసారి నిలబెట్టుకుందని చెప్పచ్చు. 

Movie Details

Movie Name: Delhi Crime 3

Release Date: 2025-11-13

Cast: Shefali Shah, Huma Qureshi, Rajesh Tailang, Rasika Dugal, Anurag Arora, Jaya Bhattacharya, Gopal Dutt

Director: Tanuj Chopra

Producer: Vicky Vijay

Music: Ceiri Torjssen 

Banner: A GoldenKaravan - SK Global

Review By: Peddinti

Delhi Crime 3 Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews