ఇటీవల వచ్చిన 'లిటిల్‌హార్ట్స్' చిత్ర విజయంతో నూతన తారలతో రూపొందిన చిత్రాలకు మంచి ఉత్సాహాం వచ్చింది. ఆ కోవలోనే ఈ వారం థియేటర్లోకి వచ్చిన చిత్రం 'బ్యూటీ'. అంకిత్ కొయ్య హీరోగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి సంస్థ నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకుంది. ఇక థియేటర్లోకి వచ్చిన 'బ్యూటీ' ఆకట్టుకుందా? ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా? లేదా రివ్యూలో తెలుసుకుందాం
కథ: నారాయణ (నరేష్) ఓ మిడిల్‌క్లాస్ తండ్రి. వైజాగ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. ఆయన కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ఎంతో ప్రాణం. కూతురు అడిగింది కాదనుకుంటా అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. కూతురు ఆనందంగా ఉంటే మురిసిపోతుంటాడు. పుట్టినరోజున స్కూటర్ కావాలని మారం చేసిన కూతురుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించపోయినా స్కూటర్ కొనిస్తాడు నారాయణ.
ఇక ఇంటర్మిడియట్ చదవే నీలఖికి, పెట్ ట్రైనర్ (అంకిత్ కొయ్య)తో మొదలైన గొడవ కాస్త ప్రేమగా మారుతుంది. ఓ రోజు అలేఖ్య.. అర్జున్‌తో వీడియో కాల్లో అసభ్యకరంగా మాట్లాడటం ఆమె తల్లి (వాసుకీ) చూస్తుంది. దీంతో అలేఖ్య, అర్జున్‌తో కలిసి హైదరాబాద్‌కు పారిపోతుంది. ఇక తండ్రి నారాయణ ఈ ఇద్దర్ని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తాడు. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? హైదరాబాద్‌లో నారాయణకు ఎదురైన పరిస్థితులేమిటి? అలేఖ్య ఏమైంది? ఈ ప్రేమజంటకు అనుకోకుండా కలిసిన ఓ క్రైమ్ గ్యాంగ్‌తో ఉన్న సంబంధమేమిటి ? ఆ తండ్రికి కూతురు దొరికిందా? ఈ ఇద్దరి ప్రేమ కథ ఏమైంది? అనేది మిగతా కథ
విశ్లేషణ: ఇది కథగా చెప్పుకుంటే పెద్దగా కొత్తదనం ఏమీ లేని కథే. నిత్యం మనకు సమాజంలో వినిపించే సంఘటనల ఆధారంగానే ఈ కథను, ఈ పాత్రలను తయారుచేసుకున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఇలాంటి కథాంశంతో చాలా సినిమాలే వచ్చాయి. కూతురును ప్రాణంగా ప్రేమించే తండ్రి. తండ్రి మాట కాదని ప్రేమించే కూతురు... ఇలాంటి కథలు ఇంతకు ముందు తెలుగుతెరపై చూశాం. ఇప్పుడు ఈ కథ కూడా అదే కోవకి చెందినదే. కాకపోతే తండ్రి, కూతురు ఎమోషన్‌ను ఆకట్టుకునేలా తీయగలిగితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. ఈ సినిమా విషయంలో కూడా అదే ధైర్యంతో దర్శకుడు ముందుకొచ్చాడని అర్థమవుతుంది.
ప్రధాన కథలో కొత్తదనం లేకపోవడం వల్ల, దర్శకుడు కథనం నడిపించడంలో తడబడ్డాడు. తెలిసిన కథతో, ఆసక్తిలేని సన్నివేశాలతో, కేవలం ఎమోషన్‌తో థియేటర్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలనుకోవడమే పెద్ద సాహసం. ఇలాంటి కథ సక్సెస్ కావాలంటే ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అయ్యేంత బలమైన సన్నివేశాలు కావాలి. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయాడు. సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి కనిపించదు. విరామ సన్నివేశానికి ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంది. ద్వితీయార్థాన్ని ఎలా నడపాలో తెలియక దర్శకుడు కన్ఫ్యూజ్ అయినట్లుగా కనిపించింది.
పోలీసులు వాళ్ల అన్వేషణ, హీరో హీరోయిన్ల ప్రయాణం ఇదంతా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో ప్రీక్లైమాక్స్ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ అంశమేమీ లేదు. పతాక సన్నివేశాలు అందరూ ఊహించినట్లే ఉండటం ఈ చిత్రానికి పెద్ద మైనస్‌గా నిలిచింది.
పనితీరు: అర్జున్ అంకిత్ రెండు డిఫరెండ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించాడు. నీలఖి నటన మెప్పిస్తుంది. నరేష్ మిడిల్ క్లాస్ తండ్రి పాత్రకు తన నటనతో ప్రాణం పోశాడు. వాసుకి నటన సహజంగా ఉంది. కథనం విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రమించి, మరింత భావోద్వేగాలు, లవ్ సన్నివేశాలు కొత్తగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఇంటర్వెల్, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌పై మాత్రం రచయిత, దర్శకుడు ఫోకస్ చేసినట్లుగా అనిపిస్తుంది. దర్శకుడు ఇంకాస్త శ్రమించి ఉంటే నిజాయితీగా ఆయన చేసిన ప్రయత్నం పరిపూర్ణమయ్యేది. విజయ్ బుల్గానీ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముగింపు: అందరికి తెలిసిన కథతోనే, ఊహకు అందే సన్నివేశాలతో రూపొందిన 'బ్యూటీ' ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది.
'బ్యూటీ' సినిమా రివ్యూ
Beauty Review
- ఊహకు అందే కథ, కథనాలు
- కొత్తదనం లేని సన్నివేశాలు
- బలమైన తండ్రి కూతుళ్ల ఎమోషన్
- ఆకట్టుకునే నరేష్ నటన
Movie Details
Movie Name: Beauty
Release Date: 2025-09-19
Cast: Ankith Koyya, Nilakhi Patra, vk naresh, vasuki
Director: J.S.S. Vardhan
Music: Vijay Bulganin
Banner: , Vanara Celluloid, Zee Studios
Review By: Madhu
Trailer