'మహావతార్ నరసింహ' ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • 40 కోట్లతో నిర్మితమైన సినిమా 
  • 300 కోట్లకు పైగా వసూళ్లు 
  • ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్
  • కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసిన టీమ్

సాధారణంగా ఏదైనా ఒక యానిమేషన్ సినిమా విడుదలైతే, అది పిల్లలు మాత్రమే చూసే సినిమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక అభిప్రాయాన్ని మార్చేసిన సినిమాగా 'మహావతార్ నరసింహ' గురించి చెప్పుకోవచ్చు. హోంబలే ఫిలిమ్స్ వారు సమర్పించిన  ఈ సినిమా, జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా, ఆ తరువాత తన జోరు చూపించింది. 40 కోట్లతో నిర్మితమై 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

కథ: కశ్యప మహర్షి .. 'దితి' దంపతులు అసురసంధ్య వేళలో కలుసుకోవడం వలన, హిరణ్యాక్షుడు - హిరణ్య కశిపులు అసురులుగా జన్మిస్తారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా లోక కంటకులుగా మారతారు. వారి కారణంగా సాధుజనుల మొదలు దేవతలవరకూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే  హిరణ్యాక్షుడు భూమిని పాతాళ లోకానికి తీసుకుని వెళతాడు. దాంతో భూదేవిని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు వరాహావతారాన్ని ధరిస్తాడు. పాతాళలోకం నుంచి భూమిని పైకి తీసుకువస్తూ అందుకు అడ్డుపడిన హిరాణ్యాక్షుడిని సంహరిస్తాడు.  

సోదరుడి మరణం హిరణ్య కశిపుడిని కలిచివేస్తుంది. తన సోదరుడి మరణానికి కారకుడైన విష్ణుమూర్తిని సంహరించాలని నిర్ణయించుకుంటాడు. బ్రహ్మ దేవుడి గురించి హిరణ్య కశిపుడు కఠోర తపస్సు చేస్తాడు. తనకి మానవుల వలనగానీ .. మృగాల వలనగానీ .. పగలు - రాత్రి, ఇంటా బయటా ..నింగి - నేలపై ..  ఎలాంటి ఆయుధాల వలన మరణం సంభవించకుండా ఉండేలా వరాన్ని ప్రసాదించమని కోరతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు.

హిరణ్య కశిపుడు తన రాజ్యంలో ఎక్కడా హరి నామస్మరణ జరగకుండా శాసనాలు చేస్తాడు. అయితే   అతని ద్వారా లీలావతికి జన్మించిన ప్రహ్లాదుడు, హరి నామస్మరణ చేయకుండా ఉండలేని స్థితికి చేరుకుంటాడు. తాను తల్లి గర్భంలో ఉండగా, నారద మహర్షి చేసిన హరి కథామృతమే అందుకు కారణం. ఎంతగా హెచ్చరించినా ప్రహ్లాదుడు హరి నామ స్మరణ మానకపోవడంతో, అతనిని అంతం చేయాలని హిరణ్యకశిపుడు తన అనుచరులను ఆదేశించడంతో ఈ కథ పాకాన పడుతుంది. 

విశ్లేషణ: శ్రీమహా విష్ణువు ధరించిన దశావతారాలలో ప్రతి అవతారం వెనుక లోక కల్యాణమే పరమార్థంగా కనిపిస్తుంది.అలాగే ప్రతి అవతారం ధరించడానికి ముందు స్వామి ఇంద్రాది దేవతలతో కలిసి ఒక వ్యూహ రచన చేయడం కనిపిస్తుంది. కానీ అలాంటి ఒక వ్యూహ రచన చేయకుండా, తన భక్తుడిని రక్షించడం కోసం అప్పటికప్పుడు స్వామివారు ధరించిన అవతారమే నృసింహ అవతారం. ఒక భక్తుడి కోసం ఒక అవతారాన్నే ధరించవలసి రావడం అనేది ఇక్కడ ప్రత్యేకం. 

నిజానికి ఇది చాలా విసృతమైన పరిధిని కలిగిన కథాంశం. కానీ దానిని ఒక సినిమాకి తగిన విధంగా మలిచి, యానిమేషన్ ద్వారా బహుళ భాషలలో అందుబాటులోకి తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నం అభినందనీయమేనని చెప్పాలి. పురాణ సంబంధమైన అంశాలకు ప్రాధాన్యతను ఇస్తూనే, ఈ తరం ప్రేక్షకులకు అర్ధమయ్యే సరళమైన మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది. అలాగే పురాణ సంబంధమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకుని వెళ్లవలసి ఉంటుంది. ఈ విషయంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. 

 అటు దేవలోకం .. ఇటు అసురుల రాజ్యం .. ప్రహ్లదుడి బాల్యం .. ఒకదాని తరువాత ఒకటిగా అతనికి శిక్షలను అమలుపరిచే విధానం తాలూకు దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించారు. హిరణ్యకశిపుడి అంతఃపురం .. ఆయన సభా భవనాన్ని డిజైన్ చేసిన విధానం గొప్పగా అనిపిస్తుంది.  హిరాణ్యాక్షుడు .. వరాహస్వామి పోరాటానికి సంబంధించిన సన్నివేశం, అలాగే హిరణ్య కశిపుడు - నృసింహ స్వామికి సంబంధించిన పోరాట దృశ్యాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పాలి. చివరి 24 నిమిషాలు మరింత కీలకంగా నిలుస్తాయి. 

పనితీరు: ఈ సినిమా యానిమేషన్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ మెచ్చుకోకుండా ఉండలేం. అందరూ కూడా పురాణ సంబంధమైన అంశాలపై పూర్తి అవగాహనతో పని చేయడం కనిపిస్తుంది. ఒక పురాణ సంబంధమైన విషయానికి యానిమేషన్ లో ఎలాంటి ఒక దృశ్య రూపాన్ని ఇవ్వాలనే విషయంపై జరిగిన కసరత్తుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తప్పకుండా ఈ దృశ్యాలు పిల్లలను మరో లోకంలోకి తీసుకుని వెళతాయి .. వారి మనసులను మరింత బలంగా హత్తుకు పోతాయి.

యానిమేషన్ లో ఆయా పాత్రలను వారి స్వభావానికి తగినట్టుగా డిజైన్ చేయడం వేరు. ఆయా సందర్భాలకి తగిన ఎక్స్ ప్రెషన్స్ ను తీసుకుని రావడం వేరు. ఈ విషయంలో ఈ కంటెంట్ పూర్తి మార్కులను కొట్టేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో నృసింహస్వామి శాంతిస్తూ ఆప్యాయంగా ప్రహ్లాదుడిని అక్కున చేర్చుకునే దృశ్యం ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుంది. 

ముగింపు
: ఈ మధ్య కాలంలో పురాణాల వైపు నుంచి ఒక పెర్ఫెక్ట్ కంటెంట్ తో .. పెర్ఫెక్ట్ అవుట్ పుట్ తో వచ్చిన యానిమేషన్ మూవీగా 'మహావతార్ నరసింహ' కనిపిస్తుంది. పిల్లలతో పాటు మిగతా వయసుల వారిని సైతం ఈ సినిమా ఇంతగా ఆకట్టుకోవడానికి కారణం ఏమిటనేది, ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది.

Movie Details

Movie Name: Mahavatar Narasimha

Release Date: 2025-09-19

Cast: Adihya Raj Sharma, Haripriya Matta, Saket Jaiswal,Priyanka Bhandari

Director: Aswin Kumar

Producer: Shilpa Dhawan- Kushal Desai

Music: Sam C S

Banner: Kleem Productons

Review By: Peddinti

Mahavatar Narasimha Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews