వెండితెరపై ఇప్పుడు గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలు రాజ్యం చేస్తున్నాయి. ఓటీటీల్లోను విలేజ్ నేపథ్యంలోని కంటెంట్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు.  ఏ మాత్రం విషయమున్నా ఈ తరహా కథలు మంచి మార్కులను కొట్టేస్తున్నాయి. అలా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమానే 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. జులై 18వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.  

కథ: 'కొత్తపల్లి' ఒక మారుమూల గ్రామం. ఆ ఊరికి పెద్దమనిషిగా రెడ్డి (బెనర్జీ) ఉంటాడు. ఒక వైపున వ్యవసాయం .. మరో వైపున 'రైస్ మిల్లు' వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. ఆయన మనవరాలే సావిత్రి(మోనిక). అదే గ్రామంలో అందరికీ వడ్డీలకు డబ్బులు ఇస్తూ, చాలా కఠినంగా వసూలు చేస్తూ ఉంటాడు అప్పన్న (రవీంద్ర విజయ్). భార్యను కోల్పోయిన ఆయన, ఒంటరిగానే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అప్పట్లో భార్య కోసం కొన్న 'బైక్' ను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. 

అప్పన్న తాను ఊళ్లో వాళ్లకి ఇచ్చిన డబ్బులకు వడ్డీలు వసూలు చేయడానికి రామకృష్ణ (మనోజ్ చంద్ర)ను నియమించుకుంటాడు. ఆ ఊరికి మొనగాడు అంటే రామకృష్ణనే. అతనికి రికార్డింగ్ డాన్సుల పిచ్చి కూడా ఉంటుంది. రెడ్డిగారి మనవరాలు సావిత్రిపై మనసుపడిన రామకృష్ణ, ఆమె ప్రేమను పొందడానికి నానా తిప్పలు పడుతూ ఉంటాడు. రెడ్డిగారి ఇంట్లో పనిచేసే ఆదిలక్ష్మిని కాకా పడుతూ ఉంటాడు. అయితే సావిత్రి మాత్రం కాస్త బెట్టుగానే ఉంటుంది. 

రెడ్డిగారికి .. అప్పన్నకి అస్సలు పడదు. అందుకు కారణం రెడ్డిగారి కళ్లముందే అప్పన్న ఎదగడం. సావిత్రి కోసం ఆదిలక్ష్మిని కాకాపడుతున్న రామకృష్ణను చూసి, అతను ఆదిలక్ష్మినే ముగ్గులోకి దింపాడని భావించిన గ్రామస్తులు, ఆమెతో అతని పెళ్లి జరిపించాలని అనుకుంటారు. రెడ్డిగారి తీర్పు కూడా అదే. రెడ్డిగారి మనవరాలిపై రామకృష్ణ మనసు పడ్డాడని గ్రహించిన అప్పన్న, ఆమెతోనే అతని పెళ్లి జరిపిస్తానని రామకృష్ణకి మాట ఇస్తాడు. అయితే ఊహించని విధంగా అప్పన్న చనిపోతాడు. గ్రామస్తులంతా అతని పీడా విరగడైందని అనుకుంటారు. కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. అదేమిటి?  అనేదే కథ. 

విశ్లేషణ: ఇది 1980 లలో నడిచే కథ అనుకోవాలి. పోస్టర్స్ నుంచే ఆ లుక్ తీసుకుని వచ్చారు. సినిమాలో ఆ వాతావరణాన్ని కూడా బాగానే చూపించారు. కాస్ట్యుమ్స్ పరంగా కూడా బాగానే వర్కౌట్ చేశారు. 1980లలో పల్లెల్లో ఉన్న వాతావరణం వేరు. అటు పాత తరానికి .. ఇటు కొత్త మార్పులకు సిద్ధమవుతూ ఉన్న ఒక సమయం అది. అందువలన ఆ రోజులకు మళ్లీ ఒకసారి వెళ్లిరావడానికి ప్రేక్షకులు ఉత్సాహపడతారు. 

గ్రామీణ నేపథ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కథను మనం చదువుతూ ఉంటే, అందుకు సంబంధించిన సన్నివేశాలను మనం ఊహించుకోవడానికి ఎంతో సహకరిస్తుంది. అలాంటి విలేజ్ నేపథ్యంలోని కథలు పేపర్ పై రాసుకోవడానికి .. వినడానికి బాగుంటాయి. ఆ స్థాయిలో దృశ్య రూపాన్ని ఇవ్వగలిగినప్పుడు, చూడటానికి కూడా బాగుంటుంది. కానీ ఈ చివరి విషయంలోనే 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా నిరాశపరుస్తుంది. 

మారుమూల విలేజ్ .. అక్కడి మనుషుల స్వభావాలు .. పెత్తనాలు .. ప్రేమలు .. మూఢ నమ్మకాలు  వంటి అంశాలను టచ్ చేశారు. అయితే వాటిలో జీవం లేదు .. కనెక్ట్ అయ్యేంతటి సహజత్వం లేదు. వడ్డీ డబ్బుల కోసం పీడించే వ్యక్తిని దెయ్యాన్ని చేయడంలో .. దైవంగా మార్చడంలో ఉద్దేశం ఏమిటనేది అర్థం కాదు. హీరో - హీరోయిన్ మధ్య మాటల్లోనే తప్ప, లవ్ - రొమాన్స్ లేకుండా చివరివరకూ తీసుకుని వెళ్లడం వలన ప్రేక్షకులకు కలిగే ప్రయోజనం ఏమిటి? అనేది కూడా అర్థం కాని విషయమే.

పనితీరు: 1980ల నాటి కాలం .. అప్పటి వేషధారణ ..  కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తాయి. అయితే వినోదపరమైన అంశాలను మేళవించి ఆవిష్కరించడంలోనే తడబాటు కనిపిస్తుంది. ఆర్టిస్టులంతా పాత్ర పరిధిలో బాగానే చేశారు. మణిశర్మ నేపథ్య సంగీతం .. పెట్రోస్ ఫొటోగ్రఫీ .. కిరణ్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: 1980లలో గ్రామీణ నేపథ్యంలోని కథలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ కాలం నాటి కథతో వచ్చిన ఈ సినిమా మాత్రం నిరాశపరుస్తుంది. నిర్మాణ పరమైన విలువలతో పాటు, కథాకథనాల విషయంలోను ఆశించిన స్థాయి కనిపించదు. ఎంచుకున్న కథ సహజత్వానికి చాలా దూరంగా ఉండటమే కాదు, సన్నివేశాల ఆవిష్కరణ పరంగా కూడా న్యాయం జరగలేదని అనిపిస్తుంది.