'మహారాణి 4'( సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో 'మహారాణి'
  • ఇంతవరకూ అలరించిన 3 సీజన్లు 
  • ఈ నెల 7వ తేదీ నుంచి 4వ సీజన్
  • 8 ఎపిసోడ్స్ గా పలకరించిన కంటెంట్  
  • బలమైన కథాకథనాలతో ఆకట్టుకున్న సిరీస్      
'మహారాణి' .. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన భారీ వెబ్ సిరీస్. 2021 నుంచి 2024 వరకూ ఈ సిరీస్ నుంచి మూడు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాల్గొవ సీజన్ ఈ నెల 7వ తేదీ నుంచి 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యూమా ఖురేషి టైటిల్ రోల్ ను పోషించిన ఈ సిరీస్, హిందీతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. పునీత్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన సీజన్ - 4 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: రాణి భారతి (హ్యూమా ఖురేషి) బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర ఆమెకి ఉంటుంది. ఆమె పెద్ద కొడుకు జై ప్రకాశ్ కి పెద్దగా చదువు అబ్బదు. రెండో కొడుకు సూర్య విదేశాలలో చదువుకుంటూ ఉంటాడు. కూతురు రోషిణి (శ్వేతా బసు ప్రసాద్), రాజకీయాలలో తల్లికి తోడుగా ఉంటుంది. బీహార్ నుంచి .. రాణి భారతీదేవి నుంచి తన పదవికి ప్రమాదం ఉందని ప్రధానమంత్రి జోషి భావిస్తాడు. 

రాణి భారతికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనీ, మాజీ గవర్నర్ గోవర్ధన్ హత్య కేసులో ఆమెను జైలుకు పంపించాలని జోషి భావిస్తాడు. అందుకోసం 'మహేశ్వరీ కమీషన్ రిపోర్టు'ను తెరపైకి తీసుకుని వస్తాడు. దాంతో రాణి భారతి నేరుగా వెళ్లి జోషీని కలుస్తుంది. హత్యా నేరంపై తనని జైలుకు పంపించాలనే అతని ప్రయత్నం పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది. అతను కూర్చున్న ప్రధాని సీట్లో త్వరలో తాను కూర్చుంటానని సవాలు చేస్తుంది.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ సీట్లో తన కూతురు రోషిణిని కూర్చోబెడుతుంది. ప్రధానమంత్రి పదవి కోసం తాను చేయనున్న పోరాటంలో తనకి సహాయంగా జై ప్రకాశ్ ఉంచుతుంది. రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో పావులు కదపడం మొదలుపెడుతుంది. అప్పుడు జోషీ ఏం చేస్తాడు? ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు? అతని కారణంగా రాణి భారతి కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: రాజకీయాలలో రౌడీయిజం .. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసే దౌర్జన్యం .. సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను సైతం రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇక రాజకీయాలలో తమకి వ్యతిరేకంగా వ్యవహరించేవారి పట్ల, రాజకీయనాయకులు మరింత రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆలాంటి అంశాలను ప్రధానంగా చేసుకుని అలుకున్న ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తుంది. 

ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు ఎలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది రాజకీయనాయకులు ఎప్పటికప్పుడు ఎలా ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటారు. తమ అవసరాలను .. అవకాశాలను బట్టి ఎలా వ్యవహరిస్తుంటారు? స్వార్థ రాజకీయాలను తట్టుకుని నిలబడటం .. పోరాడటం ఎంత కష్టమనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. కథాకథనాలు నిదానంగా సాగినప్పటికీ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 

పాత్రల సంఖ్య .. మలుపులు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కథ చాలా నీట్ గా .. స్పష్టంగా ముందుకు వెళుతుంది. 7 .. 8 ఎపిసోడ్స్ లో కథ మరింత చిక్కబడి ఉత్కంఠను పెంచుతుంది. స్క్రీన్ ప్లే ఈ సీజన్ కి కూడా హైలైట్ గానే నిలిచిందని చెప్పాలి. ఎమోషన్స్ కి ఇచ్చిన ప్రాధాన్యత .. వాటిని కనెక్ట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

పనితీరు: కథాకథనాలు .. ప్రధానమైన పాత్రలను మలచిన విధానం మంచి మార్కులను కొట్టేస్తుంది. ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంది .. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. నిర్మాణ విలువలు కూడా భారీస్థాయిలోనే ఉన్నాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులు తమ పాత్రలలో గొప్పగా చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఈ సీజన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. 

ముగింపు: స్వార్థ రాజకీయాలు .. పదవులపై వ్యామోహంతో  చేసే అన్యాయాలు .. అక్రమాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. అలాంటి రాజకీయనాయకులను ఎదిరించి నిలిచే ఒక పల్లెటూరి స్త్రీ ఈ  కథలోని ప్రధానమైన పాత్ర. బలమైన కథాకథనాలతో రూపొందిన ఈ సిరీస్, ఈ సీజన్ ద్వారా కూడా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుందని చెప్పొచ్చు. 

Movie Details

Movie Name: Maharani 4

Release Date: 2025-11-07

Cast: Huma Qureshi, Vipin Sharma, Shwetha Basu Prasad, Shardul Bharadwaj, Pramod Pathak

Director: Puneet Praksh

Producer: Naven Kumar- Dimple Kharbanda

Music: Anand S Bajpai

Banner: Kangra Productions

Review By: Peddinti

Maharani 4 Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews