కొంతకాలం క్రితం వరకూ 'కోర్ట్ రూమ్' డ్రామాల పట్ల ఆడియన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. కథ మొత్తం నాలుగు గోడల మధ్య నడుస్తుంది. సంభాషణలే తప్ప సన్నివేశాలకు ప్రాధాన్యత ఉండదనే కారణంగా ఈ జోనర్ కి ఆడియన్స్ దూరమవుతూ వచ్చారు. అయితే ఈ తరహా కంటెంట్ కి  ట్రీట్మెంట్ ను మారుస్తూ రావడం ఆశించిన ఫలితాలను అందిస్తోంది. అలా తమిళంలో రూపొందిన సిరీస్ 'సట్టముమ్ నీతియుమ్'. జీ 5లో ఈ నెల 1వ తేదీ నుంచి 7 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: సుందరమూర్తి ( శరవణన్) లా చదువుతాడు. అన్నిరకాల సెక్షన్లపై ఆయనకి మంచి అవగాహన ఉంటుంది. అయితే వాదనలు - ప్రతివాదనలు తన స్వభావానికి తగినవి కాదని గ్రహించిన ఆయన నల్లకోటును పక్కన పెట్టేస్తాడు. మద్రాస్ హైకోర్టుకి సంబంధించిన 'నోటరీ పబ్లిక్'కి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ, కాలం గడిపేస్తూ ఉంటాడు. నీతీ .. నిజాయితీ కారణంగా ఆయన సంపాదించింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. అందువలన కూతురు .. కొడుకు నుంచి అసహనం ఎదురవుతూ ఉంటుంది. 

ఇక రీసెంటుగా 'లా' పూర్తి చేసిన అరుణ (నమ్రత) సుందరమూర్తి దగ్గర జూనియర్ గా చేరుతుంది. ఒక రోజున కోర్టుకి 'కుప్పుసామి' అనే ఒక వ్యక్తి వస్తాడు. తన కూతురు వెన్నెలను కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారనీ, పోలీసులు పట్టించుకోవడం లేదని సుందరమూర్తితో చెబుతాడు. ఆ విషయం గురించి సుందరమూర్తి ఆలోచన చేస్తూ ఉండగానే, ఆ వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని చనిపోతాడు. 

కుప్పుసామికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో .. లాయర్ గా తనని తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఆ కేసును వాదించాలని సుందరమూర్తి నిర్ణయించుకుంటాడు. అయితే తనకి వ్యతిరేకంగా వాదించడానికి సీనియర్ లాయర్ విశ్వనాథ్ రంగంలోకి దిగడంతో, వెన్నెల అదృశ్యం వెనుక పెద్ద తలకాయనే ఉందనే అనుమానం సుందరమూర్తికి కలుగుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? వెన్నెల ఏమైపోయింది? ఆమె అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు? ఈ కేసులో ఎవరు గెలుస్తారు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: ఈ మధ్య కాలంలో చాలా తక్కువ బడ్జెట్ లో కోర్టు రూమ్ డ్రామాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే సంభాషణలు తక్కువగా .. ఆసక్తికరమైన మలుపులు ఎక్కువగా ఉండేలా కథలను డిజైన్ చేయడం వలన, ఆడియన్స్ ను ఈ తరహా కథలు అలరిస్తూ వెళుతున్నాయి. అలాంటి సిరీస్ ల జాబితాలో 'సత్తముమ్ నీతియుమ్' కూడా చేరిపోయిందని చెప్పొచ్చు. 

సాధారణంగా ఈ తరహా కథలలో, తమ కేసుకు అవసరమైన ఆధారాలను సేకరించడం ప్రధానంగా కనిపిస్తుంది. అయితే పనికిరావని భావించిన విషయాలే ఆధారాలుగా మారడం ఈ కథకి కొత్తదనాన్ని తీసుకొస్తాయి. అన్ని వైపుల నుంచి తలుపులు మూసుకుపోయాయని సుందరమూర్తి భావించి, ఈ కేసును పక్కన పెట్టేయాలని అనుకున్న దగ్గర నుంచే ఈ కేసు మలుపు తిరగడం ఆడియన్స్ లో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. 

ఎలాంటి హీరోయిజం .. బలమైన విలనిజం అనేది హైలైట్ చేయకుండా, బయట కనిపించే పరిస్థితుల మాదిరిగానే ఈ కథను తెరకెక్కించడం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. మనం టీవీల ముందు కాకుండా కోర్టు ఆవరణలో ఉండి జరుగుతున్నదంతా గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక మంచి కంటెంట్ ను చూసిన సంతృప్తి కలుగుతుంది.            

పనితీరు: దర్శకుడు బాలాజీ సెల్వరాజ్, ఒక సింపుల్ లైన్ ను బలమైన ఎమోషన్స్ తో చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఎలాంటి హడావిడి లేకుండా .. సినిమాటిక్ ఆర్భాటాలు లేకుండా చాలా సహజంగా ఈ కథను నడిపిస్తూ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాడు. తెరపై పాత్రలు కాకుండా జీవితాలు కనిపిస్తాయి. 

ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. నిజమైన న్యాయవాదులను .. న్యాయ మూర్తులను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. వాళ్లు పాత్రలలో నుంచి బయటికి రాకపోవడం వలన,  ప్రేక్షకులు కూడా కథలో నుంచి బయటికి రారు. గోకుల కృష్ణన్ ఫొటోగ్రఫీ .. విబిన్ భాస్కర్ నేపథ్య సంగీతం .. రావణన్ ఎడిటింగ్ కథకి మరింత సపోర్ట్ చేశాయి. 

ముగింపు: ఇంట్లో నైనా .. సమాజంలో నైనా గెలుపే గౌరవాన్ని తీసుకొస్తుంది. అలాంటి గెలుపు సొంతం కావాలంటే సర్దుబాటు ధోరణి పక్కన పెట్టి కాస్తంత సాహసం చేయాలి. మానవత్వానికి ధైర్యం తోడైతే, ధర్మమే దారిచూపిస్తుంది అని నిరూపించే సందేశం మనకి ఈ కథలో కనిపిస్తుంది.