మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'. కోవెల మూడి సత్యసాయిబాబా .. వేమూరి హేమంత్ కుమార్ నిర్మించిన ఈ సిరీస్ కి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. వర్ష బొల్లమ్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ను, 6 ఎపిసోడ్స్ గా అందించారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: అది శ్రీకాకుళం జిల్లాలోని 'రేపల్లె' గ్రామం .. 1998వ సంవత్సరం. ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో కొత్తగా పోస్టింగ్ తీసుకుంటుంది కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి(వర్ష బొల్లమ్మ). ఒంటరిగా వచ్చిన కనక మహాలక్ష్మికి, హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు (రాజీవ్ కనకాల) తన ఇంట్లోనే ఆశ్రయిస్తామిస్తాడు. అయితే ఎస్ ఐ సదాశివం (ప్రేమ్ సాగర్)కీ, కానిస్టేబుల్ సత్తిబాబు (రమణ భార్గవ) కనకం రాకపట్ల తీవ్రమైన అసహనంతో ఉంటారు.

ఆ ఊరికి ప్రెసిడెంట్ గా ప్రకాశ్ రావు (అవసరాల) ఉంటాడు. ఆయన కనుసన్నలలోనే గ్రామస్తులంతా నడచుకుంటూ ఉంటారు. కొన్నేళ్లుగా ఆగిపోయిన అమ్మవారి 'జాతర'ను ఆ ఏడాది తప్పకుండా జరిపించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు. 'రేపల్లె'కి ఒక వైపున 'అడవిగుట్ట' ఉంటుంది. ఆ వైపు వెళ్లినవారు తిరిగిరారనే నమ్మకం జనంలో బలంగా ఉంటుంది. 

పెళ్లీడు కొచ్చిన యువతులు వరుసగా అదృశ్యమవుతూ ఉండటం అందరిలో భయాందోళనలు కలిగిస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి కనకం స్నేహితురాలు చంద్రిక (మేఘలేఖ) కూడా జాడ లేకుండా పోతుంది. అంతకుముందు రోజు రాత్రి కనకంతోనే చంద్రికను చూశామని కొంతమంది చెప్పడంతో, ఈ కేసులో కనకం చిక్కుకుంటుంది. ఈ కేసు నుంచి బయటపడటం కోసం కనకం ఏం చేస్తుంది? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? యువతులు అదృశ్యం కావడానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: అడవిని ఆనుకుని ఉన్న ఒక విలేజ్ .. అక్కడ సాగే ప్రెసిడెంట్ పెత్తనం .. ఎదురు చెప్పని పోలీసులు .. చాలా కాలం తరువాత జరుగుతున్న జాతర ఏర్పాట్లు .. కొంతకాలంగా అదృశ్యమవుతున్న యువతులు .. కాస్త అటు ఇటుగా ఇలాంటి నేపథ్యంతో కూడిన కథలు ఇంతకుముందు వచ్చాయి. అయితే ఇలాంటి ఒక వాతావరణం కలిగిన ఊళ్లోకి ఒక లేడీ కానిస్టేబుల్ రావడం కొత్తగా అనిపిస్తుంది. సిరీస్ పట్ల ఆసక్తిని పెంచుతుంది. 

ఒక వైపున దట్టమైన అడవి .. మరో వైపున గ్రామంలో మృగాల్లాంటి మనుషులు .. సహకరించని పోలీస్ అధికారులు .. మరో మార్గం లేకపోవడం వలన ఆ ఊరికి రావలసిన కనకం పరిస్థితి .. ఈ కథపై అందరిలో ఉత్కంఠను పెంచుతాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఆసక్తిని రేకెత్తించే కథనాన్ని రాసుకుంటూ వెళ్లాడు. ఆయా పాత్రలపై ప్రేక్షకులకు సందేహాన్ని కలిగిస్తూ ముందుకు వెళ్లిన తీరు మెప్పిస్తుంది. 

నిదానంగా ఈ కథ చిక్కబడేలా చేస్తూ .. ఆ తరువాత ఒక్కో ముడి విప్పుతూ వెళ్లిన తీరు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఈ కథలో విలేజ్ కి చెందినవారు భాగస్వామ్యం కాకపోవడం .. జరుగుతున్న సంఘటనల పట్ల వాళ్ల ఆందోళనను చూపించకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలు మినహా, ఆ ఊరు వాళ్లు ఏమీ పట్టనట్టుగా ఉండటం ఒక వెలితిగా అనిపిస్తుంది. అలాగే పని లేని పోలీస్ లను చూపించడం కన్నా, ఒకటి రెండు వేరే కేసులకు సంబంధించిన సీన్స్ వేసుకోవలసింది.   

పనితీరు: విలేజ్ నేపథ్యంతో కూడిన కథాకథనాలు బాగున్నాయి. కథకి .. సన్నివేశాలకి తగిన లొకేషన్స్ ఎంపిక కరెక్టుగా ఉంది. 'జాతర' ఎపిసోడ్ లో గుడికి సంబంధించిన సెట్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. 'కోవా' విషయంలో గొడవ పడటం వంటి ఒకటి రెండు సీన్స్ విషయంలో బలమైన రీజన్ ఉండేలా చూసుకోకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. 

ప్రధానమైన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ తరహా కథలకు పాత్రల మేనరిజమ్స్ మరింత ప్లస్ అవుతుంటాయి. కాకపోతే అటువైపు నుంచి ఆలోచన చేయలేదు. శ్రీరామ్ ముక్కపాటి ఫొటోగ్రఫీ .. సురేశ్ బొబ్బులి నేపథ్య సంగీతం .. మాధవ్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు.          
  
ముగింపు: ఈ కథకు ఈ టైటిల్ ప్లస్ అయిందని చెప్పాలి. అడవిని అనుకుని ఉన్న ఒక విలేజ్ లో అజ్ఞాతశక్తులు చేసే అరాచకాలను ఒక లేడీ కానిస్టేబుల్ ఎలా ఎదుర్కొంది? అనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని కారణాలు అంత బలంగా కనిపించకపోయినా, కొన్ని సన్నివేశాలలో సహజత్వం లోపించినా, ఫ్యామిలీతో కలిసి చూడదగినదే.