మలయాళం నుంచి ఒక కామెడీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనూప్ మీనన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, మనోజ్ పలోదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జులై 18వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: రవీంద్ర (అనూప్ మీనన్) వాతావరణ శాఖలో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాడు. భార్య బిందు (షీలు అబ్రహం) పదేళ్ల కూతురు .. ఇదే అతని కుటుంబం. పెళ్లినాటి గొడవల కారణంగా అత్తవారింటికి వెళ్లడానికి అతను ఎంతమాత్రం ఇష్టపడడు. ఇక తన ఎమోషన్స్ ను అతను స్నేహితుడైన బాలుతో మాత్రమే పంచుకుంటూ ఉంటాడు. బాలు తన భార్య నుంచి విడాకులు తీసుకునే పనులతో బిజీగా ఉంటాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే అందుకు కారణమని అతను రవీంద్రతో చెబుతాడు. 

ఇక రవీంద్ర ఆఫీస్ నుంచి అపార్టుమెంటుకు రాగానే, అతని ఫ్లాట్ కి అప్పుడప్పుడు ఎవరో వచ్చి వెళుతున్నట్టుగా సెక్యూరిటీ వాళ్లు చెబుతూ ఉంటారు. బిందును అడిగితే ఎవరూ రాలేదని అంటూ ఉంటుంది. దాంతో అతను ఆమెకి తెలియకుండా అపార్ట్ మెంటుకి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ ను పరిశీలిస్తాడు. ఎవరో ఒక యువకుడు తన ఫ్లాట్ వైపు వెళ్లడం అతనికి కనిపిస్తుంది. ఆ యువకుడి మెడపై ఒక టాటూ ఉండటం గమనిస్తాడు. అప్పటి నుంచి అతనికి తన భార్యపై అనుమానం మొదలవుతుంది. 

'ఇందు' విషయంలో ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉందని అతను భావిస్తాడు. అప్పటి వరకూ తాను ప్రశాంతంగా డ్యూటీ చేయలేననే నిర్ణయానికి వస్తాడు. తాను ఒక ముఖ్యమైన పనిపై 'తిరువనంతపురం' వెళుతున్నానని బిందుకి అబద్ధం చెబుతాడు. ఆమెకి తెలియకుండా, ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండే స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అతనికి తెలిసే విషయమేమిటి? ఇందు దొరికిపోతుందా? అనేది కథ. 

విశ్లేషణ: మలయాళంలో 'రవీంద్ర నీ ఎవిడే' అంటే 'రవీంద్ర నువ్వు ఎక్కడ' అని అర్థం. టైటిల్ కి తగిన కథ ఇది. ఎంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అనుమానాలు .. అపార్థాలు చోటు చేసుకోవడం సహజంగా జరిగిపోతూ ఉంటాయి. తన భార్యకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నానే ఒక నమ్మకం చాలామందికి ఉంటుంది. అయితే అలాంటి భర్తలకు అనుమానం కలగడానికీ .. అది బలపడుతూ వెళ్లడానికి ఒక చిన్నపాటి కారణం సరిపోతుంది. ఆ చిన్న విషయంపైనే దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. 

సాధారణంగా మలయాళంలో పరిమితమైన పాత్రలతోనే పట్టుగా కథను నడిపిస్తూ ఉంటారు. ఈ సినిమా విషయంలోను అదే పద్ధతిని ఫాలో కావడం కనిపిస్తూ ఉంటుంది. రెండు .. మూడు లొకేషన్స్ లో, నాలుగైదు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. కథ నిదానంగా నడుస్తూ .. చివరికి వచ్చేసరికి ఆడియన్స్ ను టెన్షన్ పెడుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ తో, కథ మరింత పుంజుకుని ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

కథను .. పాత్రలను అక్కడక్కడే తిప్పుతూ ప్రేక్షకులను కూర్చోబెట్టిన తీరు బాగుంది. చాలా చిన్న సమస్య అనుకున్నది ఒక్కోసారి ఎలా పెద్దది అవుతుంది? బయటపడలేనంత పరిస్థితులను ఎలా సృష్టిస్తుంది? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సహజత్వానికి దగ్గరగా సాగే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 

పనితీరు: ఈ కంటెంట్ ను కథగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఒక లైన్ గా చెప్పుకోవడానికి సరిపోయేంత కథ ఇది. కానీ దర్శకుడు ఈ సింపుల్ లైన్ ను ఇంట్రెస్టింగ్ గా నడిపించిన విధానం మెప్పిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా నేచురల్ గా చేశారు. మహాదేవన్  ఫొటోగ్రఫీ .. ప్రకాశ్ నేపథ్య సంగీతం .. శ్రీకాంత్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తాయి. 

ముగింపు: ప్రేమ విషయంలోనైనా .. పెళ్లి విషయంలోనైనా ఒకరిపై ఒకరికి ఉండవలసింది నమ్మకం. ఒకరి వ్యక్తిత్వాన్ని పరీక్షించాలని అనుకున్నప్పుడే మన వ్యక్తిత్వం దిగజారినట్టుగా గ్రహించాలి. అనుమానానికి నీళ్లు పోసి పెంచవలసిన పనిలేదు. ఆదిలోనే దానిని తుంచేయకపోతే, అది అవమానాలను వెంటబెట్టుకొస్తుంది అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది.