హారర్ కామెడీ జోనర్లో రూపొందిన తమిళ సినిమానే 'హౌస్ మేట్స్'. రాజవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దర్శన్ .. ఆర్ష .. కాళీ వెంకట్ .. వినోదిని విద్యానాథన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్నటి నుంచి తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: కార్తీక్ (దర్శన్) 'అనూ' (ఆర్ష) ప్రేమించుకుంటారు. కార్తీక్ కి తన అనే వాళ్లెవరూ ఉండరు. అతని కోసం తన పేరెంట్స్ ను ఎదిరించి ఆర్ష పెళ్లి చేసుకుంటుంది. ఆమె కోసం కార్తీక్ తాను దాచుకున్న డబ్బుతో ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ను కొంటాడు. ఇద్దరూ కలిసి కొత్త ఫ్లాట్ లోకి దిగిపోతారు. అయితే మొదటి రోజు నుంచే ఆ ఇంట్లో చిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది. దాంతో ఆ ఫ్లాట్ లో దెయ్యాలు ఉన్నాయనే ఒక నిర్ణయానికి అనూ వచ్చేస్తుంది.
ఆ విషయాన్ని గురించి ఆరా తీయడానికి 'అనూ' ప్రయత్నిస్తుంది. కానీ ఎవరూ కూడా ఆమెతో ఏమీ చెప్పరు. అదంతా ఆమె భ్రమ అంటూ లైట్ తీసుకుంటారు. కొంతకాలం క్రితం అదే బ్లాక్ కి చెందిన ఒక ఫ్యామిలీ, కారు ప్రమాదంలో చనిపోయినట్టుగా కూరగాయలమ్మే వ్యక్తి అనూతో చెబుతాడు. అప్పటి నుంచి ఆమెలో మరింత భయం మొదలవుతుంది. గోడలపై చిన్నపిల్లలు గీసినట్టుగా బొమ్మలు .. టీవీ దానంతట అది ఆన్ అవుతూ ఉండటం .. కుర్చీలు వాటంతట అవి జరిగిపోతూ ఉండటం చూసి ఆమె మరింత హడలెత్తిపోతుంది.
జరుగుతున్న సంఘటనల గురించి అనూ చెప్పినప్పటికీ, కార్తీక్ తేలికగా కొట్టి పారేస్తాడు. ఒక రోజున అతను ఇంట్లో ఉండగానే అలాంటి సంఘటనలు జరుగుతాయి. దాంతో అనూ భయపడటంలో అర్థం ఉందని భావిస్తాడు. తమతో పాటే ఆ ఇంట్లో అదృశ్య రూపంలో ఎవరో ఉంటున్నారనే విషయం అతనికి అర్థమవుతుంది. తమ ఫ్లాట్ లో అదృశ్య రూపంలో ఉంటున్నది రమేశ్ .. అతని భార్య విజ్జి .. పదేళ్ల కొడుకు మహి అనే విషయం తెలుసుకుంటాడు. రమేశ్ భార్యాబిడ్డల నేపథ్యం ఏమిటి? ఆ ఫ్యామిలీ కార్తీక్ కి ఎందుకు కనెక్ట్ అవుతుంది? అది తెలుసుకున్న కార్తీక్ ఏం చేస్తాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఒకప్పుడు దెయ్యాల కథలు చెప్పాలంటే ఊరు చివరన ఉండే పాడుబడిన బంగ్లాలు .. తోట బంగ్లాలు కావలసి వచ్చేది. కానీ ఆ తరువాత కాలంలో, పురాతనమైన కోటలు .. తోటలు పోయి, అందరూ తిరుగుతూ ఉండే అపార్టుమెంట్లు .. ఫ్లాట్ లలోకి దెయ్యాలు వచ్చేశాయి. నాలుగు గోడల మధ్యనే నడిచే దెయ్యాల కథలు మొదలయ్యాయి. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ తరహా సినిమాలలో భారీ లాభాలను అందుకున్నవి లేకపోలేదు.
అలా ఒక ఫ్లాట్ చుట్టూ తిరిగే కథతో వచ్చిన సినిమానే 'హౌస్ మేట్స్'. కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక జంట .. కొత్తగా ఒక ఫ్లాట్ లోకి రావడం .. అక్కడ భయంకరమైన సంఘటనలు జరగడం చూసి, ఇది రోటీన్ కథనే కదా, ఇందులో కొత్తదనం ఏవుంది? అని అనుకోవడం సహజం. ఆడియన్స్ అలా అనుకంటూ ఉన్న సమయంలోనే ఈ కథ కొత్త మలుపు తిరుగుతుంది. కామెడీని టచ్ చేస్తూ వెళ్లి, చివర్లో ఎమోషన్స్ తో మెప్పిస్తుంది.
కథ అపార్టుమెంటు పరిధిలో .. ఫ్లాట్ లోని నాలుగు గోడల మధ్యనే ఎక్కువగా జరుగుతుంది. కానీ ట్రీట్మెంట్ కారణంగా ఎక్కడా బోర్ అనిపించకుండా సాగుతుంది. అరడజను పాత్రల చుట్టూనే ఈ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. కథలో ఒక మెలిక ఉన్నప్పటికీ, చాలా తేలికగా .. అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇది థియేటర్స్ లో చూసే సినిమా కాదు గానీ, ఓటీటీకి మాత్రం బాగా వర్కౌట్ అయ్యే కంటెంట్ అని చెప్పచ్చు.
పనితీరు: సాధారణంగా దెయ్యాల సినిమాలకి వెళ్లే ప్రేక్షకులు, ఇది దెయ్యం సినిమా అనే విషయం తెలిసే వెళతారు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం, ఇది దెయ్యం సినిమానేనా .. కాదా? అనే ఒక సందేహం చాలాసేపటి వరకూ ఆడియన్స్ ను వెంటాడుతుంది. అయితే అప్పటివరకూ కూడా బోరుకొట్టకండా దర్శకుడు ఈ కథను నడిపిస్తాడు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో అలా కూర్చోబెడతాడు.
కథ - స్క్రీన్ ప్లే రెండూ కూడా ఎక్కడ ఎలాంటి అయోమయం లేకుండా ముందుకు సాగుతాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా నటించారు. సతీశ్ ఫొటోగ్రఫీ .. రాజేశ్ మురుగేశన్ నేపథ్య సంగీతం .. నిషార్ షరీఫ్ ఎడిటింగ్ ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి.
ముగింపు: ఇది చాలా సింపుల్ గా కనిపించే ఒక క్లిష్టమైన కథ. చెప్పడంలో ఏ మాత్రం తడబడినా ప్రేక్షకులను అయోమయంలో పడేస్తుంది. అలా కాకుండా చాలా నీట్ గా ఈ కథను చెబుతూ .. కామెడీ టచ్ ఇస్తూ వెళ్లి, ఎమోషన్స్ తో కదిలించిన విధానం ఆకట్టుకుంటుంది.
'హౌస్ మేట్స్'(జీ 5) మూవీ రివ్యూ!
House Mates Review
- తమిళంలో రూపొందిన 'హౌస్ మేట్స్'
- ఆగస్టులో థియేటర్స్ కి వచ్చిన సినిమా
- సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీ రిలీజ్
- నిన్నటి నుంచి తెలుగులో అందుబాటులోకి
- కామెడీ టచ్ తో ఆకట్టుకునే కంటెంట్
Movie Details
Movie Name: House Mates
Release Date: 2025-10-02
Cast: Darshan, Aarsha Chandini Baiju, Kaali Venkat, Vinodhini, R Parthiban
Director: Raja Vel
Music: Rajesh Murugesan
Banner: Playsmith Studios
Review By: Peddinti
Trailer