దసరా సినిమాల హడావుడి మొదలైంది. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద 'ఓజీ' హవా కొనసాగుతుండగానే ధనుష్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇడ్లీ కొట్టు' చిత్రం బుధవారం (అక్టోబర్ 1) న విడుదలైంది. అయితే ఎటువంటి ప్రచారం లేకుండా సింపుల్‌గా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: శివ కేశవులు (రాజ్ కిరణ్) సొంత ఊరిలో ఇడ్లీకొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తుంటాడు. ఊర్లో ఆయన ఇడ్లీ కొట్టు అంటే ఎంతో ఫేమస్. పక్క ఊర్ల నుండి కూడా శివ కేశవులు చేతితో చేసిన ఇడ్లీ తినడానికి వచ్చేవారు. శివ కేశవులు కొడుకు మురళి (ధనుష్) హోటల్ మేనేజ్‌మెంట్ చదువుకుంటాడు. తండ్రి నడుపుతున్న ఇడ్లీ కొట్టును ఇతర ఊర్లకు కూడా విస్తరించి ఫ్రాంఛైజీ వ్యాపారంగా మార్చేసి డబ్బు సంపాందించాలని ఆశపడతాడు.
కానీ తన చేతులతో చేయని ఇడ్లీలను ఇతర ఊర్లలో తన పేరుతో అమ్మడానికి ఇష్టపడడు శివ కేశవులు. దీంతో మురళి ఊరుని వదిలి వెళ్లిపోతాడు. బ్యాంకాక్‌లోనే ఓ ఫేమస్ హోటల్ బిజినెస్ వ్యాపార వేత్త (విష్ణు వర్ధన్) దగ్గర పనిచేస్తుంటాడు. ఆయన కూతరు మీరా (ఫాలిని పాండే) తోనే మురళి పెళ్లి ఫిక్సయిపోతుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగానే మురళి తండ్రి కేశవులు చనిపోతాడు. తండ్రి చివరి చూపు కోసం బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చిన మురళికి ఊరిలో కొన్ని అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి? నాన్నతో గడిపిన రోజులు గుర్తుకు వస్తాయి..
నాన్న చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్న మురళి ఏం చేశాడు? తిరిగి బ్యాంకాక్ వెళ్లాడా ? మీరాతో అతని పెళ్లి జరిగిందా? ఆకాశ్ (అరుణ్ విజయ్)తో మురళికి ఉన్న సంబంధమేమిటి? చిన్న నాటి స్నేహితురాలు కల్యాణితో మురళికి ఉన్న అనుబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: ధనుష్ తను పుట్టి పెరిగిన ఊరిలో ఉన్న ఓ ఇడ్లీ కొట్టు, అక్కడి మనుషులు ఆ ప్రేరణతోనే ఈ కథను రాసుకున్నాడు. ప్రతి ఒక్కరికి సొంత ఊరితో ఉండే అనుబంధం, అక్కడి జ్ఞాపకాలు, ఊరితో ఉన్న ఎమోషన్ ఇలా అన్ని ఈ కథలో మేళవించి ధనుష్ ఈ కథను తెరకెక్కించాడు. ఇదొక సాధారణ కథ. సినిమా ప్రారంభంలో అందరూ ఓ ఫీల్‌గుడ్ సినిమా చూస్తున్నమనే భావన కలుగుతుంది. అయితే ఇదే ఫీల్‌ను సినిమా ఆద్యంతం కొనసాగించలేకపోయాడు ధనుష్. ఓ మోస్తరుగా ఫస్టాఫ్ వరకు ఫర్వాలేదనిపించినా సెకండాఫ్ సాగతీత భావన కలుగుతుంది. ప్రతి సన్నివేశం ఎంతో భారంగా రొటిన్‌గా ఎటువంటి ఎమోషన్ లేకుండా కొనసాగుతుంది.
సినిమా మొదట్లో అందరూ తమ సొంత ఊరిలో సినిమా జరుగుతున్న ఫీల్‌ను తీసుకొచ్చినా ఆ తరువాత కథ ముందుకు సాగదు. ఇలాంటి కథలో ఉండాల్సిన అసలైన ఎమోషన్ మిస్ అవ్వడం వల్ల కథ పక్కదారి పట్టినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ధనుష్ ఊరిలో ఉన్నప్పుడు, అక్కడ ఆ ఊరితో ధనుష్‌కు ఉన్న అనుబంధం మరింత బలంగా చూపించాల్సింది. ప్రథమార్థం పర్వాలేదనిపించినా, ద్వితీయార్థంలో కథలో ఎటువంటి ఆసక్తి లేకుండా పోయింది. ఇడ్లీ కొట్టు, ఊరు, అనుబంధం ఉన్న ఈ కథలో ఇగో క్లాష్‌స్, యాక్షన్ ఏపిపోడ్స్ ఇలాంటి అంశాలు జోడించడం సినిమాకు మైనస్‌గా మారింది. ఇలాంటి కథను నిజాయితీగా పూర్తి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషన్స్ క్యారీ చేస్తూ తెరకెక్కించి ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేది.
నటీనటుల పనితీరు: మురళి పాత్రలో ధనుష్ లీనమై నటించాడు. కార్పోరేట్ ఎంప్లాయ్‌గా, పల్లెటూరి యువకుడిగా ఆయన నటన చాలా సహజంగా ఉంది. గ్రామీణ యువతిగా కల్యాణి పాత్రలో నిత్యమీనన్ బాగుంది. మీరాగా షాలిని పాండే ఫర్వాలేదు. ఆమె పాత్రలో పెద్దగా నటనకు స్కోప్ లేదు. విష్ణువర్ధన్‌గా సత్యరాజ్, ఆకాశ్ పాత్రలు ఆకట్టుకుంటాయి. పార్తీబన్, సముద్రఖని పాత్రలు కూడా బాగున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. కిరణ్ కౌశిక్ ఫోటోగ్రఫీ గురించి అందరూ మాట్లాడుకుంటారు.
ఫైనల్‌గా: ధనుష్ తన సొంత ఊరిలో చూసిన ఇడ్లీ కొట్టు ప్రేరణతో రాసుకున్న ఈ కథపై రచనా పరంగా మరింత శ్రద్ధ పెట్టి ఉంటే, ఎమోషన్స్ మెప్పించగలిగే స్థాయిలో ఉంటే 'ఇడ్లీ కొట్టు' కమ్మని ఇడ్లీలా ఉండేది. ఇక ఇప్పుడు ఈ 'ఇడ్లీ కొట్టు' ఓ మోస్తరు రుచితో ఉన్న ఇడ్లీలా..మిగిలిపోయింది.
'ఇడ్లీ కొట్టు' మూవీ రివ్యూ
Idli Kottu Review
- 'ఇడ్లీ కొట్టు' తో వచ్చిన ధనుష్
- కొత్తదనం లేని కథ
- ఆకట్టుకోని కథ, కథనాలు
- మిస్ అయిన ఎమోషన్స్
Movie Details
Movie Name: Idli Kottu
Release Date: 2025-10-01
Cast: Dhanush, Nithya Menen, Arun Vijay, Shalini Pandey, Sathyaraj, Rajkiran
Director: Dhanush
Music: G.V. Prakash Kumar
Banner: Dawn Pictures ,Wunderbar Films Pvt. Ltd.
Review By: Madhu
Trailer