ఈ మధ్య కాలంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యం ప్రధానమైన కథా వస్తువుగా మారిపోయింది. గ్రామీణ నేపథ్యంలోని కథలతో సినిమాలు .. వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. అలా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని కథతో రూపొందిన మరో వెబ్ సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ'. శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'జీ 5'లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, ఎంతవరకూ మెప్పించిందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: తెలంగాణ ప్రాంతం .. ఆలేరు మండలంలోని పక్క పక్క గ్రామాలే అయ్యారుపల్లి - ఆరేపల్లి.
అయ్యారుపల్లి గ్రామంలో సత్తెయ్య ( మురళీధర్) నర్సింగ్ (సాదన్న) అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. సత్తెయ్యకి పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరే అనిత (వర్షిణి). రీల్స్ చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటుంది. అలాంటి ఆమె పర్శి (అనిల్) ప్రేమలో పడుతుంది. పర్శికి 'హనుమవ్వ' అనే అమ్మమ్మ (సుజాత) ఉంటుంది. ఆమెనే అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. 

సత్తెయ్య - నర్సింగ్ కి రాములు అనే వ్యక్తి ద్వారా ఒక రహస్యం తెలుస్తుంది. తమ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కొంతభూమిని పట్టా చేయించాడనే విషయం బయటపడుతుంది. 5 గుంటల ఆ స్థలం హైదరాబాద్ సమీపంలో ఉందనీ, ఆ స్థలాన్ని హనుమవ్వ పేరుపై పెట్టాడనే విషయాన్ని తెలుసుకుంటారు. దాంతో వాళ్లిద్దరూ హనుమవ్వ దగ్గరికి వచ్చి, ఆ స్థలం తమ పేరు పైకి మార్చమని కోరతారు. ఆ సమయంలోనే సత్తెయ్య కూతురు అనితను పర్శి ప్రేమిస్తున్నాడనే సంగతి హనుమవ్వకి తెలుస్తుంది. 

దాంతో ఆమె తన మనవడికి అనితను ఇచ్చి పెళ్లి చేస్తే, ఆ స్థలాన్ని తాను ఇచ్చేస్తానని మాట ఇస్తుంది. అందుకు సత్తెయ్య ఆనందంగా అంగీకరిస్తాడు. మధ్యలో తనకి ఏం రాకుండా పోతున్నందుకు నర్సింగ్ ఫీలవుతాడు ఆ అక్కసుతో అతను ఏం చేస్తాడు? సత్తెయ్య తండ్రి, హనుమవ్వకు ఆ స్థలాన్ని ఎందుకు ఇస్తాడు? ఆ స్థలాన్ని చేజిక్కుంచుకోవాలనే సత్తెయ్య ప్రయత్నం ఫలిస్తుందా? అనితతో పర్శి పెళ్లి జరుగుతుందా? అనే ఆసక్తికరమైన మలుపుల ఈ కథలో కనిపిస్తాయి. 

విశ్లేషణ: 'మోతెవరి' అనే మాట తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది. ఇక్కడ భూస్వామిని 'మోతుబరి' అంటారు. పాడి - పంట - పరపతి సమృద్ధిగా ఉంటాయి .. చేతిక్రింద పనివాళ్లు ఉంటారు. నోటిమాటతో పనులవుతూ ఉంటాయి. అలాంటివారిని 'మోతుబరి' అనేవారు. అదే యాసతో 'మోతెవరి'గా మారింది. అలాంటి ఒక టైటిల్, కథను మాత్రమే కాదు, గ్రామీణ వాతావరణాన్నే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. 

దర్శకుడు మూడు తరాల వారిని టచ్ చేస్తూ ఈ కథను అల్లుకున్నాడు. అన్నదమ్ములు .. అమ్మమ్మ - మనవడు, ప్రేమికుల ఎమోషన్స్ చుట్టూ అతను ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. అన్నివైపుల నుంచి అతను ఈ కథకు న్యాయం చేస్తూ వెళ్లాడు. ముఖ్యంగా పల్లెటూరికి కూడా అతను ఒక పాత్రను ఇచ్చేశాడు. అదే మనకు అన్ని పాత్రలను దగ్గరుండి పరిచయం చేస్తుంది. ప్రతి సన్నివేశానికి కనెక్ట్ చేస్తుంది. 

పల్లె వాతావరణం .. పల్లె మనుషులు .. వారి స్వభావాలు .. రచ్చబండ విశేషాలు .. ఇవన్నీ కూడా గతంలోకి జారిపోయిన జ్ఞాపకాలు. అక్కడివరకూ వెళ్లి అవి ఏరుకునేలా చేసే కంటెంట్ ఇది. మనం కూడా ఆ విలేజ్ లో తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. డబ్బు .. పలుకుబడి ఉన్నవారు కాదు, మంచి మనసున్నవాడే నిజమైన 'మోతెవరి' అని నిరూపించే సిరీస్ ఇది.

పనితీరు: ఈ కథ ఇంతకుముందు ఎక్కడ మనం చూడనిది కాదు .. విననిది కూడా కాదు. అయితే ట్రీట్మెంట్ బాగుంది. సన్నివేశాలు చాలా సహజంగా అనిపిస్తూ, ప్రేక్షకులను కూడా సన్నివేశాలలో ఒక భాగం చేస్తూ వెళుతూ ఉంటాయి. పాత్రలను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. సహజమైన సంభాషణలు మరింత బలాన్ని తెచ్చిపెట్టాయి. 

మురళీధర్ .. సాదన్న .. సుజాత .. అనిల్ .. వర్షిణి .. ఇలా అందరూ కూడా చాలా బాగా తమ పాత్రలను పోషించారు. శ్రీకాంత్ అరుపుల ఫొటోగ్రఫీ .. చరణ్ అర్జున్ బాణీలు - నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. అనిల్ ఎడిటింగ్ కూడా ఓకే. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. 

ముగింపు: గ్రామీణ నేపథ్యంలో సరదాగా సాగిపోయే సిరీస్ ఇది. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను సమపాళ్లలో కలిపి నడిపించిన కథ ఇది. మొదటి నుంచి చివరివరకూ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది. విలేజ్ నేపథ్యంలో చాలా కాలం తరువాత వచ్చిన ఒక మంచి సిరీస్ గా ఇది మార్కులు కొట్టేస్తుంది.