మలయాళంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే 'లోకా చాప్టర్ 1: చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ సమర్పించిన ఈ సినిమా, ఆగస్టు 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. కేవలం 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) కొత్తగా ఒక సిటీకి వస్తుంది. ఒక ఇంట్లో అద్దెకి దిగుతుంది. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో సన్నీ (నస్లెన్) తన స్నేహితులతో కలిసి ఉంటాడు. తొలి చూపులోనే అతను ఆమె పట్ల మనసు పారేసుకుంటాడు. చంద్రకి సూర్యకాంతి పడదు. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటూనే ఒక బేకరీ షాప్ లో పని చేస్తూ ఉంటుంది. చంద్ర ఒంటరిగా ఉంటూ ఉండటం .. ఎవరితోను కలవక పోవడం సన్నీకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

ఆ సిటీలో 'ఆర్గాన్స్' కి సంబంధించిన మాఫియా కొనసాగుతూ ఉంటుంది. ఒంటరి వ్యక్తులను టార్గెట్ చేసి .. కిడ్నాప్ చేస్తూ ఉంటారు. అలా కిడ్నాప్ అవుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోతుంటుంది. మాఫియా ముఠాకి .. పోలీస్ ఆఫీసర్ నాచియప్పన్ కి మధ్య సంబంధం ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరో వ్యక్తులు చంద్ర ఇంటికి వచ్చి ఏవో బాక్సులు ఇచ్చి వెళ్లిపోతుంటారు. ఆ బాక్సులలో ఉన్నదేమిటనేది సన్నీకి అర్థం కాదు. ఒక రోజు రాత్రివేళ అతను ఆమెను రహస్యంగా అనుసరిస్తాడు. 

అదే సమయంలో 'ఆర్గాన్స్' కి సంబంధించిన మాఫియా గ్యాంగ్ ఆమెపై దాడి చేస్తుంది. ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఊహించని విధంగా ఆమె రియాక్ట్ అవుతుంది. తనని కిడ్నాప్ చేయాలనుకున్న గ్యాంగ్ ను అక్కడే చంపేస్తుంది. చంద్రను ఫాలో అవుతూ వచ్చిన సన్నీ ఇదంతా చూస్తాడు. ఆమె సాధారణ కన్య కాదనే విషయం అతనికి అర్థమైపోతుంది. అప్పుడు సన్నీ ఏం చేస్తాడు? చంద్రకి మానవాతీతమైన శక్తి ఎలా వచ్చింది? ఆమె గతం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సాధారణంగా సూపర్ హీరో కాన్సెప్ట్ లను హీరోలతోనే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ హీరోలు అసాధ్యాలను అవలీలగా చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ తరహా కాన్సెప్ట్ ను నాయిక ప్రధానమైన కంటెంట్ గా మార్చడం దగ్గర .. ఆ పాత్రలో కొన్ని పరిమితులు పెట్టడం దగ్గర  దర్శకుడు మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ఈ తరహా కథలకు ఒక రేంజ్ లో గ్రాఫిక్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అవసరమైతేనే తప్ప, గ్రాఫిక్స్ జోలికి వెళ్లలేదు.

తెరపై కథ నడుస్తూ ఉండగానే, ఈ శక్తులు చంద్రకి ఎలా వచ్చాయి? అనే ఒక ఆత్రుత ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటుంది. అలాగే తాను ప్రేమిస్తున్న అమ్మాయి, సాధారణమైన అమ్మాయి కాదని తెలిసినప్పుడు సన్నీ పరిస్థితి ఏమిటి? అని ఆడియన్స్ అనుకుంటారు. అయితే ఈ రెండు అంశాలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు, ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అలాగే పోలీస్ ఆఫీసర్ 'నాచియప్పన్' వైపు నుంచి వేసుకున్న ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
                 
సెకండాఫ్ లో 'టోవినో థామస్' కొంతసేపు మెరుస్తాడు. చివర్లో 'దుల్కర్ సల్మాన్' కూడా కనిపిస్తాడు. వారి పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తీరు కథకి అంతగా అతగదు గానీ, సీక్వెల్ పై ఆసక్తిని రేకెత్తించడం కోసం చేసిన మేజిక్ గానే మనం భావించవలసి ఉంటుంది. మొత్తం కథ మీద చూసుకుంటే, చంద్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆమె యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. 

పనితీరు: అసాధారణ శక్తులున్న ఒక యువతి .. అది తెలియక ఆమెను ఆరాధించే ఒక సాధారణ యువకుడు చుట్టూ తిరిగే కథ ఇది.  ఇద్దరి మధ్య పైకి చెప్పుకోని ప్రేమ ఉంటుంది .. కానీ రొమాన్స్ ఉండదు. డ్యూయెట్లకు అసలు ఛాన్స్ లేదు. అయినా బోర్ కొట్టకుండా దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. 

కల్యాణి ప్రియదర్శన్ ఈ పాత్రలో సరిగ్గా కుదిరిపోయింది .. ఇమిడిపోయింది. ఇక నస్లెన్ నటన కూడా చాలా సహజంగా అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు. నిమిష్ రవి ఫొటోగ్రఫీ .. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. అలాగే చమన్ చాకో ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. 

ముగింపు: చంద్ర ఫ్లాష్ బ్యాక్ చాలా చిన్న ఎపిసోడ్ అయినప్పటికీ, ఈ కథకు అదే కీలకం .. అదే బలం కూడా. టోవినో థామస్ .. దుల్కర్ సల్మాన్ ఎంట్రీ కాస్త అసహజంగా అనిపించినా, మిగతా కథ అంతా కూడా ఆసక్తికరంగానే కొనసాగుతుంది. అక్కడక్కడా కాస్త నిదానంగా సాగినట్టుగా అనిపించినా, అది సీక్వెల్ కోసం దర్శకుడు వేసుకున్న ప్లానింగ్ గానే భావించవలసి ఉంటుంది.