'ఫైనల్ డెస్టినేషన్ :బ్లడ్ లైన్స్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • మే 16న రిలీజైన సినిమా
  • వేలకోట్లు వసూలు చేసిన కంటెంట్  
  • ఈ నెల 16 నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • తెలుగులోను అందుబాటులోకి
  • దడపుట్టించే సన్నివేశాలు 
  • హార్ట్ పేషంట్లు చూడకపోవడమే మంచిది  
           

హాలీవుడ్ లో ఫ్రాంఛైజీ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందే 'ఫైనల్ డెస్టినేషన్'. ఇంతవరకూ ఈ   ఫ్రాంఛైజీ నుంచి 5 భాగాలు వచ్చాయి. 2011 తరువాత 6వ భాగంగా ప్రేక్షకులను పలకరించిందే 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్'. జాక్ లిపోవ్ స్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఇంగ్లిష్ తో పాటు హిందీ .. తెలుగు .. తమిళ భాషల్లో 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: 'స్టెఫీ' ఓ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. తరచూ ఆమెకి ఒక పీడకల వస్తూ ఉంటుంది. తన అమ్మమ్మ ఐరిస్ కి సంబంధించిన కల అది. 50 ఏళ్ల క్రితం ఆమె అమ్మమ్మ ఐరిస్ .. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి 'స్కై వ్యూ' అనే ఒక రెస్టారెంట్ కి వెళుతుంది.  ఎత్తయిన టవర్ తరహాలో .. చుట్టూ గ్లాస్ ఫిటింగ్ తో నిర్మించిన రెస్టారెంట్ అది. తాను గర్భవతిని అనే విషయం అక్కడికి వెళ్లిన తరువాతనే ఆమెకి తెలుస్తుంది. 

ఒక కుర్రాడి ఆకతాయి తనం వలన ఆ టవర్ పడిపోతుందనే విషయం ఐరిస్ కి ముందుగానే తెలిసిపోతుంది. అక్కడికి వచ్చిన వారిని ఆమె అప్రమత్తం చేస్తూ ఉండగానే, ఆ టవర్ కుప్పకూలిపోతుంది. ఆమె కొంతమందిని కాపాడ గలుగుతుంది. మిగతా వాళ్లంతా చనిపోతారు. తనని కలవర పెడుతున్న ఈ కలను గురించి చెప్పడం కోసం, ఓ పాడుబడిన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న అమ్మమ్మ దగ్గరికి స్టెఫీ వెళుతుంది. 

స్కై వ్యూ రెస్టారెంట్ లో జరిగిన ప్రమాదం నిజమేనని ఐరిస్ చెబుతుంది. ఆ ప్రమాదంలో చనిపోకుండా తాను కాపాడబడిన వాళ్లంతా కూడా ఆ తరువాత ఒక్కొక్కరుగా .. చిత్రమైన పరిస్థితులలో చనిపోతూ వచ్చారని అంటుంది. ఆ రోజున ఆ రెస్టారెంట్ కి వచ్చినవారి వారసులను కూడా మృత్యువు వెంటాడుతోందనే విషయం తన పరిశీలనలో తేలిందని చెబుతుంది. తాను ఇంతవరకూ బ్రతికి ఉండటమే గొప్ప విషయమనీ, ఇక ఇప్పుడు తన వంతు వచ్చిందని అంటుంది. 

'స్కై వ్యూ' రెస్టారెంట్ లో చనిపోయినవారి కుటుంబ సభ్యులను సైతం ఏదో శక్తి వెంటాడుతోందనీ, అయితే తమ కుటుంబ సభ్యులను ఆ శక్తి నుంచి ఎలా కాపాడుకోవాలనే విషయంపై తాను ఒక పుస్తకం రాశానని చెబుతుంది. ఆ పుస్తకంలో తాను రాసిన విషయాలకు తగినట్టుగా నడుచుకోమని హెచ్చరిస్తుంది. ఐరిస్ అనుభవంతో రాసిన ఆ పుస్తకంలో ఏముంటుంది? అది చదివిన స్టెఫీ తన కుటుంబ సభ్యులను కాపాడుకోగలుగుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: కొన్ని సంఘటనలు జరగబోతున్నట్టుగా కొంతమందికి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. అయితే వాళ్లు ఆ అయోమయంలో నుంచి తేరుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది. అలాంటి ఒక శక్తిని 'ఐరిస్' కలిగి ఉంటుంది. ఒక అతీంద్రియ శక్తి తనను .. తన కుటుంబాన్ని కూడా కబళిస్తుందని తెలుసుకున్నప్పుడు, తనవాళ్లను కాపాడుకోవడం కోసం  ఆమె ఎలాంటి ప్రయత్నం చేస్తుంది? అనే అంశం చుట్టూనే ఈ కథను అల్లుకోవడం జరిగింది. 

ఈ కథ .. ఐరిస్ అనే ఒక కీలకమైన పాత్రతో మొదలవుతుంది. అయితే ఆమె మనవరాలి వైపు నుంచి కథను నడిపించడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫస్టు సీన్ ను దర్శకుడు తెరపైకి తీసుకుని వస్తాడు. అదే సీన్ తో ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తాడు. ఏం జరుగుతుందనేది ప్రేక్షకులు గెస్ చేయలేరు. చూసి గుండెను గుప్పెట్లో పట్టుకోకుండా ఉండలేరు.  ఈ సీన్ ను కళ్లప్పగించి చూసేవారికంటే, కళ్లు మూసుకునేవారే ఎక్కువగా ఉంటారని చెప్పచ్చు.

మృత్యువు వెంటాడటం .. చిత్రమైన పరిస్థితులలో కబళించడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ ఆ రక్తపాతం .. ఆ దారుణం చూసి తట్టుకునేవారిది పెద్ద గుండేనని చెప్పాలి. హింస .. రక్తపాతం అనే పదాలు కూడా చాలా చిన్నవిగానే అనిపిస్తాయి. జుగుప్సా కరమైన ఆ సన్నివేశాలను సాధారణమైన ఆడియన్స్ చూడలేరనే చెప్పాలి. ఇక బీపీ .. గుండె జబ్బులు ఉన్నవారు చూడకపోవడమే మంచిది. 

పనితీరు: దర్శకుడి వైపు నుంచి చూస్తే, ఇది కథకి తగిన టైటిల్ .. టైటిల్ కి తగిన కథ అనే చెప్పాలి. దర్శకుడు డిజైన్ చేసుకున్న హింసాత్మక సన్నివేశాలను ఆడియన్స్ ఊహించలేరు. మరీ ఇంత ఘోరమా? అనుకోకుండా ఉండలేరు. కానీ ఈ సినిమా వేలకోట్ల వసూళ్లను రాబట్టడం గమనించవలసిన విషయం. ఆర్టిస్టులు అందరూ కూడా  తమ పాత్రలలో గొప్పగా చేశారు. సాంకేతిక నిపుణులు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. 

ముగింపు: మృత్యువు వెంటాడుతోంది .. ఎవరి తరువాత ఎవరిని అది టార్గెట్ చేస్తుంది? అనే ఒక  విషయం తెలిసినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కడా ఉండవు. కానీ రక్తంతో అభిషేకం చేసుకుంటున్నట్టుగా కనిపించే ఆ సన్నివేశాలను చూసి తట్టుకోవడం కష్టమే. 

Movie Details

Movie Name: Final Destination Bloodlines

Release Date: 2025-10-16

Cast: Kaitlyn Santa Juana,Teo Briones,Richard Harmon,Owen Patrick Joyner

Director: Zach Lipovsky

Producer: Craig Perry

Music: Tim Wynn

Banner: New Line Cinema

Review By: Peddinti

Final Destination Bloodlines Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews