ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలోని వెబ్ సిరీస్ లు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ తో కూడిన కథాంశంతో 'అంధేరా' సిరీస్ రూపొందింది. టైటిల్ తో .. ట్రైలర్ తో ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. రాఘవ్ దార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

కథ: ముంబైలో కల్పన ( ప్రియా బాపట్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ధైర్యవంతురాలైన ఆఫీసర్. అయితే గతంలో జరిగిన ఒక సంఘటన ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. 'బాని బారువా' అనే స్త్రీకి సంబంధించిన మిస్సింగ్ కేసు ఆమె దగ్గరికి వస్తుంది. దాంతో ఆ కేసును పరిశోధించడానికి ఆమె రంగంలోకి దిగుతుంది. కల్పన ఈ కేసు పనిపై బాని బారువా ఇంటికి వెళ్లగా,ఆమె తల్లిదండ్రులు చిత్రంగా ప్రవర్తించడం అయోమయంలో పడేస్తుంది.       

ముంబైలోనే జయసేథ్ (కరణ్ వీర్) మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా ఉంటాడు. ఆయన అన్నయ్య పృథ్వీ ఒక హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి వాళ్లిద్దరూ కారులో ఇంటికి తిరిగొస్తూ ఉండగా, ప్రమాదానికి గురవుతారు. ఆ సంఘటన కారణంగా పృథ్వీ 'కోమా'లోకి వెళతాడు. జయసేథ్ మాత్రం సురక్షితంగా బయటపడతాడు. ప్రమాద సమయంలో తన అన్నయ్యను ఒక 'అంధకారం' అలుముకోవడాన్ని అతను చూస్తాడు. ఆ చీకటి రూపాన్ని గురించి అతను సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి 'రూమి'తో పరిచయమవుతుంది.

'బాని బారువా' కేసుతో పృథ్వీకి సంబంధం ఉందనే విషయాన్ని కల్పన కనిపెడుతుంది. బాని బారువా చనిపోయిందనే విషయాన్ని జయసేథ్ ద్వారా తెలుసుకుని షాక్ అవుతుంది. అతని నోటి నుంచే 'అంధకారం' అనే మాటను ఆమె మొదటిసారిగా వింటుంది. అక్రమంగా పృథ్వీ చేసిన ఒక ప్రయోగం వికటించి, అందులో నుంచే అంధకార శక్తి పుట్టుకొచ్చిందని తెలుసుకుంటుంది. పృథ్వీతో ఆ ప్రయోగం చేయించింది ఎవరు? దాని వెనుక ఉన్నవారి ఉద్దేశం ఏమిటి? ఈ కేసు పరిశోధనలో కల్పనకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. 

విశ్లేషణ: 'అంధేరా' .. అనే టైటిల్ కి తగిన కథతోనే సాగే సిరీస్ ఇది. అమ్మ కడుపులో ఉండగా అంతా చీకటిగానే ఉంటుంది. మరణించిన తరువాత చేరుకునేది కూడా అనంతమైన అంధకారంలోకే. జీవితంలో ఆరంభంలోను .. ముగింపులోను తోడుగా ఉండే చీకటిని చూసి భయపడకూడదు. అలాంటి చీకటితో సహవాసం చేయాలి అంటూ ఒక నెగెటివ్ కేరక్టర్ చెప్పే మాటలే ఈ కథకి పునాదిగా చెప్పుకోవచ్చు. 

ఒక్కోసారి జీవితంలో కొన్ని చిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల గురించి అనుభవంలోకి వస్తే తప్ప, ఎవరూ నమ్మరు. అలాంటి ఒక సంఘటనను ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. కొంతమంది వ్యక్తులను చీకటి వెంటాడటం .. ఆ దిశగా పోలీస్ విచారణ కొనసాగుతూ ఉండటం .. ఈ విషయాలను ఒక ముఠా పరిశీలిస్తూ ఉండటం .. దీని వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి ఒక ప్రేమజంట ప్రయత్నిస్తూ ఉండటం వంటి నాలుగు ట్రాకులను దర్శకుడు నడిపించాడు. 

ఇది సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. ఆడియన్స్ ను కొంతవరకైనా భయపెట్టగలిగిందా అంటే, భయపెట్టిందనే చెప్పాలి. జరుగుతున్న సంఘటనలు .. సన్నివేశాలు కాస్త భయపెడతాయి. కాకపోతే అంత తేలికగా .. అందరికీ అర్ధమయ్యే కథ కాదు. మధ్య మధ్యలో ఫార్వార్డ్ చేస్తూ వెళితే అర్థం చేసుకోవడం మరింత కష్టమవుతుంది. అందుకే మొదటి నుంచి చివరివరకూ చూడవలసిన సిరీస్ ఇది. అంధకారం అవతరించడానికి .. కొందరినే వెంటాడటానికి గల కారణాలు ఏమిటనేది దర్శకుడు అల్లుకున్న తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 

పనితీరు: దర్శకుడు ఒక కొత్త పాయింటును టచ్ చేశాడు. కాకపోతే సాధారణమైన ప్రేక్షకులకు అది అంత తేలికగా అర్థం కాదేమోనని అనిపిస్తుంది. చాలా సేపటివరకూ అర్థంకాని ఒక అయోమయంలోనే ఈ కథను ఫాలో కావలసి ఉంటుంది. అలా కాకుండా కాస్త తేలికగా అర్థమయ్యేలా ప్లాన్ చేసుకుని ఉంటే మరింత బాగుండేది. 

ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. పాత్రలను బాగానే రిజిస్టర్ చేశారు. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ .. వీ ఎఫ్ ఎక్స్ ఫరవాలేదు. 

ముగింపు: ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ను నాలుగు వైపులా నుంచి టచ్ చేసిన తీరు బాగుంది. కాకపోతే సాధారణ ప్రేక్షకులకు చాలా సేపటి వరకూ క్లారిటీ రాదు. కంటెంట్ కొంతవరకూ భయపెట్టిందిగానీ, విషయాన్ని మరింత సరళం చేసి చూపిస్తే బాగుండేదని అనిపిస్తుంది.