తమిళంలో రాజు జయమోహన్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన సినిమానే 'బన్ బటర్ జామ్'. రాఘవ్  దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 18వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఆ తరువాత ఆగస్టు 22వ తేదీన తెలుగులోను రిలీజ్ చేశారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్' ద్వారా ప్రేక్షకులను పలకరించింది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

కథ: లలిత (శరణ్య) దంపతులకు ఒక అబ్బాయి .. అమ్మాయి ఉంటారు. అలాగే ఉమ( దేవదర్శిని) దంపతులకు ఒక అబ్బాయి ఉంటాడు. లలిత - ఉమ ఒక ఫంక్షన్లో కలుసుకుంటారు. లలిత కొడుకు చంద్రమోహన్ (రాజు జయమోహన్) ఇంజనీరింగ్ చదువుతున్నాడని ఉమ తెలుసుకుంటుంది. తన కొడుకు వివాహ జీవితం విడాకులతో ముగిసిన కారణంగా, కూతురు విషయంలో తెలిసిన సంబంధమైతే బాగుంటుందని ఆమె భావిస్తుంది. 

ఇక తన ఇంటికి కోడలిగా రాబోయే అమ్మాయి విషయంలో లలిత కూడా ఆందోళన చెందుతూ ఉంటుంది. తెలిసిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవడమే మంచిదని అనుకుంటుంది. ఇదే విషయాన్ని గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈ కాలం అమ్మాయిలు .. అబ్బాయిలకి లవ్ మ్యారేజ్ పట్ల ఆకర్షణ ఎక్కువ గనుక, తమ పిల్లలు ప్రేమించుకునేలా చేసి .. తాము ఒప్పుకున్నట్టుగా నటిస్తూ పెళ్లి చేయడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తారు. 

ఉమ వాళ్లది అద్దె ఇల్లు కావడంతో, తమ ఇంటికి దగ్గరగా వస్తే తాము అనుకున్న పని తేలిక అవుతుందని లలిత అంటుంది. అనుకున్నట్టుగానే లలిత పక్కింట్లోనే ఉమ ఫ్యామిలీ దిగిపోతుంది. అయితే లలిత కొడుకు చంద్రు, కాలేజ్ లో నందిని ప్రేమలో పడతాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ కూడా ఆ అమ్మాయినే లవ్ చేస్తూ ఉంటాడు. ఉమ కూతురు మధుమిత, ఆకాశ్ అనే యువకుడి ప్రేమలో పడుతుంది. లలిత - ఉమ ప్లాన్ ఫలిస్తుందా? స్నేహానికి .. ప్రేమకి మధ్య నలిగిపోయిన చంద్రు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది కథ. 

విశ్లేషణ: సినిమాలను యూత్ ఎక్కువగా చూస్తుంది. అందువలన ప్రేమకథలకు మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రేక్షకులు కోరుకునే ఫీల్ .. వాళ్లు ఆశించే కంటెంట్ ఉంటే హిట్టు దూసి ఆ సినిమా చేతిలో పెట్టేస్తారు. అలాంటి ఒక జోనర్ నుంచి వచ్చిన సినిమానే 'బన్ బటర్ జామ్'. దర్శకుడు ఎంచుకున్న కథ, వాస్తవ పరిస్థితుల నుంచి పుట్టిందనే చెప్పాలి. పెళ్లిళ్ల విషయంలో  తెలియని సంబంధాలు కలుపుకోవడానికి భయపడుతున్నారనే అంశమే ఈ కథలో ప్రధానమైనది. 

ఇక కాలేజ్ చదువు పూర్తి చేసిన అమ్మాయిలు - అబ్బాయిలు, పెద్దలు కుదిర్చే పెళ్లిళ్ల పట్ల అంత సుముఖంగా ఉండటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలోని థ్రిల్ ను వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. అందువల్లనే తమ పిల్లలు ముందుగా ప్రేమించుకునే పరిస్థితులు కల్పించి, ఆ తరువాత కాస్త బెట్టు చేసి వాళ్ల పెళ్లి జరిపించాలనే ఇద్దరు తల్లుల ప్లాన్ తో ఈ కథ తమాషాగా పరిగెడుతుంది. 

స్నేహం - ప్రేమ - పెళ్లి అనే మూడు ప్రధానమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పరిమితమైన పాత్రలతో .. పరిమితమైన లొకేషన్స్ లోనే ఈ కథ పరిగెడుతుంది. ప్రతి ట్రాక్ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందే తప్ప, హడావిడి కనిపించదు. పిల్లల విషయంలో తల్లికి ఉండే నమ్మకాలు .. భయాలు సరదాగా నవ్విస్తాయి. డ్యూయెట్ లు .. రొమాంటిక్ సీన్స్ లేకుండా  కామెడీ టచ్ తో సాగిపోయే ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.                 

పనితీరు: తాము చూసే సంబంధాలు మంచివేనా అనే భయం ఒక వైపున .. పిల్లలు ఎవరితోనైనా ప్రేమలో పడతారేమోనని మరో వైపున పేరెంట్స్ టెన్షన్ పడుతూనే ఉంటారు. అలాంటి ఒక నేపథ్యాన్ని తీసుకుని దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు బాగుంది. కథను అనేక మలుపులు తిప్పుతూ, ఒక సరైన ముగింపును ఇవ్వడం ఆడియన్స్ కి నచ్చుతుంది. ఎక్కడా ఎలాంటి అసభ్యత లేకపోవడం మరో విశేషం.

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా సహజమైన నటనను కనబరిచారు. శరణ్య - దేవదర్శిని నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బాబు కుమార్ ఫొటోగ్రఫి .. నివాస్ కె ప్రసన్న నేపథ్య సంగీతం .. జాన్ అబ్రహం ఎడిటింగ్ కథను మరింత సపోర్ట్ చేశాయి. 

ముగింపు: నిజమైన స్నేహమైనా .. నిజమైన ప్రేమైనా నిస్వార్థంలో నుంచి పుడుతుంది. అదే చివరి వరకూ నిలబడుతుంది. నిన్ను వదులుకుని వెళ్లేవారిని గౌరవించు .. వెతుక్కుంటూ వచ్చే వారిని ప్రేమించు అనే సందేశంతో కూడిన కథ ఇది. వినోదభరితమైన సన్నివేశాలకు సందేశాన్ని జోడించి ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.