మలయాళం నుంచి వచ్చిన మరో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ 'ది క్రానికల్స్ ఆఫ్ ది 4.5 గ్యాంగ్'. క్రిషంద్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 28వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ లో, ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలకు పైనే ఉంది. మలయాళంతో పాటు ఇతర భాషలలోను ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.
కథ: ఈ సిరీస్ లోని కథ 90 లలో మొదలై అక్కడి నుంచి అంచలంచెలుగా ముందుకు కదులుతూ ఉంటుంది. 'తిరువంచిపురం'లో ఎక్కడ చూసినా ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకు కారణం అక్కడి రాజకీయ పార్టీలు .. అవినీతి పోలీస్ అధికారులు .. అక్రమాలకు పాల్పడే రౌడీలు. బంగారం .. డ్రగ్స్ స్మగ్లింగ్ యధేశ్చగా అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఆ పరిస్థితులను హారికుట్టాన్ మిత్ర బృందం గమనిస్తూ ఉంటుంది.
ఆ ప్రాంతంలో రౌడీలుగా ఎదిగినవారిని దెబ్బ తీయడం వలన, తాము ఒక గ్యాంగ్ గా ఎదగవచ్చని అతని మిత్ర బృందం భావిస్తుంది. వారి ఉద్దేశం అక్కడి ఎస్. ఐ. సురేశ్ కి అర్థమవుతుంది. లోకల్ డాన్ 'బ్రూస్ లీ'ని దెబ్బతీయడానికి తాను సహకరిస్తానని అతను మాట ఇస్తాడు. దాంతో హారి కుట్టాన్ ఒక పథకం ప్రకారం 'బ్రూస్ లీ'ని మంచం పట్టేలా చేస్తారు. అతని అనుచరుడు పారిపోయేలా చేస్తారు.
హారి కుట్టాన్ గ్యాంగ్ లో నలుగురు స్నేహితులతో పాటు, 'మూంగా' అనే మరుగుజ్జు ఉంటాడు. అందువలన ఆ బ్యాచ్ ను అందరూ 4.5 గ్యాంగ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ టౌన్ నుంచి కొన్ని వేల లీటర్ల పాటు సిటీకి వెళుతుంటాయని తెలుసుకున్న గ్యాంగ్, మార్గ మధ్యంలో ప్రతిరోజు ఒక వెయ్యి లీటర్ల పాలు కాజేసే ప్లాన్ ఒకటి చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటు చేసుకునే సంఘటనలు ఎలాంటివి? అనేది కథ.
విశ్లేషణ: మాస్ ఏరియాలను .. అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ కథను రెడీ చేసుకున్నాడు. కొన్ని మాస్ ఏరియాలలో నేర చరిత్ర కలిగిన కొన్ని కాలనీలు ఉంటాయి. ఆల్రెడీ ఆ కుటుంబాలకి సంబంధించిన యజమానులు ఏదో ఒక నేరంతో జైళ్లలో మగ్గుతుంటారు. ఆ కుటుంబ సభ్యులపై ఆ ప్రభావం ఎలా పడుతుంది? అదే దారిలోకి వాళ్లు ఎలా అడుగుపెడతారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది డిజైన్ చేసుకున్న తీరు బాగుంది.
ఎంతటి నేరస్థుడైనా తన కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనే కోరుకుంటాడు. అలాగే నేరస్థులకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. వ్యక్తి బలహీనుడని తక్కువగా అంచనా వేయవద్దు, వాడి వెనకున్న వర్గం 'బలంగా' ఉండచ్చనే విషయాన్ని మరిచిపోవద్దు. కుక్కపై రాయి విసిరేముందు దాని యజమాని ఎవరనే ఆలోచన కూడా చేయాలనే అంశాలను ఆయా పాత్రలను టచ్ చేస్తూ చెప్పడం కనెక్ట్ అవుతుంది.
ఈ కథలో ప్రధాన పాత్రధారి ఒక మంచి రైటర్ ను కలుసుకుని, తన జీవితచరిత్ర రాయమని చెబుతాడు. అతను చెబుతున్న కోణంలో ఈ కథ తెరపైకి వస్తుంది. పాత్రలను .. సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం చాలా సహజంగా అనిపిస్తుంది. బస్తీలలో జరిగే దృశ్యాలను నేరుగా చూస్తున్న భావన కలుగుతుంది. బస్తీలలోని కథనే అయినా గందరగోళం కాస్త ఎక్కువైనట్టుగా అనిపిస్తుందంతే.
పనితీరు: సాధారణంగా ఒక ఏరియాలో ఏ వైపు వారి నుంచి ఎలాంటి దందా జరుగుతుంది? ఆ నాయకులకు సంబంధించిన లెవెల్స్ ఎలా ఉంటాయనేది దర్శకుడు ప్రస్తావించినప్పటికీ, మొదటి నాలుగు ఎపిసోడ్స్ లోకల్ రౌడీల చుట్టూనే తిరుగుతాయి. కథ .. కథనాలు మాస్ కంటెంట్ కి తగినట్టుగానే సాగుతాయి.
రౌడీ బ్యాచ్ లు .. వాళ్ల మధ్య గొడవలు చూస్తే, ఆర్టిస్టులంతా ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారనేది అర్థమవుతుంది. విష్ణు ప్రభాకరన్ కెమెరా పనితనం .. శశి కుమార్ ఎడిటింగ్ వర్క్ తో పాటు, నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా అనిపిస్తాయి.
ముగింపు: ఇది లోకల్ రౌడీల చుట్టూ తిరిగే కథ. కొట్లాటలు .. గొడవలే ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. అంతవరకూ వాస్తవానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. అయితే ఎమోషన్స్ లేకపోవడం, లవ్ నీ .. కామెడీని పక్కన పెట్టేయడం ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది.
'ది క్రానికల్స్ ఆఫ్ ది 4.5 గ్యాంగ్' (సోనీ లివ్) సిరీస్ రివ్యూ!
The Chronicles of the 4.5 Gang Review
- మలయాళంలో రూపొందిన సిరీస్
- 6 ఎపిసోడ్స్ గా పలకరించిన కంటెంట్
- మాస్ యాక్షన్ కి ప్రాధాన్యత
- ఎక్కడా కనిపించని ఎమోషన్స్
- ఓ మాదిరిగా అనిపించే సిరీస్
Movie Details
Movie Name: The Chronicles of the 4.5 Gang
Release Date: 2025-08-28
Cast: Sanju Sivram, Nuranj, Sreenth Babu, Krishand, Jagadish, Indrans
Director: Krishand
Music: -
Banner: Srishand Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.