ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు తెరపైకి వచ్చాయి. అలా తమిళంలో రూపొందిన సినిమానే 'రెడ్ శాండల్ ఉడ్'. గురు రామానుజం దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో సెప్టెంబర్ 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. వెట్రి .. విశ్వనాథ్ .. గణేశ్ వెంకట్రామన్ .. దియా మయూరి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: కర్ణ (విశ్వనాథ్) చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక నానా తిప్పలు పడుతూ ఉంటాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడం .. కుటుంబాన్ని నెట్టుకు రావడానికి తండ్రి ఒక్కడే అవస్థలు పడుతుండటం అతనికి బాధను కలిగిస్తుంది. అలాంటి సమయంలోనే అతనికి 'తిరుపతి'లో ఎర్రచందనం చెట్లు కొట్టే పని దొరుకుతుంది. ఇంట్లో చెప్పకుండా అతను ఆ పనిలో చేరిపోతాడు. ఒక రోజున అతను తిరుపతిలోని ఒక బ్యాంకు నుంచి లక్ష రూపాయల వరకూ తండ్రి ఎకౌంటులో వేస్తాడు.
'కర్ణ' ఇంటికి రాకపోవడం .. తిరుపతి నుంచి అతను లక్ష రూపాయలు వేయడం అతని చెల్లెలు 'వినుత'కి అనుమానం వస్తుంది. కొడుకు గురించి ఆలోచిస్తూ ఆటో నడుపుతూ కర్ణ తండ్రి హాస్పిటల్ పాలవుతాడు. అతని పరిస్థితి కష్టంగానే ఉంటుంది. ఈ విషయాన్ని తాను మనసిచ్చిన ప్రభాకర్ తో చెబుతుంది వినుత. దాంతో అతను కర్ణను వెతుక్కుంటూ తిరుపతి వెళతాడు. కర్ణ జాడ తెలుసుకునే పనిమీద తిరుగుతుంటాడు.
కర్ణ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలో భాగమయ్యాడని ప్రభాకర్ తెలుసుకుంటాడు. అతణ్ణి అక్కడి నుంచి బయటకి తీసుకుని వెళ్లాలని అనుకున్న ప్రభాకర్, తానే పోలీసులకు దొరికిపోతాడు. అతనితో పాటు మరో ఆరుగురిని పోలీసులు ఒకచోట బంధిస్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక హరిమారన్( గరుడ రామ్) ఉన్నాడనీ, అతని వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నారనే విషయం ప్రభాకర్ కి అర్ధమవుతుంది. అసలు రహస్యం బయటికి రాకుండా తమని ఎన్ కౌంటర్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేసినట్టు అతను గ్రహిస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అక్కడ నుంచి తప్పించుకుంటాడా? కర్ణను విడిపిస్తాడా? అనేది కథ.
విశ్లేషణ: ఎర్రచందనం స్మగ్లింగ్ అనే అంశం చుట్టూ రాజకీయాలు .. రౌడీయిజం .. అధికారుల అవినీతి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే సినిమా బడ్జెట్ ను బట్టి ఈ తరహా కథలకి స్టార్స్ తోడవుతుంటారు. ఎర్రచందనం అక్రమరవాణా .. మార్గమధ్యలో జరిగే పోలీస్ దాడులు .. ఛేజింగులు ఒక రేంజ్ లో ఆవిష్కరిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాను మాత్రం చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేశారని చెప్పాలి.
ఎర్రచందనం చెట్లు కొట్టే కూలీలను బ్రోకర్లు ఎలా గేదర్ చేస్తారు? ఎవరికంటా పడకుండా వాళ్లు ఎలా అడవుల్లోకి ప్రవేశిస్తారు? ఎర్రచందనం దుంగలను ఎక్కడ దాస్తారు? ఎలా అడవి దాటిస్తారు? అనే విషయాలను సింపుల్ గానే అయినా, కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చూపించాడు. అసలైన అవినీతిపరులు అడుగుబయటికి పెట్టకుండా కూలీలతో స్మగ్లింగ్ చేయించడం, పట్టుబడినప్పుడు ఎన్ కౌంటర్ చేయించడం వంటి అంశాలు ఆలోచింపజేసేలా తెరపై ఆవిష్కరించాడు.
ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా పంజరంలో చిక్కుకున్న తన మనిషిని విడిపించుకుని వెళ్లడానికి హీరో చేసే ప్రయత్నం ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. అలాగే కూలీల జీవితాలు .. వాళ్లు అనుభవిస్తున్న ఆర్థికపరమైన ఇబ్బందులు .. ఆ కారణంగా వాళ్లు ప్రమాదకరమైన స్మగ్లింగ్ కి ఒప్పుకోవడం వంటి అంశాలు కనెక్ట్ అవుతాయి. తక్కువ బడ్జెట్ లోనే అయినా చెప్పదలచుకున్న విషయాలను దర్శకుడు సింపుల్ గా చెప్పాడు.
పనితీరు: ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో రాజకీయం .. రౌడీయిజం .. అవినీతి అధికారుల పాత్రను మూడు వైపుల నుంచి ఆవిష్కరిస్తూనే, కూలీలు ఎలా బలిపశువులవుతున్నారనేది నీట్ గా .. చాలా సింపుల్ గా చూపించారు. కూలీల జీవితాల వైపు నుంచి ఎమోషన్స్ ను టచ్ చేశారు. సహజత్వానికి దగ్గరగా ఉండే కంటెంట్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
సురేశ్ బాల ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం .. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ కంటెంట్ ను నీట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాయి. ఆర్టిస్టులంతా తమ పాత్రలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు.
'రెడ్ శాండల్ ఉడ్' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Red Sandal Wood Review
- తమిళంలో రూపొందిన సినిమా
- ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ
- సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు
- ఆలోచింపజేసే కంటెంట్
Movie Details
Movie Name: Red Sandal Wood
Release Date: 2025-08-01
Cast: Vetri, Vishvanath, Ganesh Venkatraman, Bhaskar, Diya Mayuri
Director: Guru Ramanujam
Music: Sam C S
Banner: JN Cinemas
Review By: Peddinti
Trailer