'అన్ టేమ్డ్' అనేది అమెరికన్ డ్రామా మర్డర్ మిస్టరీ సిరీస్. ఎరిక్ బానా .. లిల్లీ శాంటియాగో .. సామ్ నీల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా రూపొందించారు. 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో, ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 - 50 నిమిషాలుగా ఉంటుంది. థామస్ బెజుచా .. నీసా హార్డిమాన్ .. నిక్ మర్ఫీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: యేసెమిటి నేషనల్ పార్క్ .. ఒక దీవిని తలపించే విశాలమైన ప్రాంతం. ఎత్తయిన పర్వతాలకు పెట్టింది పేరు. అందువలన ఇక్కడ ట్రెక్కింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ట్రెక్కింగ్ కోసం ఇద్దరు వ్యక్తులు 'ఎల్ క్యాపిటన్' నే ఒక పర్వతం దగ్గరికి చేరుకుంటారు. వాళ్లు ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఉండగా, హఠాత్తుగా ఆ కొండపై నుంచి ఒక యువతి వారిపై పడిపోతుంది. తలకి బలమైన గాయం కావడం వలన స్పాట్ లోనే చనిపోతుంది. 

ఈ విషయం తేలియగానే ఇన్వెస్టిగేటివ్ సర్వీసెస్ బ్యాచ్ కి చెందిన టర్నర్ ( ఎరిక్ బానా) అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే రెస్క్యూ బృందం అక్కడ ఉంటుంది. చనిపోయిన యువతి పేరు 'జేన్ డో' అని తెలుసుకుంటారు. అసలు ఆమె ఎవరు? ఆ పర్వతంపై నుంచి దూకేసిందా? లేదంటే ఎవరైనా తోసేశారా? అనే విషయం వాళ్లను అయోమయానికి గురిచేస్తుంది. పర్వతం పై నుంచి పడిపోవడానికి ముందే ఆమె కాలికి గాయమైందని గ్రహిస్తారు. సింహం గానీ .. తోడేళ్లు గాని దాడిచేసి ఉంటాయని భావిస్తారు. ఈ మిస్టరీని ఛేదించవలసిన బాధ్యత టర్నర్ పై ఉంటుంది.   
        
టర్నర్ కొంతకాలం క్రితం పసివాడైన తన కొడుకును కోల్పోతాడు. అప్పటి నుంచి మానసికంగా అతను దెబ్బతింటాడు. భార్య దూరం కావడం అతనిని మరింత కుంగదీస్తుంది. అయినా అతను రెస్క్యూ టీమ్ కి చెందిన 'నయా' (లిలీ శాంటియాగో)ను అసిస్టెంట్ గా తీసుకుని, 'జేన్ డో' మరణం వెనుక గల రహస్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. జేన్ డో ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె గురించిన అన్వేషణలో అతనికి తెలిసే నిజాలు ఏమిటి? అది తెలుసుకున్న టర్నర్ ఏం చేస్తాడు? అనేది కథ.      

విశ్లేషణ: ఈ కథ చాలా ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలవుతుంది. ఫస్టు సీన్ తోనే కథలోకి .. కథలో ప్రధానమైన అంశానికి సంబంధించిన పర్వతం దగ్గరికి ప్రేక్షకులను తీసుకువెళ్లి నిలబెడతారు. కథకు కనెక్ట్ కావడంలో ఈ లొకేషన్ ప్రధానమైన పాత్రను పోషించిందని అనిపిస్తుంది. కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. అవసరమైనప్పుడల్లా మనలను మళ్లీ మళ్లీ ఇక్కడికి తీసుకుని వస్తుంటుంది. 
 
హీరోకి కొడుకును కోల్పోయిన బాధ ఉంటుంది. అలాగే డిపార్టుమెంటు నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇక వృత్తి రీత్యా తనకి సహకరిస్తున్న నయా లైఫ్ కూడా ఆమె పార్ట్నర్ వైపు నుంచి రిస్క్ లో ఉంటుంది. ఆమెను ..ఆమె కొడుకును కాపాడవలసిన బాధ్యత కూడా  టర్నర్ పై ఉంటుంది. ఈ పరిస్థితులను ఎదుర్కుంటూ తాను ఎలా ముందుకు వెళ్లాడనేది దర్శకుడు చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. 

కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే కథనం నిదానంగా సాగుతుంది. పోలీస్ కథల్లో కనిపించే వేగం ఈ సిరీస్ లో కనిపించదు. అలాగని చెప్పి బోర్ కొట్టదు. కథ .. కథనం ఒక ఎత్తయితే, లొకేషన్స్ ఒక ఎత్తు అనే చెప్పాలి. కళ్లు విశాలంగా చేసుకుని .. ఆనందాశ్చర్యాలకు లోనవుతూ చూసే లొకేషన్స్ ఇవి. అద్భుతమైన ఈ విజువల్స్ ఈ కథకు మరింత బలాన్ని తెచ్చిపెట్టాయనడంలో అతిశయోక్తి లేదు.  

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులు తమ పాత్రలలో జీవించారనే చెప్పాలి.ఒక వైపున మర్డర్ మిస్టరీకి సంబంధించిన కథను నడిపిస్తూనే, మరో వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆవిష్కరించడంలో దర్శకుడు తన నైపుణ్యాన్ని చూపించాడు. కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కథకు మరింత సపోర్టుగా నిలిచింది. ఎడిటింగ్ బాగుంది. 

ముగింపు: యాక్షన్ .. అడ్వెంచర్ .. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సిరీస్ ఇది. కథాకథనాలు నిదానంగా కదులుతున్నట్టుగా అనిపించినా, కుతూహలం కొనసాగుతూనే ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ చివరివరకూ మనలను ఈ సిరీస్ ముందు కూర్చోబెడతాయి.