తమిళ కథానాయకుడు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ తెలుగులో పలు అనువాద చిత్రాలతో పరిచయమైన అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ సారి ధృవ్ విక్రమ్ 'బైసన్' అనే పేరుతో ఓ తమిళ చిత్రంలో నటించాడు. గతం వారం తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేశారు. కబడ్డి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? ధృవ్ విక్రమ్‌కు ఈ సినిమాతో తెలుగులో గుర్తింపు వస్తుందా? లేదా సమీక్షలో తెలుసుకుందాం.
కథ: తమిళనాడులో వర్గ విభేదాలు, పగలు, ప్రతీకారలతో రగులుతున్న మారుమూల గ్రామానికి చెందిన వనతి కిట్టయ్య (ధృవ్ విక్రమ్)కు చిన్నప్పటి నుంచి కబడ్డీయే జీవితం. ఆ ఊరిలో కబడ్డీ అంటే ఇష్టమున్న వాళ్లు ఎక్కువే ఉంటారు. అయితే కిట్టయ్య తండ్రి వేలుసామి (పశుపతి) మీద కోపంతో సొంత గ్రామంలో కూడా కబడ్డీ టీమ్‌లోకి రానివ్వరు. ఇక కబడ్డీపై ఇష్టం చంపుకోలేని కిట్టయ్య అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అతని ఆసక్తిని గమనించిన కోచ్ మదన్ కుమార్ దక్షిణ మూర్తి స్కూల్ టీమ్‌లో చేర్చుకుంటాడు.
స్కూల్ టీమ్ నుంచి మొదలైన కిట్టయ్య కబడ్డి ప్రస్థానం ఇండియా టీమ్‌లోకి ఎంపికై జపాన్ దాకా వెళ్లి భారతదేశం తరపున ఆడి దేశ ప్రతిష్టను ఎలా పెంచాడు? ఇందుకోసం ఆయన ఎదుర్కొన కష్టాలు ఏమిటి? కిట్టయ్య అక్క రాజి ( రజిషా విజయ్) అతనికి ఎలా సపోర్ట్ అందజేసింది? రాణికి (అనుపమ పరమేశ్వరన్)కు కిట్టయ్య ప్రేమ గెలిచిందా? ఈ కథలో పాండ్యరాజ్ (అమీర్) కందసామి (లాల్)ల మధ్య వైరం ఏమిటి? వాళ్లలో మార్పు వచ్చిందా? చివరికి ఏం జరిగింది? అనేది బైసన్ కథాంశం.
విశ్లేషణ: 1990 కాలంలో తమిళనాడులోని ఓ గ్రామంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని కబడ్డీ నేపథ్యానికి వర్గ విభేదాలు, పగలు, ప్రతీకారాలను జత చేసి దర్శకుడు మారి సెల్వరాజ్ రాసుకున్న కథ ఇది. కులం, మతం జాతి పేరిట కొంత మంది ఎలాంటి వివక్షకు గురవుతున్నారు అనే అంశాన్ని కూడా దర్శకుడు ఈ కథ ద్వారా చెప్పాడు. దర్శకుడు మారి సెల్వరాజ్ గత సినిమాల తరహాలోనే ఈ చిత్రం కూడా అత్యంత సహజంగా కొనసాగుతుంది. 'కాలమాడన్' అనే కబడ్డీ క్రీడాకారుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఇలాంటి ఓ క్రీడాకారుడు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చూపించడంలో ఆడియన్స్‌ను కథలో ఇన్వాల్వ్ చేయాలంటే ఎంతో గొప్ప స్క్రీన్‌ప్లే అవసరం. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
కథ ప్రజెంట్లో నడుస్తూనే మరో వైపు ఫ్లాష్‌బ్యాక్‌లో కూడా కథను చెబుతూ ప్యారలల్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఎంతో నేచురల్‌గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలాంటి కథలో కుల, వర్గ విభేదాలు, ప్రతీకారాలు, రిజర్వేషన్ సిస్టమ్ గురించి చర్చించినా కథను ఆసక్తిగా నడిచే విధంగా చాలా బలమైన సన్నివేశాలు రాసుకున్నాడు. అయితే ఇలాంటి అంశాలు చర్చించే సమయంలో సినిమా కాస్త స్లోగా సాగతీతగా అనిపిస్తుంది. బైసన్ విషయంలో కూడా అదే జరిగింది. పస్టాఫ్తో పాటు సెకండాఫ్ కూడా స్లోగా కథ, కథనాలు సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎక్కడా కూడా ప్రేక్షకుడు డివీయేట్ అవ్వకుండా కథనంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా సినిమా ఆద్యంతం ఆసక్తిగా మలిచాడు.
కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రం రీపీటెడ్ అనిపించాయి. ఇలాంటి రియలిస్టిక్ కథలకు కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకుంటే ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఈ అంశాలు మార్వి సెల్వరాజ్ గత సినిమాల్లో కనిపించాయి. కానీ 'బైసన్'లో కనిపించక పోవడమే ప్రధాన మైనస్‌గా చెప్పుకోవచ్చు. సినిమా లెంగ్త్ విషయంలో కూడా కేర్ తీసుకుని ఉంటే 'బైసన్' అందర్ని అలరించే విధంగా ఉండేది.
నటీనటుల పనితీరు: వనతి కిట్టయ్య పాత్రలోకి ధృవ్ విక్రమ్ పరకాయ ప్రవేశం చేశాడు. సాధారణంగా ఓ పాత్ర కోసం చియాన్ విక్రమ్ ఎంతో కష్టపడతాడో, ఎన్ని నెలలు శిక్షణ తీసుకుంటాడో అందరి తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడిగా ధృవ్ విక్రమ్ అదే పద్దతిని ఫాలో అవుతున్నాడు. బైసన్ సినిమాలోని పాత్ర కోసం ఆయన రెండున్నరేళ్ల పాటు ఒక ఊర్లో ఉండిపోయి, అక్కడి జనాలతో కలిసిపోయి పాత్ర కోసం అంకిత భావంతో హార్డ్ వర్క్ చేశాడు.
అందుకే పాత్ర తాలుకు ఆహార్యం, శారీరక భాష అతని అణువణువున నిండిపోయింది. తండ్రి పాత్రలో పశుపతి నటనను ప్రశంసించే స్థాయిలో ఉంది. కోచ్ పాత్రలో మదనకుమార్ తప్ప మరొకరు చేయలేరు అనే విధంగా ఎంతో నేచురల్‌గా నటించాడు. లాల్, అమీర్ పాత్రలు ఆకట్టుకుంటాయి. వారి పాత్రల్లో ఉండే కఠినత్వం, సున్నితత్వం రెండు ఎమోషన్స్‌ను ఇద్దరూ బాగా చేశారు. అనుపమ పరమేశ్వరన్‌కు డైలాగులు తక్కువైనా కళ్లతోనే నటించింది. ఎందుకో ఆమె డీగ్లామర్ పాత్రలో కనిపించినా, ఎక్కడా అలా అనిపించదు. చాలా అందమైన అమ్మాయిలానే అనిపిస్తుంది. రజిషా విజయన్ నటన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్లా నిలిచిపోతుంది.
సాంకేతిక వర్గం పనితీరు: ఎళిల్ అరసు ఫోటోగ్రఫీ మన మనసుకు కథ చెబుతున్న భావన కలిగించింది.ప్రతి ఫ్రేమింగ్ ఎంతో సహజంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ మ్యాజిక్‌తో ఆడియన్స్ కథలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేసింది. నివాస.కె. ప్రసన్న నేపథ్య సంగీతం కథ మూడ్‌ని సెట్ చేసింది. ఈ సినిమాకు ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్యూమ్స్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఈ రోజు ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా కనిపిస్తుంది. వాళ్ల పనితీరు కూడా ఆకట్టుకుంది.
ఫైనల్‌గా : నిజజీవిత కథతో, రూటెడ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన సీరియస్ కథాంశం ఇది. ఎటువంటి సినిమాటిక్ అంశాలు లేకుండా రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందక పోవచ్చు. ఇలాంటి రియలిస్టిక్ కథకు కథలో సోల్ లోపించకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, మరిన్ని కమర్షియల్ వాల్యూస్ యాడ్ చేసి ఉంటే 'బైసన్' అందరిని ఆకట్టుకునే అవకాశం ఉండేది.
'బైసన్' సినిమా రివ్యూ
Bison Review
- ధృవ్ విక్రమ్ హీరోగా 'బైసన్'
- కబడ్డీ నేపథ్యంతో కొనసాగే కథ
- ఆకట్టుకున్న ధృవ్ విక్రమ్ నటన
Movie Details
Movie Name: Bison
Release Date: 2025-10-24
Cast: Dhruv Vikram, Pashupathi, Aamir, Lal, Anupama Parameswaran, Rajisha Vijayan, Alagam Perumal, Aruvi Madhan, Anurag Arora
Director: Mari Selvaraj
Music: Niwas K. Prasanna
Banner: Applause Entertainments
Review By: Maduri Madhu
Trailer