శ్రీరామ్ ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ 'నెట్ వర్క్'. సతీశ్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 3 ఎపిసోడ్స్ గా 'ఆహా'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆన్ లైన్ యాప్స్ పై ఆధారపడిన ఓ నలుగురు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. అలాంటి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకటుకుందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: కిరణ్ ( శ్రీరామ్) లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అతని చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బును అతను తన బాస్ కి చేర్చవలసి ఉంటుంది. అయితే ఈ లోగా ఆన్ లైన్ జూదం ఆడటం వలన పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని భావిస్తాడు. ఆ ప్రయత్నంలోనే ఆ డబ్బు మొత్తం పోగొడతాడు. తిరిగి ఆ డబ్బును సంపాదించడం కోసం, కిడ్నాప్ కి మించిన ప్లాన్ లేదని నిర్ణయించుకుంటాడు. 

ఇక శ్రీనివాస్ విషయానికి వస్తే, అతను ఒక హాస్పిటల్లో వార్డ్ ఇంఛార్జ్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే రీల్స్ ద్వారా ఫేమస్ కావాలనే ధ్యాసలోనే అతను ఉంటాడు. రీల్స్ ద్వారా వచ్చే పాప్యులారిటీతో సినిమాల్లో ఛాన్స్ కొట్టేయాలనేది ఆయన ఆలోచన. అయితే శ్రీను చేసిన ఒక రీల్ అతనిని ప్రమాదంలోకి నెడుతుంది. ఆ ప్రమాదం అతనిని వెంటాడుతూ ఉంటుంది. అతను భయంతో పరుగులు పెడుతూనే ఉంటాడు. 

ఇక మోడ్రన్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయిన అమ్మాయి స్వేచ్ఛ. డేటింగ్ యాప్ కారణంగా, ఆమె కొత్తవ్యక్తులను నమ్ముతుంది. అదే ఆమెను చిక్కుల్లో పడేస్తుంది. ఇక మరొక యువకుడు పూర్తిగా గూగుల్ పై ఆధారపడిపోయి, పక్క సందులో ఏముందో తెలియని పరిస్థితికి వచ్చేస్తాడు. ఆన్ లైన్ యాప్స్ పై ఆధారపడటం వలన ఈ నలుగురికి ఎదురయ్యే సంఘటనలే ఈ సిరీస్. 

విశ్లేషణ
: ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఆన్ లైన్ యాప్స్ .. వాటి కారణంగా యువత ఎలాంటి చిక్కుల్లో పడుతుందనేది చూస్తూనే ఉంటాము. బలహీనులను బలంగా ఆకర్షించే శక్తి ఆన్ లైన్ యాప్స్ కి ఉంది. అందువలన ఆ యాప్స్ ఉచ్చులో పడి విలవిలలాడిపోయే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి కథలను కొన్ని కోణాలలో ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నం ఇది. 

ఆన్ లైన్ గ్యాంబ్లర్ .. ఆన్ లైన్ డేటింగ్ .. ఆన్ లైన్ ఇన్ ఫ్లూ యెన్సర్ .. ఆన్ లైన్ డిపెండెంట్ అనే నలుగురు వ్యక్తుల జీవితాల చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. అయితే ఈ నాలుగు వైపులా నుంచి నడిచే కథ ఎంత మాత్రం తన ప్రభావం చూపలేకపోయింది. స్ట్రీమింగులోకి వచ్చిన మూడు ఎపిసోడ్స్ కూడా అంతంత మాత్రంగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక కుతూహలాన్ని కలిగించడంలో విఫలమయ్యాయి. 

పనితీరు: నెట్ వర్క్ అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఈ టైటిల్ క్రింద సాగే నాలుగు ట్రాకులు చాలా బలహీనంగా కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. జరుగుతున్న సంఘటనలు సస్పెన్స్ తో గానీ, ఎమోషన్స్ తో గాని ముడిపడి లేకపోవడం వలన ఆడియన్స్ కి ఏమీ అనిపించదు. 

ఇక ఆర్టిస్టుల నటన విషయానికి వస్తే, మాట్లాడుకోవలసినంత స్థాయిలో ఆ పాత్రలను మలచలేదు. బాలసరస్వతి ఫొటోగ్రఫీ .. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం .. అనిల్ కుమార్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు: ఆన్ లైన్ యాప్స్ కారణంగా అనేక మంది జీవితాలు చిక్కుల్లో పడుతున్నాయనడానికి నిదర్శనంగా అనేక యథార్థ సంఘటనలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి సంఘటనలను తెరపై ఆవిష్కరించడానికి జరిగిన ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదనే అనిపిస్తుంది.