సాధారణంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి థ్రిల్లర్ జోనర్ తో కూడిన కంటెంట్ ఎక్కువగా దిగుతూ ఉంటుంది. ఈ జోనర్ కి సంబంధించిన సిరీస్ లు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరిచేస్తూ ఉంటే, అప్పుడప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన తెలుగు సిరీస్ లు కామెడీ టచ్ తో ఆడియన్స్ ను అలరిస్తూ, తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలా రీసెంటుగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన తెలుగు సిరీస్ గా 'ఆనందలహరి' కనిపిస్తుంది.    

కథ: 'సఖినేటిపల్లి' సన్యాసి నాయుడు ఆ ఊరికి సర్పంచ్. ఆడపిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసిన ఆయన, సాధ్యమైనంత త్వరగా ఆనంద్ (అభిషేక్) పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు కారణం బీటెక్ లో బ్యాక్ లాగ్స్ పెట్టుకుని, బాధ్యత లేకుండా కొడుకు బలాదూర్ తిరుగుతుండటమే కారణం. ఆ ఊళ్లో ఫ్లెక్సీలు వేసుకునే రాజు (అమర్) ఆనంద్ కి జతగాడు. మొత్తానికి సన్యాసి నాయుడు ప్రయత్నాలు ఫలించి, వెస్ట్ గోదావరి అమ్మాయి లహరి (భ్రమరాంబిక)తో ఆనంద్ పెళ్లి జరుగుతుంది. 

లహరి తల్లి టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. లహరికి శ్రేయ అనే ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఆనంద్ - లహరి జంటతో కావాలనే సన్యాసి నాయుడు హైదరాబాదులో కాపురం పెట్టిస్తాడు. కొడుక్కి బాధ్యత తెలిసి రావాలనేది ఆయన ఉద్దేశం. ఆనంద్ తీరు ఒకటి రెండు రోజులలోనే లహరికి అర్థమైపోతుంది. ఆయనలో మార్పు రావాలనే ఉద్దేశంతో బెడ్ రూమ్ కి దూరం పెడుతుంది. దాంతో అతను తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. ఇద్దరి మధ్య ఈస్ట్ గోదావరి - వెస్ట్ గోదావరి ఫీలింగ్స్ కూడా వాళ్ల గొడవలకు ఆజ్యం పోస్తుంటాయి.   

 ప్రతిరోజూ గొడవలు పడుతూ .. ఎడమొఖం పెడ ముఖంగానే ఈ ఇద్దరూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తన వ్యసనాల కోసం ఇంట్లోని సామాను అతను ఆన్ లైన్ లో అమ్మేస్తూ ఉంటే, తన చదువుకి తగిన జాబ్ కోసం లహరి సెర్చ్ చేస్తూ ఉంటుంది. పల్లెటూరి ఇంగ్లిష్ పట్నంలో పనికిరాదనే విషయం ఆమెకి అర్థమవుతుంది. అతి కష్టం మీద ఒక జాబ్ సంపాదిస్తుంది. అయితే అక్కడ పనిచేస్తున్న రాహుల్ (కల్యాణ్) లహరిని లవ్ చేయడం మొదలుపెడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది మిగతా కథ. 

విశ్లేషణ: విలేజ్ నేపథ్యం .. ప్రాంతీయ అభిమానం .. ఆత్మాభిమానం .. గౌరవ మర్యాదల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు .. సీరియల్స్ వచ్చాయి. వెబ్ సిరీస్ లు కూడా వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక కథతో వచ్చిన సిరీస్ గా 'ఆనందలహరి' కనిపిస్తుంది. కొంతకాలంగా వస్తున్న టైటిల్స్ ను బట్టి చూసుకుంటే, అబ్బాయి పేరు ఆనంద్ .. అమ్మాయి పేరు లహరి అయ్యుంటుందని ఆడియన్స్ ముందుగానే గెస్ చేస్తారు. వాళ్ల గెస్ ఈ సిరీస్ విషయంలో కరెక్ట్ అయిందనే చెప్పాలి. 

పెళ్లి అంటేనే రెండు ప్రాంతాలు .. రెండు కుటుంబాలు .. రెండు వంశాలు .. రెండు మనసులు కలవడం. సహజంగానే ఆచార వ్యవహారాలలో తేడాలు ఉంటూ ఉంటాయి. ఆ తేడాలను హైలైట్ చేస్తూ, సరదాగా నవ్వించే ప్రయత్నం చేసిన కంటెంట్ ఇది. తమ బాధ్యత తీరిపోతుందనీ .. పిల్లలకి బాధ్యత తెలుస్తుందని పెళ్లిళ్లు చేయకూడదు. వాళ్లకి పరిపక్వత వచ్చిన తరువాతనే పెళ్లి చేయాలనే ఒక సందేశాన్ని వినోదంతో కలిపి అందించారు. 
            
గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ కథ కొత్తదేమీ కాదు .. ఇంతకుముందు రానిదేమీ కాదు. నిజానికి లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఫ్యామిలీ ఏమోషన్స్ ను పుష్కలంగా పిండుకోవడానికి అవకాశం ఉన్న కంటెంట్ ఇది. కానీ ఆశించిన స్థాయిలో అవుట్ పుట్ రాలేదని అనిపిస్తుంది. పాత్రలు చాలా ఉన్నాయి .. కానీ వాటిని సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. ఈ తరహా కంటెంట్ కి అవసరమైన కామెడీ కోసం సరైన కసరత్తు జరగలేదు. అందువలన కథ అక్కడక్కడే తిరుగుతూ ఓ మాదిరి మార్కులను మాత్రమే సంపాదించుకోగలుతుంది. 

పనితీరు: దర్శకుడు సాయి వానపల్లి ఈ సిరీస్ కి కథ .. కథనం .. సంభాషణలు సమకూర్చుకున్నాడు. కథలో గానీ .. స్క్రీన్ ప్లే పరంగా గాని .. సంభాషణల పరంగా గాని పెద్దగా మలుపులు కనిపించవు. అశోక ఫొటోగ్రఫీ మాత్రం బాగుంది. విలేజ్ నేపథ్యంలో లొకేషన్స్ అందంగా చూపించాడు. జోయ్ సాల్మన్ నేపథ్య సంగీతం .. హరీశ్ - మైఖేల్ ఎడిటింగ్ ఫరావాలేదు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన ఆర్టిస్టులు బాగానే చేశారు. 

ముగింపు: వినోదం .. సందేశం కలగలిసిన కథనే ఇది. అయితే ఈ కంటెంట్ తో నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ ను మాత్రం అందించలేకపోయారు. టైట్ గా లేని కంటెంట్ .. పకడ్బందీగా లేని స్క్రీన్ ప్లే కారణంగా ఈ సిరీస్ ఓ మాదిరిగా మాత్రమే అనిపిస్తుంది.