అభిలాష్ సుంకర హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమానే 'పగ పగ పగ'. సంగీత దర్శకుడు కోటి, ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా, చాలాకాలం క్రితమే థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా, చాలా ఆలస్యంగా 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: జగదీశ్ (కోటి) కృష్ణ (బెనర్జీ) ఇద్దరూ స్నేహితులు. సెటిల్ మెంట్లు చేస్తూ .. అవసరమైతే హత్యలు చేస్తూ ముందుకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలోనే జగదీశ్ చెప్పినట్టుగా ఒక యువకుడిని కృష్ణ హత్య చేస్తాడు. జైలుకు వెళుతున్న కృష్ణకి జగదీశ్ ధైర్యం చెబుతాడు. అతని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తాడు. అయితే ఆ తరువాత కృష్ణ కుటుంబాన్ని గాలికి వదిలేస్తాడు. కృష్ణ భార్య పిండి వంటలు చేసి అమ్ముతూ, కొడుకైన అభి ( అభిలాష్)ని పెద్ద చేస్తుంది. 

ఈ లోగా జగదీశ్ అనేక వ్యాపారాలు చేస్తూ బాగా ఎదుగుతాడు. కూతురు 'సిరి' అంటే అతనికి ప్రాణం. అభి చదువుతున్న కాలేజ్ లోనే ఆమె చదువుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అదే కాలేజ్ లో 'మున్నా' చదువుతూ ఉంటాడు. అతనంటే కాలేజ్ లో అందరికీ భయమే. రౌడీయిజంతో అతను బ్రతికేస్తూ ఉంటాడు. 'సిరి'ని చూసి మనసు పారేసుకున్న అతను, ఆమె ఆరాధిస్తున్న అభిపై ద్వేషం పెంచుకుంటాడు.   

జగదీశ్ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలను సూరిబాబు (భరణి శంకర్) చూసుకుంటూ ఉంటాడు. అభి - సిరి ప్రేమ వ్యవహారం సూరిబాబు ద్వారానే జగదీశ్ కి తెలుస్తుంది. తన కారణంగా జైలుకు వెళ్లిన కృష్ణ కొడుకే అభి అనే విషయం జగదీశ్ కి తెలుస్తుంది. దాంతో ఎలాంటి పరిస్థితులలోను ఆ పెళ్లి జరగదని కూతురుతో తేల్చిచెబుతాడు. దాంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన సిరి, అభిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు జగదీశ్ ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: ఇద్దరు స్నేహితులతో ఒకరు జైలుకు వెళ్లడం .. మరొకరు అతని ఫ్యామిలీని పట్టించుకోకపోవడం .. తన కూతురును గొప్పింటి ఇవ్వాలనుకోవడం .. తండ్రికి ఇష్టం లేని వ్యక్తినే ఆమె ప్రేమించడం .. ఆమెపై బాబాయి అధికారం చెలాయించడం .. ఈ తరహా సినిమాలు గతంలోనే ప్రేక్షకులు చూసి చూసి అలసిపోయి ఉన్నారు. మళ్లీ అదే కథను కొత్త ఆర్టిస్టులతో చెప్పడానికి ప్రయత్నించారు.

ఈ కథలో మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ప్రేమ .. ద్వేషం .. మోసం అనే ఈ మూడు అంశాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమలో గాఢత గానీ .. రొమాన్స్ గాని ఉండదు. కాలేజ్ లో జరిగే గొడవలకి సంబంధించిన సన్నివేశాలు గానీ, మోసానికి సంబంధించిన ప్రతీకారాలు గాని కనిపించవు. 'పగ - పగ - పగ' అనే టైటిల్ 'పగ' తీవ్రతను చెబుతుంది. కానీ అంత తీవ్రమైన 'పగ' ఏ వైపు నుంచి మనకి కనిపించదు.  

ఈ కథలో కొత్తదనం చూపించడానికి దర్శకుడు ట్రై చేశాడు. ఫస్టు పార్టులో మర్డర్ కి సంబంధించిన సుపారీ ఇవ్వడం జరిగిపోతుంది. ఆ మర్డర్ ను ఆపడానికి ట్రై చేయడం సెకండ్ పార్టుగా నడుస్తుంది. కిల్లర్ ఎవరు? ఎటువైపు నుంచి ఎలా వస్తాడు? అనే ఒక టెన్షన్ తో మిగతా కథ నడవాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో కథ కుతూహలాన్ని రేకెత్తించదు. చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. కాకపోతే అది ఉలిక్కిపడేలా ఏమీ ఉండదు. 

పనితీరు: రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కథాకథనాలు సాదాసీదాగా సాగుతాయి. పాత్రలను మలచిన తీరు చాలా కృతకంగా ఉంటుంది. ఆర్టిస్టుల నటన అంతంత మాత్రంగానే సాగుతుంది. నవీన్ కుమార్ ఫొటోగ్రఫీ .. కోటి నేపథ్య సంగీతం .. పాపారావు ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే. 

ముగింపు: రొటీన్ సాగే కథాకథనాలతో రూపొందిన సినిమా ఇది. పాత్రలను .. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు కూడా చాలా సాదాసీదాగా అనిపిస్తుంది.