పృథ్వీరాజ్ సుకుమారన్ .. కాజోల్ .. ఇబ్రహీం అలీఖాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'సర్జమీన్' నేరుగా ఓటీటీకి వచ్చేసింది. నిన్నటి నుంచి ఈ సినిమా 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హిందీతో పాటు తెలుగు.. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం. 

కథ: కశ్మీర్ లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోతుంటారు. ఈ దాడుల వెనకున్న మాస్టర్ మైండ్  'కాబిల్' అని తెలుస్తుంది. అతనే 'మోసెన్'అనే పేరుతోను చలామణి అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దాంతో కాబిల్ ను పట్టుకోవడానికి తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగుతాడు కర్నల్ విజయ్ మీనన్ (పృథ్వీ రాజ్ సుకుమారన్).

విజయ్ మేనన్ తన తండ్రి ఇచ్చిన స్పూర్తితో ఆర్మీలో చేరతాడు. అందువలన దేశం గురించి తప్ప అతను మరి దేనిని గురించిన ఆలోచన చేయడు. భార్య మెహర్ (కాజోల్) టీనేజ్ కి వచ్చిన కొడుకు హర్మన్ (ఇబ్రహీం అలీఖాన్) ఇదే అతని ఫ్యామిలీ. హర్మాన్ కి మానసిక పరమైన సమస్య కారణంగా 'నత్తి'తో మాట్లాడుతూ ఉంటాడు. పిరికివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువలన అతని ధోరణి పట్ల విజయ్ మేనన్ అసంతృప్తితో ఉంటాడు. మెహర్ మాత్రం కొడుకును సమర్ధిస్తూ .. భర్తకు నచ్చజెబుతూ ఉంటుంది. 

ఈ నేపథ్యంలోనే కాబిల్ ను విజయ్ మేనన్ బంధిస్తాడు. దాంతో ఉగ్రవాదులు హర్మన్ ను కిడ్నాప్ చేస్తారు. కాబిల్ ను విడిచి పెట్టకపోతే, హర్మన్ ను చంపేస్తామని హెచ్చరికలు పంపుతారు. దేశాన్ని కాపాడుకోవడమా? కొడుకును రక్షించుకోవడమా? అనే ఒక సందిగ్ధం విజయ్ మేనన్ ను సతమతం చేస్తుంది. చివరికి అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు? దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: కశ్మీర్ లోని తీవ్రవాదం .. ఆర్మీ సాగించే పోరాటం .. ఆర్మీ కుటుంబాలు ఫేస్ చేసే సమస్యలు వంటి నేపథ్యంలో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలా పూర్తి యాక్షన్ మూవీగానే సాగుతుందనుకుంటే మాత్రం పొరపాటే. గతంలోని సినిమాలలో దేశభక్తినే ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమాలో దేశభక్తితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా అంతే ప్రాధాన్యతను ఇచ్చారు.

 ఒక వైపున దేశం .. ఒక వైపున ఉగ్రవాదం .. మరొక వైపున ఆర్మీ నేపథ్యాన్ని కలిగిన ఒక చిన్న ఫ్యామిలీ. తండ్రి స్పూర్తితో ఆర్మీలో చేరిన విజయ్ మేనన్ ఆశయసాధనకి కొడుకు అడ్డుపడతాడు. అటు తండ్రి చెప్పిన మాటలు .. ఇటు కొడుకు చేసే పనులు విజయ్ ని సతమతం చేస్తుంటాయి. తన లోపాన్ని అర్థం చేసుకోలేని తండ్రి తీరు పట్ల అసంతృప్తితో ఉన్న కొడుకుగా హర్మన్ పాత్రను, ఈ ఇద్దరు మధ్య నలిగేపోయే మెహర్ పాత్రను దర్శకుడు డిజైన్ చేశాడు. కాకపోతే ఏ వైపు నుంచి ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడమే ఆశ్చర్యం.
   
దర్శకుడు కొత్తదనం కోసం అన్నట్టుగా అటు యాక్షన్ కీ .. ఇటు ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చాడు. అయితే ఎమోషన్స్ లో బలం లేకపోవడంతో యాక్షన్ సీన్స్ తేలిపోతాయి. హీరో తీసుకునే నిర్ణయాలు కథను సహజత్వానికి దూరంగా తీసుకుని వెళుతుంటాయి. సన్నివేశాలను బలహీనపరుస్తూ ఉంటాయి. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ప్రేక్షకులు ఊహించగలుతుంటారు .. ఊహించిందే జరుగుతుంటుంది కూడా. అందువలన 'సర్జమీన్' ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిందనిపిస్తుంది.  
       
పనితీరు: నిర్మాణ పరంగా ఈ సినిమాకి వంకబెట్టవలసిన పనిలేదు. కథాకథనాల పరంగా మాత్రం  బలహీనంగా కనిపిస్తుంది. దేశభక్తి - ఉగ్రవాదం పాళ్లు తగ్గించి, ఫ్యామిలీ ఎమోషన్స్ పై ఎక్కువ ఫోకస్ చేయడం .. ఆ ట్రాక్ నిదానంగా సాగడం మరో మైనస్ గా కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలో వారు బాగానే చేశారు.

కమల్ జీత్ నేగి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కశ్మీర్ లొకేషన్స్ ను కవర్ చేసిన తీరు బాగుంది. విశాల్ మిశ్రా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సందర్భానికి తగినట్టుగా కుదిరింది. నితిన్ బైద్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ట్రిమ్ చేసుకోవలసిన సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. 

ముగింపు: ఒక వైపున దేశభక్తి .. మరో వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలిపి అల్లుకున్న కథ ఇది. అయితే ఈ రెండు ట్రాకులకు కూడా పూర్తి న్యాయం జరగలేదని అనిపిస్తుంది. హృదయం ఉప్పొంగే దేశభక్తి సన్నివేశాలు గానీ, మనసును కదిలించే ఎమోషన్స్ గాని లేకపోవడమే ఈ కథలోని ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.