సుహాస్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ఒక్కో సినిమాను చేస్తూ వెళుతున్నాడు. ఆయన కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'ఓ భామ .. అయ్యో రామ'. ఈ సినిమాతోనే కథానాయికగా మాళవిక మనోజ్ పరిచయమైంది. రామ్ గోదల దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 1వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: రామ్ (సుహాస్) చిన్నతనంలోనే తల్లి మీనాక్షి (అనిత) చనిపోతుంది. తండ్రి ప్రేమకి దూరమైన రామ్, మేనమామ సంరక్షణలో పెరుగుతాడు. తన ప్రాణ స్నేహితులైన ఇద్దరితో మాత్రమే ఆయన తన కష్టనష్టాలు పంచుకుంటూ ఉంటాడు. రామ్ కి సినిమాలు అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనేది ఆయనకి గల కోరిక. అయితే కొన్ని కారణాల వలన అతను ఆ కోరికను కూడా పక్కన పెట్టేస్తాడు.  

ఇక వరంగల్ లోని ఒక శ్రీమంతుడి కూతురే సత్యభామ (మాళవిక మనోజ్). ఆమె తండ్రి సూర్య (పృథ్వీ) పెద్ద బిజినస్ మెన్. కూతురికి గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలనేది ఆయన కోరిక. ఓ రోజున ఆమె తాగేసి కారు నడుపుతూ ప్రమాదం బారిన పడబోతోంది. అదే సమయంలో రామ్  ఆమెను రక్షించి ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పటి నుంచి వాళ్ల మధ్య పరిచయం పెరుగుతూ అది కాస్తా ప్రేమగా మారుతుంది.

రామ్ తరచూ భయపడుతూ ఉండటాన్ని సత్యభామ గమనిస్తుంది. అతనిలోని భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అతణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో ఆమె తండ్రి ఒక సంబంధాన్ని ఖాయం చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? రామ్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అతనిలోని భయానికి గల కారణం ఏమిటి? అనేది కథ. 

విశ్లేషణ: ఈ కథ హైదరాబాద్ లో .. వరంగల్ లో జరుగుతుంది. శ్రీమంతుల కుటుంబంలో పుట్టి అల్లారుముద్దుగా పెరిగిన ఒక యువతి, తనకి కాబోయే వాడిని తానే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ అమ్మాయికి తగిన భర్తనని నిరూపించుకోవడం కోసం ఆ యువకుడు చేసే పోరాటమే ఈ సినిమా కథగా చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ వినగానే ఇందులో కొత్తదనం ఏముంది? అనిపించడం సహజం. అలా కొత్తదనం లేకుండానే రూపొందిన సినిమా ఇది. 

గొప్పింటి అమ్మాయి .. పేదవాడైన యువకుడిని ప్రేమించకూడదనేం లేదు. కాకపోతే ఆ అమ్మాయి అంతగా ఇష్టపడేంతగా అబ్బాయి వైపు నుంచి ఏముంది అనే ఎవరైనా ఆలోచన చేస్తారు. అతనితో  ప్రేమలో పడటానికి .. అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకోవడానికి అవసరమైన బలమైన సన్నివేశాలు పడాలి. నిజంగా ఇలాంటి కుర్రాడిని చేసుకోవడమే కరెక్ట్ అని ఆడియన్స్ కి అనిపించాలి. కానీ అలాంటి ప్రణాళిక ఏదీ మనకి ఈ కథలో కనిపించదు.

అసలు కథలోనే ఎలాంటి అనూహ్యమైన మలుపులు లేకుండా .. ఆసక్తికరమైన సన్నివేశాలు లేకుండా నడుస్తుంటే, హీరోయిన్ తో పిట్టకథలు చెప్పిస్తూ ప్రేక్షకులకు పెద్ద పరీక్షనే పెట్టారు. నిజానికి ఆ వైపు నుంచి కామెడీ టచ్ ఇవ్వాలని దర్శకుడు భావించి ఉంటాడు. కానీ కామెడీ వర్కౌట్ కాకపోవడంతో, ఆడియన్స్ కి ఆ వైపు నుంచి కూడా ప్రమాదం తప్పలేదు. 

పనితీరు: రొటీన్ గా అనిపించే కథనే ఇది. కొత్తదనం కోసం కొంతైనా ట్రై చేయవలసింది. అసలు కథ సాధారణంగా నడవడం ఒక మైనస్ అయితే, అనవసరమైన అంశాల వైపు వెళ్లడం మరో మైనస్ గా అనిపిస్తుంది. ఎమోషన్స్ ఉన్నాయి .. కానీ అవి ఆడియన్స్ ను బలంగా టచ్ చేయకుండానే వెళ్లిపోతూ ఉంటాయి.

సుహాస్ నటన మనకి తెలిసిందే. ఇక కొత్తమ్మాయి అయినప్పటికీ మాళవిక మనోజ్ బాగానే చేసింది. ఇతర పాత్రల్లో ఉన్న విషయం కూడా తక్కువే. హీరో స్నేహితులు .. అతని మేనమామ పాత్రలలో విషయం లేక, వాళ్లు పడిన అవస్థలు చూస్తే మనకి జాలేస్తుంది. మణికందన్ ఫొటోగ్రఫీ .. రధన్ సంగీతం .. భావిన్ షా ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు: రొటీన్ గా సాగే కథ .. దానికి తోడు అనవసరమైన సన్నివేశాలు ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తాయి. ఎమోషన్స్ గానీ .. కామెడీగాని కనెక్ట్ కాకపోవడం అసహనాన్ని కలిగిస్తుంది. ఈ కథకి .. ఈ టైటిల్ కి గల సంబంధం ఏమిటా అని కూడా అనిపించకమానదు.