తమిళంలో 'దాదా' అనే ఒక సినిమా 2023లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవిన్ - అపర్ణా దాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 40 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. రొమాంటిక్ యూత్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులో 'పాపా' పేరుతో ఈ ఏడాది జూన్ 13న విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ద్వారా అందుబాటులోకి వచ్చింది. 
 
కథ: మణికంఠ (కెవిన్) సింధు (అపర్ణా దాస్) ఓ కాలేజ్ లో చదువుతూ ఉంటారు. చదువు పూర్తయ్యేసరికి వారి ప్రేమ పతాకస్థాయికి చేరుకుంటుంది. మణికంఠ వలన సింధు నెల తప్పుతుంది. ఈ విషయం తెలిసి ఇద్దరి పేరెంట్స్ కూడా వారిని దూరం పెడతారు. దాంతో ఇద్దరూ వేరేగా ఒక ఇల్లు తీసుకుని కాపురం పెడతారు. మణికంఠకి సరైన జాబ్ లేకపోవడం వలన ఆర్ధికంగా కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. 

అప్పటివరకూ సరదాగా తిరిగిన మణికంఠకు, కుటుంబం కోసం బాధ్యతగా ఉండటం కష్టంగా అనిపిస్తుంది. అతను బాధ్యతగా లేకపోవడం సింధుకి అసంతృప్తిని కలిగిస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. సింధుకి పురిటి నొప్పులు మొదలవుతాయి. ఆఫీసులో ఉన్న మణికంఠకి ఆమె కాల్ చేస్తుంది. అయితే ఆమె పట్ల కోపంతో అతను రిసీవ్ చేసుకోడు. ఆమె తల్లిదండ్రులే వచ్చి హాస్పిటల్ కి తీసుకుని వెళతారు.       

ఆలస్యంగా విషయం తెలుసుకున్న మణికంఠ, హాస్పిటల్ కి వెళతాడు. అక్కడ సింధు కనిపించకపోవడంతో కంగారుపడతాడు. ఆమె ఓ మగ శిశువుకి జన్మనిచ్చిందనీ, ఆ శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయిందని తెలిసి షాక్ అవుతాడు. ఆ బిడ్డను అనాథ శరణాలయంలో చేరుస్తాడు. కానీ ఆ తరువాత మనసొప్పక వెనక్కి తెచ్చుకుంటాడు. ఐదారేళ్లు గడిచాక ఒక ఆఫీసులో అతనికి సింధు తారసపడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? సింధు బిడ్డను వదిలి ఎందుకు వెళ్లిపోయింది? చివరికి వాళ్లిద్దరి మధ్య అపోహలు తొలగిపోతాయా? అనేది కథ. 

విశ్లేషణ: కాలేజ్ ఏజ్ లో ఆకర్షణలు .. ప్రేమలు సహజమే. అయితే జీవితంలో స్థిరపడకుండానే పెళ్లి చేసుకుంటే .. పెళ్లికి ముందే పిల్లలను కంటే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది? అనే ప్రధానమైన ఇతివృత్తం చుట్టూ ఈ కథ అల్లుకున్నారు. భార్య ఎప్పుడూ కూడా తన భర్త నుంచి బాధ్యతను ఆశిస్తుంది. బాధ్యతను ఒంటరిగా మోయలేని ఆ భర్త చిరాకు పడటంతోనే అసలు కథ మొదలవుతుంది. ఈ విషయాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. 

ఈ కథలో .. పుట్టిన బిడ్డను హాస్పిటల్లోనే వదిలేసి సింధు పుట్టింటికి వెళ్లిపోతుంది. బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన తల్లిని వెనక్కి తీసుకుని రావడంలో అర్థం లేదని అతను భావిస్తాడు. పసిబిడ్డను పెంచడానికి నానా అవస్థలు పడతాడు. అది చూసి ఆడిటోరియంలోని వాళ్లంతా సింధుని అపార్థం చేసుకుంటారు. కానీ ఆ నిర్ణయం ఆమె ఎందుకు తీసుకుందనేది తెలిశాక కన్నీళ్లు పెట్టుకుంటారు. అందుకు సంబంధించిన సన్నివేశాలు మనసుకు బలంగా హత్తుకు పోతాయి. 

ఒక్కోసారి పిల్లల మీద పెద్దవాళ్లకి గల ప్రేమ కూడా వాళ్ల వైవాహిక జీవితాన్ని గందరగోళంలోకి నెట్టేస్తూ ఉంటుంది. కానీ స్త్రీ - పురుషుల మధ్య ఒక బంధం ఏర్పడిన తరువాత అది అన్ని బంధాల కంటే బలంగా మారుతుంది. ఒకరిని గురించి ఒకరు ఆలోచించకుండా ఉండలేని స్థితికి తీసుకొస్తుంది. అందుకే వివాహం తరువాత పిల్లల జీవితంలో పెద్దలు జోక్యం తగ్గిస్తేనే మంచిదనే సందేశం కూడా ఈ కథలో కనిపిస్తుంది.

పనితీరు: దర్శకుడు సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ఈ కథను, సహజత్వానికి దగ్గరగా .. చాలా బలంగా మలచుకున్నాడు. పాత్రలను డిజైన్ చేసే విధానంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆకర్షణ .. ప్రేమ .. పెళ్లి .. సంసారం .. వీటి మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలనే ఒక సత్యాన్ని ఆవిష్కరించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. 

ఈ సినిమా కథాకథనాలు ఒక ఎత్తయితే, కథానాయికగా చేసిన అపర్ణా దాస్ నటన మరొక ఎత్తు. చక్కని కనుముక్కు తీరుతోనే కాదు, డీసెంట్ గా అనిపించే నటనతోను ఆకట్టుకుంటుంది. కళ్లతోనే హావభావాలను పలికించి మెప్పిస్తుంది. ఆమె నటన కోసం ఈ సినిమా చూడొచ్చు అనిపిస్తుంది.  కథ .. స్రీన్ ప్లే తరువాత స్థానంలో జెన్ మార్టిన్ సంగీతం నిలుస్తుందని చెప్పచ్చు. బాణీలు .. నేపథ్య సంగీతం మనసుకు పట్టుకుంటాయి. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: జీవితమనే ప్రయాణంలో పొరపాట్లు .. తొందరపాటు నిర్ణయాలు సహజం. అంతమాత్రాన బంధాలు తెంచుకోకూడదు. విడదీసిన కాలానికి కలిపే శక్తి కూడా ఉంటుందని గ్రహించి నిరీక్షించడమే చేయవలసింది అనే సందేశం ఇచ్చిన సినిమా ఇది. యూత్ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది.