ఓటీటీ వేదికలపై గ్రామీణ నేపథ్యంలోని కథలకు ఇప్పుడు మంచి డిమాండ్ కనిపిస్తోంది. 'బలగం' సినిమా తెచ్చిన విజయం, గ్రామీణ నేపథ్యంలోని కథలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆ వరుసలో తెరకెక్కించిన సినిమాలలో ఒకటి 'బద్మాషులు'. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 8వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

కథ: 'కోతుల గూడెం' గ్రామంలో తిరుపతి (మహేశ్ చింతల), ముత్యాలు (విద్యాసాగర్) అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. తిరుపతి ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తూ ఉంటాడు. అతనికి మహా బద్ధకం ..  తాగడం కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మాయమాటలు చెబుతూ, తెలివిగా గండాల నుంచి బయటపడుతూ ఉంటాడు. అవసరమైతే, ఒకరు ఇచ్చిన బట్టలను మరొకరికి ఇచ్చేస్తూ ఉంటాడు. భార్య ఎంతగా చెప్పినా అతను వినిపించుకోడు. 

ఇక 'ముత్యాలు' విషయానికి వస్తే అతను బార్బర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి సెలూన్ షాప్ ఉంటుంది కానీ, అందులో అతను కుదురుగా కూర్చోడు. ఊళ్లో తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ కటింగ్ చేసేస్తూ ఉంటాడు. డబ్బులు చేతిలో పడితేనే తప్ప అతను కత్తెర పట్టుకోడు. సంపాదన  సంగతి అలా ఉంచితే, భార్య టార్చర్ ను భరించలేకపోతుంటాడు. అందుకు కారణం ఎదురింటి లత .. ఆమెను గతంలో అతను లవ్ చేశాడనే విషయం భార్యకి తెలియడం.  

ఇద్దరు స్నేహితులు కూడా తాగుడికి బానిసలు. పనిచేయడానికి బద్ధకిస్తూ ఉండటం వలన సంపాదన అంతంత మాత్రం. వాళ్ల గురించి తెలిసినవారెవరూ అప్పు ఇవ్వరు. దాంతో ఇద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడతారు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ల దగ్గర డబ్బులు ఎక్కడివనేది ఎవరికీ అర్థం కాదు. అప్పుడు వాళ్లకి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. అదేమిటి? పర్యవసానాలు ఎలాంటివి? అనేది కథ. 

విశ్లేషణ: తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 'బద్మాష్' అనే తిట్టు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వాడు పెద్ద ముదురు అనే మాటకు బదులుగా, వాడు పెద్ద 'బద్మాష్' గాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఇద్దరి స్నేహితుల కథ కావడం వలన, 'బద్మాషులు' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ టైటిల్ కి తగినట్టుగా ఈ కథ నడిచిందా అంటే, నడిచిందనే చెప్పాలి. 

ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. సందర్భాన్ని బట్టి కొన్ని పాత్రలు తెరపైకి వచ్చి పోతుంటాయి. కథ మొత్తంలో కాస్త గట్టిగా కనిపించే పాత్రలు ఓ పది వరకూ ఉంటాయని చెప్పచ్చు. ఈ పది పాత్రల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఒక ఊరు .. రెండు కుటుంబాలు .. ఒక పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్రలు కదులుతాయి. తక్కువ బడ్జెట్ .. సింపుల్ కంటెంట్ అన్నట్టుగానే ఈ సినిమా కనిపిస్తుంది. 

అయితే ఎక్కడా బోర్ అనిపించకుండా, సరదాగా ఈ కథను నడిపించడం విశేషం. ముఖ్యంగా తిరుపతి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర వైపు నుంచి మంచి కామెడీ ..  చివర్లో ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. ఈ తరహా పాత్రలు పల్లెల్లో కనిపిస్తూనే ఉంటాయి  కాబట్టి, కంటెంట్ వెంటనే కనెక్ట్ అవుతుంది. పల్లె వాతావరణాన్ని కలుపుకుంటూ ఎంటర్టైన్ చేస్తుంది. 

పనితీరు: పల్లెటూరి మనుషులకు .. అక్కడి పరిస్థితులకు అద్దం పట్టే కథ ఇది. బలమైన కథ .. భారీ సన్నివేశాలు కనిపించవుగానీ, సహజమైన సన్నివేశాలు ఈ సినిమాను కనెక్ట్ చేస్తాయి. పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులంతా బాగానే చేశారు. అయితే మహేశ్ చింతల నటన ఆకట్టుకుంటుంది. తన బాడీ లాంగ్వేజ్ తో ఆయన మెప్పిస్తాడు.

వినీత్ పబ్బతి ఫొటోగ్రఫీ .. గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు. తేజ కూనూరు నేపథ్య సంగీతం బాగుంది. ఇక వీటన్నింటికంటే ఎక్కువ మార్కులు కొట్టేసినవి సంభాషణలు. 'ఎలక్షన్స్ టైమ్ లో పట్టుబడ్డ మందు ఏంలేదా సార్ మన స్టేషన్లో' .. 'జీవితంలో బతికి బయట బడకుండా 100 .. 108 సెక్షన్ల క్రింద కేస్ నమోదు చేయండి సార్' .. ' ఇంటిపేరా .. ఇల్లుగట్టి చానా ఏళ్లయ్యింది సారూ .. అప్పట్లో ఇంటికి ఏం పేరుబెట్టినవో గుర్తుకు లేదు' వంటి డైలాగ్స్ నవ్విస్తాయి.

ముగింపు
: పల్లెటూరి నేపథ్యంలో అల్లుకున్న చిన్న కథ ఇది. పెద్దగా హడావిడి చేయకుండా సహజమైన సన్నివేశాలతో .. సరదా సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. అలరించే కంటెంట్ తో  గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.