మలయాళంలో రూపొందిన సినిమా 'లైట్స్ కెమెరా యాక్షన్'. అనంత్ జయచంద్రన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'జీ 5' లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ .. మరాఠీ .. బెంగాలీ భాషలలో అందుబాటులోకి వచ్చింది.ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: సుందర్ ఒక మీడియా సంస్థలో రచయితగా పనిచేస్తూ ఉంటాడు. ఊహ తెలియడానికి ముందే అతని తల్లి చనిపోతుంది. సుందర్ భవిష్యత్తును గురించి ఎంత మాత్రం ఆలోచన చేయకుండా అతని తండ్రి కుమార్ ఇల్లొదిలి వెళ్లిపోతాడు. అలా పాతికేళ్లు కాలగర్భంలో కలిసిపోతాయి. అప్పటి నుంచి సుందర్ తన అమ్మమ్మతో కలిసి ఆ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. మనవడి భవిష్యత్తు కోసం, తన పుట్టింటివారి వైపు నుంచి రావలసిన ఆస్తి కోసం ఆమె పోరాడుతూ ఉంటుంది.

తన తండ్రి బ్రతికే ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉండొచ్చు? అనే ఒక సందేహం అతని బుర్రను తొలిచేస్తూ ఉంటుంది. ఒకసారి ఒక పని మీద అమ్మమ్మ గారి ఊరుకు వెళ్లిన సుందర్ కి ఒక వీడియో టేప్ దొరుకుతుంది. తన తండ్రి సినిమా డైరెక్టర్ అనీ, బీ గ్రేడ్ సినిమాల దర్శకుడి ముద్ర అతనిపై ఉండేదనే విషయం సుందరానికి అర్థమవుతుంది. తనకి దొరికిన సినిమాలో నాన్సీ నటించడం చూసిన సుందరం, ఆమెను కలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

తన తండ్రి గురించి తనకి తెలిసిన విషయాలను స్నేహితుడు బాలుతో పంచుకుంటాడు సుందర్.
ఇద్దరూ కలిసి నాన్సీ అడ్రెస్ కోసం గాలించడం మొదలుపెడతారు. అతి కష్టం మీద ఆమె అడ్రెస్ కనుక్కుని అక్కడికి వెళతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? 
నాన్సీ గురించి ఎలాంటి నిజం తెలుస్తుంది? సుందర్ తండ్రి గురించిన సమాచారం తెలుస్తుందా? అనేది కథ. 

విశ్లేషణ: సాధారణంగా మలయాళ సినిమాలు కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. కానీ ట్రీట్మెంట్ తో ఆ కథను ఆవిష్కరించడం ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న కంటెంట్ .. తక్కువ బడ్జెట్ .. పరిమితంగా అనిపించే ఆర్టిస్టుల సంఖ్యతో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుందేమో అని ఈ కథను ఫాలో అయినవారికి నిరాశ తప్పదనే చెప్పాలి. 

సాధారణంగా చాలా కథల్లో ఎక్కడో ఒక చోట ఒక ఆసక్తికరమైన మలుపు ఉంటుంది. ఆ మలుపు వరకూ ప్రేక్షకులు జారిపోకుండా తీసుకుని వెళ్లవలసి ఉంటుంది. అందుకోసం బలమైన స్క్రీన్ ప్లేను ఆశ్రయిస్తూ వెళుతూ ఉంటారు. ఇక తాము అనుకున్న మలుపు వచ్చేవరకూ, కథలో పాత్రలు కాలక్షేపం చేస్తూ ఉంటాయి. ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తూ ఉంటాయి. ఈ రెండో కేటగిరికి చెందిన సినిమా ఇది.

ఈ కథలో లవ్ .. రొమాన్స్ .. కామెడీ వంటి అంశాలు ఎంతమాత్రం కనిపించవు. దాంతో సస్పెన్స్ .. ఎమోషన్స్ గట్రా ఏమైనా ఉన్నాయేమో అనే ఒక ఆలోచన ప్రేక్షకులకు కలుగుతుంది. అలాంటివి కూడా ఉండకపోవచ్చనే అనిపిస్తూ ఉంటుంది. అయినా ఏదో ఓ మూల ఒక ఆశ మిణుకు మిణుకుమంటూ ఉంటుంది. కానీ అది కూడా ఆవిరైపోతుంది. ఒక సింపుల్ లైన్ తీసుకుని అంతకంటే సింపుల్ గా చెప్పిన కథ ఇది. 

పనితీరు: నిదానంగా సాగే కథ .. నీరసంగా నడిచే స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను రూపొందించారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం . ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక నటీనటుల నటన గురించి చెప్పుకునే స్థాయిలో కథ గానీ .. పాత్రలు గాని  లేవు.

ముగింపు:  కథ ఏదైనా ఆ సినిమా ప్రధానమైన ప్రయోజనం వినోదాన్ని అందించడమే. ప్రధానమైన కథాంశం చుట్టూ వినోదపరమైన అంశాలను మేళవించినప్పుడే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాంటి అంశాలు .. లక్షణాలు లేని సినిమా నిరాశ పరుస్తుంది.