పహాద్ ఫాజిల్ కథానాయకుడిగా రూపొందిన మలయాళ సినిమానే 'ఓడుమ్ కుతిర చాదుమ్ కుతిర'. అల్తాఫ్ సలీం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శన్ .. రేవతి పిళ్లై .. ధ్యాన్ శ్రీనివాసన్ .. లాల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 26వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: అభి (పహాద్ ఫాజిల్) తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉంటాడు. స్నేహితుడు అనురాగ్ తో కలిసి తనకి తెలిసిన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో అనుకోకుండా అతనికి నిధి (కల్యాణి ప్రియదర్శన్) తారసపడుతుంది. అప్పటికి ఆమె 'రిషి' అనే యువకుడి ప్రేమలో పడుతుంది. అయితే అతను ఆమెను నిజంగానే ప్రేమించడం లేదనే విషయం అభి కారణంగానే బయటపడుతుంది. అప్పటి నుంచి ఆమెకి అభితో పరిచయం ఏర్పడుతుంది. 

అభి - నిధి ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడతారు. అభి ఒక ఇంటివాడు అవుతాడనే ఉద్దేశంతో అతని తండ్రి ఎంకరేజ్ చేస్తాడు. ఈ పెళ్లికి నిధి పేరెంట్స్ కూడా అంగీకరిస్తారు. ఎంగేజ్మెంట్ రోజున అభి గుర్రంపై ఊరేగుతూ ఉండగా అది బెదిరిపోతుంది. గుర్రంపై నుంచి పడిపోయిన అభి, తలకి బలమైన గాయం కావడం వలన 'కోమా'లోకి వెళతాడు. అతను కోమాలో నుంచి ఎప్పుడు బయటపడతాడనేది చెప్పలేమని డాక్టర్లు అంటారు. 

కొంత కాలం పాటు అభి కోసం నిధి ఎదురుచూస్తుంది. అతని పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో, మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. తాను తీసుకున్న నిర్ణయాన్ని అభి తండ్రితో చెబుతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ ను హాస్పిటల్లో అభి దగ్గర వదిలేస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? అనేదే ఈ సినిమా. 

విశ్లేషణ
: జీవితంలో అన్నిటికంటే భయంకరమైనది .. బాధాకరమైనది ఏదైనా ఉందంటే అది ఒంటరితనమే. అందువల్లనే ప్రతి ఒక్కరూ ఒక తోడు వెతుక్కుంటూ ఉంటారు. మన కోసం ఒకరు ఉన్నారు .. మనలను పట్టించుకోవడానికి, పలకరించడానికి ఒకరు ఉన్నారనే ఆశనే జీవించేలా చేస్తుంది. ఆలాంటివారెవరూ లేరనే ఆలోచన నిరాశను కలిగిస్తుంది. బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తుంది. రెండు అక్షరాల 'ప్రేమ' అనేది అలాంటివారికి ఊపిరి పోస్తుంది. 

అలాంటి ఒక నేపథ్యాన్ని తీసుకుని అల్లుకున్న కథ ఇది. మొదటిసారి .. మొదటి వ్యక్తిపై పుట్టే ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రేమను మరిచిపోవడం దాదాపుగా జరగదు. ఆకర్షణ అనేది ఒకరిపై నుంచి మరొకరి పైకి వెళుతూ ఉంటుంది. కానీ ప్రేమ అనేది అవతల వ్యక్తి అందుబాటులో లేకపోతే నిరీక్షించేలా చేస్తుందే తప్ప, మరిచిపోనీయదు. అలా ప్రేమ - ఆకర్షణ మధ్య గల తేడాను దర్శకుడు ఈ కథలో ఆవిష్కరించాడు. 

అయితే ఎంతో ఆసక్తికరమైన ఈ రెండు అంశాలను ఆవిష్కరించడానికి దర్శకుడు సరైన స్క్రిప్ట్ ను సెట్ చేసుకోలేదని అనిపిస్తుంది. విషయాన్ని కామెడీ వైపు నుంచి చెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం ఎంతమాత్రం ఫలించలేదు.  కామెడీ అంటే నాన్ స్టాప్ గా మాట్లాడటం కాదు .. నాన్ స్టాప్ గా నవ్వుకోవడం కదా అని మనకి అనిపిస్తుంది. సాదాసీదా సన్నివేశాలతో .. అతిగా అనిపించే సంభాషణలతో కాస్త విసుగు తెప్పించే కంటెంట్ ఇది. 

పనితీరు: అల్తాఫ్ సలీమ్ తయారు చేసుకున్న కథనే ఇది. ప్రధానమైన పాత్రలు .. వాటి మధ్య లవ్ ఉండేలా చూసుకున్నాడు గానీ, ఆ లవ్ లోని ఎమోషన్స్ ను .. ఫీల్ ను పట్టించుకోకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. పాత్రలలో విషయం లేకపోవడం వలన, సహజంగానే వారి నటన కూడా కనెక్ట్ కాదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వర్క్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే.     

ముగింపు: ఫహాద్ ఫాజిల్ .. కల్యాణి ప్రియదర్శన్ .. లాల్ వంటి ఆర్టిస్టులను చూసి, ఈ సినిమాలో బలమైన విషయమేదో ఉందని ఆడియన్స్ అనుకోవడం సహజం. కానీ సాదాసీదా సన్నివేశాలతో .. సారం లేని సంభాషణలతో నడిచే ఈ కథ మన ఓపికను పరీక్షిస్తుంది అంతే.