మలయాళంలో టోవినో థామస్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే 'నరివెట్ట'.టైటిల్ తోనే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. మే 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన సినిమా, ఈ రోజు నుంచి 'సోనీలివ్'లోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ ..  హిందీ భాషల్లోను అందుబాటులో ఉంది.

కథ: 2003వ సంవత్సరంలో నడిచే కథ ఇది. వర్గీస్ (టోవినోథామస్) కేరళలోని ఒక ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. టైలరింగ్ పనిచేస్తూ తల్లినే ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఏదైనా ఉద్యోగం చూసుకోమని ఆమె కొడుకుని పోరుతూ ఉంటుంది. అదే విలేజ్ కి చెందిన నాన్సీ (ప్రియంవద కృష్ణన్)తో అతను ప్రేమలో పడతాడు. అయితే ఎలాంటి జాబ్ లేని అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేయడం ఆమె తండ్రికి ఇష్టం ఉండదు. 

ఈ నేపథ్యలోనే పోలీస్ డిపార్టుమెంటులో వర్గీస్ జాబ్ సంపాదిస్తాడు. పై అధికారుల ధోరణి నచ్చకపోయినా, అయిష్టంగానే రోజులు నెట్టుకొస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి బషీర్ (సూరజ్ వెంజరమూడు) పరిచయమవుతాడు. వయనాడ్ లో జరుగుతున్న ఆదివాసీల పోరాటాన్ని అణచివేసే డ్యూటీ పడుతుంది. దాంతో బషీర్ టీమ్ తో కలిసి వర్గీస్ కూడా వెళతాడు. మొదటిసారిగా అతను ఆదివాసీలు భూమి కోసం చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూస్తాడు.

ఆదివాసీల వెనుక మావోయిస్టులు చేరి ఈ పోరాటం చేయిస్తున్నారనే అనుమానం సీనియర్ పోలీస్ ఆఫీసర్ రఘురామ్ (చేరన్) కి ఉంటుంది. మావోయిస్టుల జాడ కనిపెట్టడానికి వెళ్లినవారిలో బషీర్ మిస్సవుతాడు. బషీర్ ను వెతుకుతూ వెళ్లిన వర్గీస్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆదివాసీలను కట్టడి చేయడానికి వచ్చిన అతను, వాళ్లకి అండగా ఎందుకు నిలబడతాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఈ కథలో 80 శాతం వరకూ అటవీ ప్రాంతంలో జరుగుతుంది. పోలీసులకు .. ఆదివాసీలకు మధ్య జరిగే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా ఈ కథ తెరకెక్కింది. తెరపై చాలామంది కనిపించినా ప్రధానమైన పాత్రలు అరడజను వరకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఈ పాత్రలన్నీ కదులుతూ ఉంటాయి.

ముఖ్యంగా వర్గీస్ గా టోవినో థామస్ పాత్రను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్తగా పోలీస్ జాబ్ లో చేరిన వ్యక్తి. తన కంటే తన పైఅధికారులు మరింత నిజాయితీగా ఉంటారని నమ్మిన వ్యక్తి. అడవి నుంచి ఆదివాసీలను తరిమివేసే వైపు నుంచి వారికి అండగా నిలబడే వైపుకు మారిన ఆ పాత్ర ప్రయాణం ఆకట్టుకుంటుంది. న్యాయం అనేది అధికారం ఉన్నవైపు మాత్రమే ఉండదని తాను గ్రహించే సమయమే ఈ కథ.     

కథానాయకుడికి పోలీస్ జాబ్ చాలా అవసరం. ఆ జాబ్ ఉంటేనే అతను తన తల్లిని బాగా చూసుకోగలుగుతాడు. నాన్సీతో అతని వివాహం అవుతుంది. అయినా లెక్క చేయకుండా అతను న్యాయం వైపు నిలబడిన విధానమే ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. 'నరివెట్ట' అంటే 'నక్కల వేట' అని అర్థం. సినిమా చూసిన తరువాత ఇది ఈ కంటెంట్ కి తగిన టైటిల్ అనిపిస్తుంది. 
       
పనితీరు : కేరళ నేపథ్యంలో కథ ఇది. అయితే ఇతర భాషల వారికి ఇది మన కథ కాదని మాత్రం అనిపించదు. అక్కడి సమస్యగా చూస్తూనే కథకి కనెక్ట్ అవుతారు. మొదటి నుంచి చివరివరకూ సహజమైన సన్నిశాలను అల్లుకుంటూ వెళ్లిన దర్శకుడి టాలెంట్ అలా కూర్చోబెట్టేస్తుంది. ఒక పోలీస్ .. పోలీస్ లకి చిక్కడం అనే ఫస్టు సీన్ తోనే స్క్రీన్ ప్లే మేజిక్ మొదలవుతుంది. 

ప్రధానమైన పాత్రలలో కనిపించిన నటీనటులు అందరూ కూడా ఆ పాత్రలలో జీవించారు. విజయ్ ఛాయాగ్రహణం చాలా బాగుంది. అడవిలోని లొకేషన్స్ ను కవర్ చేసిన తీరు, నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భానికి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి మార్కులు కొట్టేస్తుంది. షమీర్ మహ్మద్ ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది.    

ముగింపు: అడవిని ఆక్రమించిన ఆదివాసీలను తరిమేసే ఆపరేషన్ లో భాగంగా వెళ్లిన ఓ సాధారణ పోలీస్, వాళ్లకి అండగా నిలబడటానికి దారితీసిన పరిస్థితులే ఈ కథ. మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా నడిచే ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది.