'పోలీస్ పోలీస్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

  • తమిళ సిరీస్ గా 'పోలీస్ పోలీస్'
  • అందుబాటులోకి 4 ఎపిసోడ్స్ 
  • కీలకమైన పాత్రలో సుజిత 
  • పోలీస్ డ్రామా నేపథ్యంలో సాగే కథ

'పోలీస్ పోలీస్' ఓ తమిళ వెబ్ సిరీస్. టైటిల్ ను బట్టే ఈ కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. థాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ కి 'కోన్' దర్శకత్వం వహించాడు. యాక్షన్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్, 4 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: మదురై పోలీస్ స్టేషన్ లో రాజా ఎస్.ఐ.గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఎస్.పి.గా ఆర్తన (సుజిత) ఉంటుంది. ఈ ఇద్దరూ అక్కాతమ్ముళ్లు.  మొదటి నుంచి కూడా రాజాకి ఆవేశం .. దూకుడు ఎక్కువ. ఫలితంగా డిపార్టుమెంటు నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్తన ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆవేశాన్ని.. తొందరపాటును తగ్గించుకోమని రాజాకి చెబుతూ ఉంటుంది. అయితే రాజా మాత్రం తనదైన దారిలో ముందుకు వెళుతూనే ఉంటాడు. 

అదే పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న 'వావర్', రాజాపై పోటీగా ఉంటాడు. రాజాను క్రాస్ చేసే వెళ్లే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజా కోపం వావర్ కి మేలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం ఆర్తన దృష్టికి కూడా వస్తుంది. రాజాను హెచ్చరించడం కోసం అతని భార్యాపిల్లలను గుర్తుచేస్తూ ఉంటుంది. అయినా అతను తన తీరు మాత్రం మార్చుకోడు. 

 ఇక అదే ఊళ్లో మురళి అనే యువకుడు తన బామ్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతని బామ్మ శివగామి, ఒక గుడి దగ్గర పూలకొట్టు నడుపుతూ ఉంటుంది. ఎస్.ఐ. కావాలనుకున్న మురళి, కొన్ని కారణాల వలన జైలుకు వెళ్లొస్తాడు. అందువలన అతనికి ఎక్కడా ఏ పనీ దొరక్కుండా పోతుంది. అలాంటి పరిస్థితులలోనే ఒక లాయర్ తో అతనికి పరిచయమవుతుంది. పోలీస్ ఆఫీసర్ రాజా నేపథ్యం ఏమిటి? మురళి ఎందుకు జైలుకు వెళ్లొచ్చాడు? లాయర్ తో అతని పరిచయం ఎంతవరకూ వెళుతుంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: పోలీస్ కథలను రూపొందించడంలో తమిళ దర్శకులు మంచి నైపుణ్యాన్ని చూపుతూ ఉంటారు. అందువలన అటు వైపు నుంచి వచ్చిన ఈ సిరీస్ పట్ల సహజంగానే ఆసక్తిని చూపడం జరుగుతూ ఉంటుంది. పోలీస్ డిపార్టుమెంటులో రకరకాల స్వభావాలు గల అధికారులు తారసపడుతూ ఉంటారు. అలాంటి స్వభావాలు కలిగిన వాళ్లందరూ ఒకేచోట కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందనేది ఆవిష్కరించిన కథగా 'పోలీస్ పోలీస్' కనిపిస్తుంది.

ఒక పోలీస్ ఆఫీసర్ .. దొంగగా ముద్రపడిన ఒక యువకుడు .. జూనియర్ లాయర్ గా పనిచేసే ఒక యువతి పాత్రను హైలైట్ చేస్తూ వెళ్లారు. పాత్రలను డిజైన్ చేసిన విధానం .. సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరిస్తున్న తీరు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇంతవరకూ కథలో ప్రధానమైన సమస్య ఏమిటనేది తెరపైకి రాలేదు. అప్పుడు గానీ ఈ కథ ఎటువైపు వెళ్లనుందనేది అర్థంకాదు.

అయితే ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే ఒక అంశం మాత్రం కనిపిస్తోంది. పవర్ఫుల్ గా కనిపించే పోలీస్ ఆఫీసర్ కీ .. జూనియర్ లాయర్ గా పని చేస్తున్న యువతికి, దొంగగా ముద్రపడిన యువకుడి పాత్ర దగ్గరవుతూ ఉంటుంది. ఈ మూడు పాత్రలు కలిసి మున్ముందు చేయనున్న పనులు ఏమిటనే ఒక కుతూహలాన్ని ఈ సిరీస్ రేకెత్తించగలిగింది.

పనితీరు: ఈ సిరీస్ నుంచి ప్రస్తుతం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. ఇంతవరకూ కూడా దర్శకుడు ఈ కథను నిదానంగానే చెబుతూ వచ్చాడు. ప్రధానమైన పాత్రల పరిధిని పెంచుతూ వచ్చాడు. రానున్న ఎపిసోడ్స్ లో కథ ఎలాంటి మలుపులు తీసుకోనుందనేది ఆసక్తికరమే.  

ఇంతవరకూ అయితే ఆర్టిస్టుల నటన పాత్ర పరిధిలో సాగింది. సౌందర రాజన్ ఫొటోగ్రఫీ .. జేమ్స్ విక్టర్ నేపథ్య సంగీతం .. అచ్యుతన్ - కార్తీక్ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. 

ముగింపు: ఒక పోలీస్ .. ఒక జూనియర్ లాయర్ .. జైలుకు వెళ్లొచ్చిన ఒక యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఫరవాలేదనిపించేలా ఉన్నాయి. మిగతా ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేది చూడాలి మరి.

Movie Details

Movie Name: Police Police

Release Date: 2025-09-19

Cast: Mirchi Senthil,Jayaseelan,Sujitha Dhanush

Director: Koan

Producer: Malarvizhithai Selven

Music: Jemes Victor

Banner: Thai Creations

Review By: Peddinti

Police Police Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews