ఎడ్యుకేషన్ కి సంబంధించిన నేపథ్యంలో గతంలో కొన్ని వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తరహాలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో సిరీస్ గా '13th'ను గురించి చెప్పుకోవచ్చు. 'Some Lessons Aren't Taught in Classrooms' అనేది ఉపశీర్షిక. గగన్ దేవ్ రియర్ - పరేశ్ పహుజా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ రోజు నుంచే 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. నిశిల్ సేథ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 5 ఎపిసోడ్స్ లో హిందీతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులో ఉంది. 

కథ: జితేశ్ (పరేశ్ పహుజా) ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. ఆ సంస్థ తీసుకునే కీలకమైన నిర్ణయాలలో అతని పాత్ర కూడా ఉంటుంది. అయితే కార్పొరేట్ సంస్థలు తీసుకునే బిజినెస్ సంబంధమైన కొన్ని నిర్ణయాలు సామాన్య ప్రజలను దోచుకునేలా ఉన్నాయని భావించిన ఆయన, ఒక మీటింగులో తన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. తనకి సంతృప్తిని ఇచ్చే పని చేయాలనే ఉద్దేశంతో ఆ జాబ్ మానేస్తాడు. 

ఆ తరువాత ఒక స్టార్టప్ సంస్థను మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. తాను చేసే పని తనకి మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉండాలని భావిస్తాడు. అందుకోసం అతను ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫీల్డ్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వస్తాడు. ఈ విషయంలో అతను 13thలో తనకి IIT కోచింగ్ ఇచ్చిన లెక్చరర్ మోహిత్ త్యాగి ( గగన్ దేవ్ రియర్)ని కలుసుకుంటాడు. ఇప్పటికీ మోహిత్ త్యాగి 'జైపూర్'లోనే లెక్చరర్ గానే పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఆశయం .. అంకితభావం గురించి తెలిసిన రితేశ్, నేరుగా వెళ్లి ఆయనను కలుస్తాడు. 

చదువుకునే రోజులలో  రితేశ్ పట్టుదలను దగ్గరి నుంచి చూసిన కారణంగా, అతనిని మోహిత్ సాదరంగా ఆహ్వానిస్తాడు. తాను వచ్చినా పనిని గురించి .. తన ఉద్దేశాన్ని గురించి ఆయనకి రితేశ్ వివరంగా చెబుతాడు.  నాణ్యమైన విద్యను సాధ్యమైనంత ఎక్కువమందికి అందించాలనే ఉద్దేశంతో, స్టార్టప్ కంపెనీ కోసం .. అందుకు అవసరమైన ఫండింగ్ కోసం అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఆ తరువాత వాళ్లకి ఎదురయ్యే అనుభవాలే ప్రధానమైన కథాంశం. 

విశ్లేషణ: జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదగాలనే కోరుకుంటారు. అయితే ఆశతో పనిచేసేవాళ్లు కొందరతే, ఆశయంతో పనిచేసేవాళ్లు కొందరు ఉంటారు. అలాగే అంకితభావంతో పనిచేసేవాళ్లలోను రెండు రకాల వారు కనిపిస్తారు. కొందరు ఒక సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తే, మరికొందరు తాము నమ్మిందే సిద్ధాంతమని భావిస్తూ ఉంటారు. ఆశయం ఒకటే అయినా వాళ్లు అనుసరించాలని అనుకున్న మార్గం వేరు. 

ఒకరు హార్డ్ వర్క్ ను నమ్మితే, మరొకరు స్మార్ట్ వర్క్ ప్రధానమని భావిస్తారు. అలా పరస్పరం  విరుద్ధమైన స్వభావాలను కలిగిన రెండు ప్రధానమైన పాత్రల చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ ఇది. ఒక లెక్చరర్ కీ .. 13thకి చెందిన ఒక స్టూడెంట్ కి సంబంధించిన ఈ కథలో, అనూహ్యమైన మలుపులు గానీ .. ఆకట్టుకునే ఎమోషన్స్ గాని లేవు. గతాన్ని .. వర్తమానాన్ని పక్కపక్కనే చెబుతూ వెళ్లడం వలన, ఎడిఎ కాలానికి సంబంధించినది అంది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.

ప్రధానమైన  కథలో నుంచి అప్పుడప్పుడు బయటకివచ్చి వినోద ప్రధానమైన అంశాల దిశగా వెళ్లడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని చెప్పాలి. ఈ కారణంగా కథ సీరియస్ గా  సాగుతూ బోర్ కొడుతుంది. ఆశయం .. అంకితభావం .. సందేశం అనేవి కథల్లో ఉండటం స్ఫూర్తి దాయకమే. అయితే వాటి చుట్టూ వినోద ప్రధానమైన అంశాలు ఉన్నప్పుడే ప్రేక్షకులను అసలు పాయింట్ పట్టుకుంటుంది. 

పనితీరు: అనుభవం కలిగిన ఒక లెక్చరర్ .. అంకితభావం కలిగిన ఒక స్టూడెంట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఈ ఇద్దరి వైపు నుంచి దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు కరెక్టుగానే ఉంది. కాకపోతే ఆ సందేశాన్ని ఎక్కిచడానికి అవసరమైన వినోదాన్ని అందుబాటులో ఉంచలేదు. ఈ కారణంగానే ఈ కథ సాదాసీదాగా సాగిపోతుంది. 

ఆర్టిస్టులంతా చాలా సహజంగా తమ పాత్రలను పండించారు. గిరిజా ఓక్ కనిపించింది కాసేపే అయినా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతీక్ కెమెరా పనితనం .. శృతి సుకుమారన్ ఎడిటింగ్ .. గోయెల్ సాబ్ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే అనిపిస్తాయి.             
ముగింపు: ప్రధానమైన కథ ఆలోచింపజేసేదే అయినా, ఆ కథను ఉల్లాసంగా ఫాలో కావడానికి అవసరమైన వినోదపరమైన పాళ్లను పట్టించుకోకపోవడం వలన ఈ సిరీస్ కాస్త అసహనాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.