కొన్ని సినిమాలు థియేటర్ వెళ్లిన ఓ నెల తరువాత ఓటీటీకి వస్తుంటే, మరి కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తూ ఉంటాయి. అలా నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమానే 'ఆదిత్య విక్రమ వ్యూహ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: విక్రమ్ తన బాల్యంలోనే తల్లిని కోల్పోతాడు. అతని తండ్రి ఓ స్కూల్ టీచర్. అయితే అతను 15 ఏళ్లుగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. విక్రమ్ కి పెద్దగా చదువు అబ్బదు. కానీ తెలివితేటలు బాగా ఉంటాయి. అందువలన క్రైమ్ కి సంబంధించిన విషయాల్లో .. ఆధారాల ద్వారా ఆ నేరస్థులు ఎవరనేది చెబుతూ పోలీసులకు సహకరిస్తూ ఉంటాడు. వాళ్లిచ్చిన డబ్బులతో బ్రతికేస్తూ ఉంటాడు.

అలాంటి  విక్రమ్ ను ఒక పోలీస్ ఆఫీసర్ కలుసుకుంటాడు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలను గురించి ప్రస్తావించాడు. హత్య జరిగిన ప్రదేశంలో హంతకుడు ఒక 'పెయింటింగ్' ను వదిలేసి వెళుతూ ఉంటాడు. అందువలన కిల్లర్ ను 'పెయింటర్' పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఏడాదిలో ఒక వారం రోజులు మాత్రమే కిల్లర్ వరుస హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ ఆదిత్యతో కలిసి సీరియల్ కిల్లర్ ను పట్టుకోమని కోరతాడు. 

హంతకుడు ఎవరనేది చెబితే తనకి 15 లక్షలు వస్తాయనే ఆశతో విక్రమ్ అందుకు ఒప్పుకుంటాడు. ఈ కేసును పరిశోధించే ఆదిత్యను కలుసుకుంటాడు. అప్పటికే ఒక హత్య చేసిన పెయింటర్ ను మిగతా హత్యలు చేసేలోగా పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. పెయింటర్ ఎవరు? ఎందుకు అతను వరుస హత్యలు చేస్తున్నాడు? విక్రమ్ కీ .. ఆదిత్యకి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఆదిత్య పోలీస్ ఆఫీసర్. విక్రమ్ నేరాలకు సంబంధించిన విచారణలో అతనికి సహకరించే వ్యక్తి. ప్రధానమైన కథ అంతా కూడా ఈ ఇద్దరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా కథల్లో మూడు ప్రధానమైన అంశాలు ఆసక్తిని రేపుతూ ఉంటాయి. నేరం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలను రచించారు అనేవే ప్రధానం. 

క్రైమ్ థ్రిల్లర్ కథల్లో ఇన్వెస్టిగేషన్ అనేదే ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చివర్లోనే రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకూ జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన పాత్రను పోషించవలసి ఉంటుంది. ఈ కథలో అలా జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి. కథ అయోమయంగా ఎటువైపు తోస్తే అటు పరిగెడుతూ ఉంటుంది.

కథ బలమైనదీ కాదు .. కథనంలో ఆసక్తి కనిపించదు. సన్నివేశాలు చాలా పేలవంగా సాగిపోతూ ఉంటాయి. సన్నివేశాలలో సహజత్వం కనిపించదు. నాటకీయంగా .. కృతకంగా నడుస్తూ ఉంటాయి. ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోకపోవడం కూడా అందుకు ఒక కారణమని చెప్పాలి. సన్నివేశాలు .. డైలాగ్స్ కూడా పేలవంగా అనిపిస్తాయి. 

పనితీరు: స్క్రిప్ట్ పై బలమైన కసరత్తు చేస్తే .. అలాగే ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ వచ్చే వరకూ వెయిట్ చేస్తే మరింత బెటర్ గా ఉండేదేమో. ప్రధానమైన పాత్రలను పోషించిన ఇద్దరూ కూడా నటనలో మరింత నైపుణ్యాన్ని సంపాదించవలసి ఉంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే. 

ముగింపు: 'ఆదిత్య విక్రమ్ వ్యూహ' అనే టైటిల్ చూసి,  ఆదిత్య - విక్రమ అనే ఇద్దరు యువకులు, 'వ్యూహ' అనే ఒక అమ్మాయి కథ కావొచ్చు అని అనుకుంటాం. కానీ ఆ ఇద్దరు యువకులు పన్నిన వ్యూహంగా ఈ కథ తెరపైకి వస్తుంది. కొత్తదనం లేని కథాకథనాలు .. పేలవమైన సన్నివేశాలతో ఈ సినిమా నీరసంగా సాగుతుంది. సరైన కసరత్తు చేయకుండా వదిలిన ఈ కంటెంట్ నిరాశపరుస్తుంది.